ఆదివాసీ సంస్కృతి ప్రతిబింబించాలి
● కనకగిరి గుట్టలకు 11న పలువురు పర్యాటకులు.. ● ఏర్పాట్లు అద్భుతంగా ఉండాలి ● కలెక్టర్ జితేష్ వి పాటిల్
చండ్రుగొండ : దేశం నలుమూలల నుంచి పలువురు ప్రముఖులు ఈనెల 11న కనకగిరి గుట్టలను సందర్శించనున్నారని, ఆదివాసీ సంస్కృతి ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మండలంలోని బెండాలపాడు శివారులో గల కనకగిరి గుట్టలను మంగళవారం ఆయన సందర్శించారు. ఇటీవల తయారు చేసిన వెదురు ఉత్పత్తులను పరిశీలించారు. పర్యాటకులు ఆశ్చర్యపోయోలా ఏర్పాట్లు ఉండాలని, చారిత్రక ప్రాంతమని చూడగానే అర్థమయ్యేలా నేమ్‌బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆదివాసీ సంప్రదాయ వంటకాలను రుచి చూశారు. బేస్ క్యాంప్ షెడ్‌ను పరిశీలించారు. పర్యాటకుల సందర్శన నేపథ్యంలో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా స్థానిక ఆదివాసీలే మార్గదర్శకత్వం వహించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీఓ బయ్యారపు అశోక్, బ్యాంబో క్లస్టర్ డైరెక్టర్లు ఈసం నాగభూషణం, మల్లం కృష్ణయ్య, నాయకులు భోజ్యానాయక్, ఎస్కే ఫజల్, వీసం రాములు, బొర్రా లలిత పాల్గొన్నారు.
‘భూమాత’ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి..
సూపర్‌బజార్(కొత్తగూడెం): భూమాత పోర్టల్ అమలుకు ముందు మాడ్యూల్‌లో తలెత్తే సమస్యలను గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పాటిల్ అన్నారు. అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్‌తో కలిసి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూమాత మాడ్యూల్ పోర్టల్‌లో తలెత్తే సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను తహసీల్దార్లు లిఖితపూర్వకంగా నిర్దేశిత పట్టిక ద్వారా తెలియజేయాలని ఆదేశించారు. జిల్లాలో ఎక్కువగా ఉన్న భూ సమస్యలను గుర్తించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. ఆర్‌ఓఆర్ చట్టం, కొత్తచట్టంపై అవగాహన ఉండాలన్నారు.
జిల్లా చరిత్ర తెలిపేందుకే రివర్ ఫెస్టివల్
భద్రాచలంటౌన్: ముక్కోటికి భద్రాద్రికి వచ్చే భక్తులు, పర్యాటకులను కనువిందు చేయడంతో పాటు జిల్లా చరిత్ర తెలిపేందుకే ఏరు(రివర్)ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని కలెక్టర్ అన్నారు. మంగళవారం ఆయన భద్రాచలంలో పలు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం చరిత్రను ఖండాంతరాలకు వ్యాపించేలా తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం వేడుకలను వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈనెల 8, 9, 10 తేదీల్లో గిరిజన విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీఓ దామోదర్ రావు, అధికారులు రాంప్రసాద్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, రమణయ్య, హరికృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment