‘భారజల’ పరిధిలోని గ్రామాల అభివృద్ధికి కృషి
కర్మాగారం జీఎం జగ్గారావు
అశ్వాపురం: మణుగూరు భారజల కర్మాగారం రక్షణ పరిధిలోని గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని కర్మాగారం జీఎం జగ్గారావు అన్నారు. భారజల కర్మాగారం ఆధ్వర్యంలో గౌతమీనగర్ కాలనీ నుంచి అమెర్ద పంచాయతీ పరిధిలోని అంబేడ్కర్‌నగర్, ప్రభుత్వ జూనియర్ కళాశాలకు తాగునీటి సరఫరాను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారజల కర్మాగారం రక్షణ పరిధిలోని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శేషు, భారజల కర్మాగారం అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.
సరిహద్దు అడవుల్లో
పెద్దపులి సంచారం
అప్రమత్తమైన జిల్లా అటవీ అధికారులు
ఇల్లెందురూరల్: మహబూబాబాద్ జిల్లా గంగారం అడవుల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు అక్కడి అటవీ శాఖ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రధానంగా గంగారం రేంజ్‌కు సరిహద్దున ఉన్న కొమరారం, కాచనపల్లి రేంజ్ అధికారులు సిబ్బందితో ప్రత్యేక బృందాలను నియమించి సోమవారం ఉదయం నుంచి గస్తీ ప్రారంభించారు. నీటి వనరులు ఉన్న చోట తనిఖీలు చేపడుతూ పాదముద్రల ఆనవాళ్లను పరిశీలిస్తున్నారు. మంగళవారం బృందాల సంఖ్య పెంచి సరిహద్దు ప్రాంతాల్లో గస్తీ పెంచడంతో పాటు ప్రజలను అప్రమత్తం చేస్తామని కొమరారం, కాచనపల్లి ఎఫ్‌ఆర్‌ఓలు ఉదయ్, చలపతిరావు తెలిపారు.
11 నుంచి టీసీసీ పరీక్షలు
కొత్తగూడెంఅర్బన్ : టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్(టీసీసీ) పరీక్షలు ఈనెల 11 నుంచి జరుగుతాయని డీఈఓ ఎం.వెంకటేశ్వరాచారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. డ్రాయింగ్ లోయర్, హయ్యర్ పరీక్షలు ఉదయం 10 నుంచి 12.30, మధ్యాహ్నం 2 నుంచి 4.30 వరకు, టైలరింగ్, ఎంబ్రాయిడరీ లోయర్, హయ్యర్ పరీక్షలు ఉదయం 10 నుంచి 1, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయని వివరించారు. పరీక్షల నిర్వహణకు జిల్లాలో రెండు సెంటర్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. డ్రాయింగ్ లోయర్ పరీక్షలు చుంచుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, డ్రాయింగ్ హయ్యర్, టైలరింగ్, ఎంబ్రాయిడరింగ్ లోయర్, హయ్యర్ పరీక్షలు బాబుక్యాంపు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తామని వెల్లడించారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రం వద్దకు గంట ముందుగానే చేరుకోవాలని సూచించారు. సెల్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించబోమని స్పష్టం చేశారు. హాల్ టికెట్లను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. వివరాలకు పరీక్షల సహయ కమిషనర్(99890 27943)ను సంప్రదించాలని పేర్కొన్నారు.
గర్భిణుల ఆరోగ్యాన్ని పరిరక్షించాలి
కొత్తగూడెంటౌన్: గర్భిణులు, పాలిచ్చే తల్లుల్లో లోప పోషణ నివారణకు పోషణ్ అభియాన్ సిబ్బంది నిబద్ధతతో పని చేయాలని జిల్లా సంక్షేమశాఖాధికారి స్వర్ణలతా లెనినా అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని మహిళా శిశు, సంక్షేమశాఖ కార్యాలయంలో పోషణ్ అభియాన్ సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రతి నెలా మూడో తేదీలోపు పిల్లల ఎత్తు, బరువు వివరాలు సేకరించాలన్నారు. జిల్లా కోఆర్డినేటర్ పొనుగంటి సంపత్, జిల్లా ప్రాజెక్టు అసిస్టెంట్ బి.రాము, భ్లాక్ కో–ఆర్డినేటర్లు ఇందు, సోని, రాజ్యలక్ష్మి, రామకృష్ణ, శ్రీకాంత్, నాగిరెడ్డి, వీరేంద్ర తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment