పర్ణశాలలో ట్రయల్ రన్ విజయవంతం
దుమ్ముగూడెం : ప్రముఖ పుణ్యక్షేత్రమైన పర్ణశాల వద్ద గోదావరిలో గురువారం నిర్వహించే తెప్పోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు మంగళవారం భద్రాద్రి రామాలయ ఈఓ రమాదేవి, సీఐ అశోక్, ఇరిగేషన్ జేఈ రాజ్‌సుహాస్, ఆర్‌ఐ నరసింహారావు పర్యవేక్షణలో చేపట్టిన ట్రయల్‌రన్ విజయవంతమైంది. తెప్పోత్సవానికి పర్ణశాల ఆలయానికి వచ్చే భక్తులకు విక్రయించే లడ్డూ ఇతర ప్రసాదాలను సిద్ధం చేశామని ఆలయ ఇన్‌చార్జ్ అనిల్‌కుమార్ తెలిపారు. భక్తులు గోదావరిలోకి దిగకుండా ఇనుప కంచె ఏర్పాటు చేశామని, ఎనమిది మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుతున్నామని పేర్కొన్నారు.
హెడ్ కానిస్టేబుల్‌కు
ఎస్పీ అభినందన
కొత్తగూడెంటౌన్ : రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో ప్రతిభ చాటి మూడు పతకాలు సాధించిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ పి.వీరభద్రంను ఎస్పీ రోహిత్‌రాజ్ మంగళవారం అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వీరభద్రం పతకాలు సాధించి జిల్లా పోలీస్ శాఖకు పేరు తేవడం హర్షణీయమని అన్నారు. రాష్ట్రస్థాయిలో రాణించి ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరగనున్న జాతీయస్థాయి పోటీలకు సైతం ఎంపికయ్యారని, ఇది గర్వించదగిన విషయమని చెప్పారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, ఆర్‌ఐలు సుధాకర్, నర్సింహారావు, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ సమస్యలపై
నిర్లక్ష్యం తగదు
సీజీఆర్‌ఎఫ్ చైర్మన్ వేణుగోపాలాచారి
అశ్వారావుపేటరూరల్: విద్యుత్ సమస్యలపై నిర్లక్ష్యం చేయొద్దని, వినియోగదారులకు సకాలంలో న్యాయం అందించడమే విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక లక్ష్యమని సీజీఆర్‌ఎఫ్ చైర్మన్ ఎన్.వి.వేణుగోపాలాచారి అన్నారు. మండలంలోని వినాయకపురం సబ్ స్టేషన్ ఆవరణలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. నాణ్యమైన విద్యుత్ అందించడంతో పాటు వినియోగదారుల సమస్యలు సకాలంలో పరిష్కరించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. విద్యుత్ సమస్యలు కింది స్థాయిలో పరిష్కారం కాకుంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. అనంతరం వివిధ సమస్యలపై ఎనిమిది మంది వినతులు అందించగా, వాటిని పరిశీలించి త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో టెక్నికల్, ఫైన్సాన్స్ మెంబర్లు రమేష్, ఆర్.చరణ్‌దాసు, ఇండిపెండెంట్ మెంబర్ ఎం. రామారావు, ట్రాన్స్ కో ఎస్‌ఈ జి. మహేందర్, డీఈఈ నందయ్య, ఏడీఈ వెంకటరత్నం, ఏఈలు సంతోష్, సాయికిరణ్, రవి, రమేష్ పాల్గొన్నారు.
కళాశాలలో తనిఖీ
దుమ్ముగూడెం : స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఇంటర్ బోర్డు డిప్యూటీ కార్యదర్శి యాదగిరి మంగళవారం తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ.. తల్లిదండ్రుల ఆకాంక్షలు నెరవేర్చేలా కష్టపడి చదవాలని, జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. అనంతరం కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందితో సమావేశమై పలు విషయాలు చర్చించారు. కార్యక్రమంలో డీఐఈఓ వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీఏ సభ్యుడిగా
పాల్వంచ మండల వాసి
పాల్వంచరూరల్ : రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ కమిటీ సభ్యుడిగా(నాన్ అఫిషియల్) పాల్వంచ మండలం జగన్నాథపురం పంచాయతీ పరిధిలోని పెద్దమ్మగుడి ప్రాంతానికి చెందిన బాదర్ల జోషి నియమితులయ్యారు. ఈ మేరకు ఆర్టీఏ కమిషనర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, తన నియామకానికి సహకరించిన ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి తదితరులకు జోషి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment