అందరినీ మెప్పించేలా ఏర్పాట్లు చేయాలి
భద్రాచలం : ముక్కోటి ఏకాదశి సందర్భంగా భద్రాచలానికి వచ్చే భక్తులు, పర్యాటకులను మెప్పించేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. భద్రాచలంలో జరుగుతున్న పనులను సోమవారం ఆయన పరిశీలించారు. తొలుత సబ్ కలెక్టరేట్‌లోని చాంబర్‌లో ముక్కోటి ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. అనంతరం మిథిలా స్టేడియం, ఉత్తర ద్వార దర్శనం వద్ద సెక్టార్ పనులను, గోదావరి తీరం వద్ద ముక్కోటి, క్యాంప్ సైట్ పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వీవీఐపీ, వీఐపీలకు వేర్వేరుగా బారికేడ్లతో పాటు సౌకర్యాలు కల్పించాలని సూచించారు. పారిశుద్ధ్య పనులు ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. స్నానాల ఘాట్, పార్కింగ్ ప్రదేశాల వరకు విద్యుత్‌దీపాలు అమర్చాలని, తొక్కిసలాట జరగకుండా ఆలయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. తాగునీటి సౌకర్యం, ఇతర వసతులు ఏర్పాటు చేయాలన్నారు. అధికారులు, పోలీస్ సిబ్బంది వారి కుటుంబసభ్యులు, బంధువుల కోసం కాకుండా భక్తులకు దర్శనం కల్పించేలా పనిచేయాలని అన్నారు. మిగిలిన పనులన్ని మంగళవారం నాటికి పూర్తి కావాలని ఆదేశించారు. భక్తుల కోసం వైద్య శిబిరాలు, అంబులెన్స్‌లను ఏర్పాటు చేయాలన్నారు. 9, 10 తేదీల్లో మద్యం దుకాణాలను పూర్తిగా బంద్ చేయించాలని సూచించారు. ఈ ఏడాది ఏరు ఉత్సవం పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు, గిరిజన స్టాళ్లు, వంటకాలకు ఆదరణ వచ్చేలా ప్రచారం చేయాలని చెప్పారు. భక్తులు భద్రాచలంలోని క్యాంప్ సైట్‌లో విడిది చేసిన తర్వాత కిన్నెరసాని, బొజ్జిగుప్ప, బెండాలపాడు, ఐటీడీఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియాన్ని సందర్శించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. అంతకుముందు మిథిలా స్టేడియంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఎస్పీ రోహిత్‌రాజ్, భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, డీఆర్‌డీఓ విద్యాచందన, ఆలయ ఈఓ రమాదేవి, ఇరిగేషన్ డీఈ వెంకటేశ్వర్లు, ఏఈ వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయం
భద్రాచలంఅర్బన్ : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, మారుతి నర్సింగ్ కాలేజ్, లయన్స్ క్లబ్ అధ్వర్యంలో సోమవారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించగా, కలెక్టర్ జితేష్ వి పాటిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కార్యక్రమం చేపట్టిన స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయమని అన్నారు. అంధత్వ నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, ఇలాంటి వైద్య శిబిరాలకు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో సికిల్ సెల్ ఎనిమియా, తలసేమియా ఎక్కువగా ఉందని, వాటికి చికిత్స అందించేందుకు చర్యలు చేపడతామని అన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ భాస్కర్‌నాయక్, డీసీహెచ్‌ఎస్ రవిబాబు, భద్రాచలం ఏంవీఐ వెంకటపుల్లయ్య, ఆస్పత్రి సూపరింటెండెంట్ రామకృష్ణ, సంతోష్, ప్రోగ్రాం చైర్మన్ ఎస్.ఎల్.కాంతారావు తదితరులు పాల్గొన్నారు.
నర్సింగ్ సిబ్బంది సేవలు మరువలేనివి
కొత్తగూడెంరూరల్: నర్సింగ్ వృత్తి పవిత్రమైనదని, ఆ సిబ్బంది సేవలు మరువలేనివని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఇటీవల ఉద్యోగోన్నతి పొందిన హెడ్ నర్సులకు సోమవారం ఐఎంఏ హాల్‌లో అభినందన కార్యక్రమం నిర్వహించగా, కలెక్టర్ హాజరై మాట్లాడారు. ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా పేషంట్లకు చికిత్స అందించడమే లక్ష్యంగా సేవలు అందిస్తున్న నర్సులను ప్రశంసించారు. కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్ రవిబాబు, టీవీవీపీ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు రామకృష్ణ, రాంప్రసాద్, రాధారుక్మిణి, సునీల్ మజ్నేకర్, హర్షవర్దన్, జీజీహెచ్ సూపరింటెండెంట్ రాధామోహన్ పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి పాటిల్
కాటేజీల పనులు ఇంకెన్నాళ్లు..
పాల్వంచరూరల్ : పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిని సోమవారం కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. కేటీపీఎస్ గెస్ట్‌హౌస్‌లతోపాటు అసంపూర్తిగా ఉన్న ఫుడ్ కోర్టును పరిశీలించారు. ముక్కోటి సందర్భంగా వచ్చే భక్తులు, పర్యాటకులకు కిన్నెరసానిలో కల్పించాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. ఎంతమంది వచ్చినా అసౌకర్యం కలగకుండా గెస్ట్‌హౌస్‌లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. కిన్నెరసాని గుట్టపై ఉన్న కాటేజీలు, ఇల్లెందు క్రాస్‌రోడ్డులోని హరిత హోటల్ పనులు ఎప్పటికి పూర్తవుతాయని సంబంధిత అధికారులను ఫోన్ ద్వారా ఆరా తీశారు. త్వరగా పూర్తి చేసి అప్పగించాలని ఆదేశించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ విద్యాచందన, ఎంపీడీఓ కె.విజయభాస్కర్‌రెడ్డి, ఏపీఎం రాంబాబు, సీసీ రవి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment