అభివృద్ధి కోసమే కార్పొరేషన్
● అపోహలొద్దు.. గిరిజన చట్టాలకు ఆటంకం ఉండదు ● ఎమ్మెల్యే కూనంనేని
సూపర్‌బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధికి కార్పొరేషన్ దోహదం చేస్తుందని, ఇందుకోసం శక్తి వంచన లేకుండా కృషి చేసి సాధించానని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కార్పొరేషన్ ఏర్పాటుతో నష్టమనే ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని టూరిజం హోటల్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కార్పోరేషన్ ఏర్పాటుతో ప్రజల ఆస్తుల విలువలు పెరుగుతాయని, జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అన్నారు. ఇప్పటికే పారిశ్రామికంగా అభివృద్ధి సాధిస్తున్న కొత్తగూడెంలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని చెప్పారు. పారిశ్రామికాభివృద్ధిలో రాష్ట్రంలోనే జిల్లా ద్వితీయస్థానంలో ఉందన్నారు. సుదీర్ఘకాలంగా ఎన్నికలు జరగని పాల్వంచ మున్సిపాలిటీకి కూడా ఇప్పుడు మార్గం సుగమం అవుతుందని తెలిపారు. కార్పొరేషన్ ఏర్పాటుతో అధికంగా నిధులు మంజూరవుతాయని, తద్వారా అభివృద్ధితో పాటు ఉద్యోగవకాశాలు కూడా పెరుగుతాయని చెప్పారు. గిరిజనులకు, గిరిజన చట్టాలకు, రిజర్వేషన్లకు, గిరిజనుల ఆస్తులకు ఎలాంటి నష్టం ఉండదని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ పూర్తిగా గిరిజన రాష్ట్రాలని, అయినా అక్కడ కార్పొరేషన్ విధానం అమల్లో ఉందని వివరించారు. పన్నులు పెరుగుతాయని, ఉపాధిహామీ పథకంలో గిరిజనులకు అన్యాయం జరుగుతుందనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఎలాంటి మార్పులు లేకుండా కార్పొరేషన్ పాలనా విధానం మాత్రమే కొనసాగుతుందని తెలిపారు. ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ పెరుగుతుందన్నారు. నియోజకవర్గానికి మరో వరంగా రామవరం – గరీబ్‌పేట ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటుకు అవసరమైన సర్వేకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.38 లక్షలు మంజూరు చేసిందని చెప్పారు. ఈఎస్‌ఐ ఆస్పత్రి, నూతన బొగ్గు గనులు, ఐటీ హబ్, క్రీడా మైదానాలు, ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. కార్పొరేషన్ ఏర్పాటుకు సహకరించిన సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతల తెలిపారు. సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబిర్‌పాషా, నాయకులు చంద్రగిరి శ్రీనివాసరావు, రాజ్‌కుమార్, కంచర్ల జమలయ్య, వాసిరెడ్డి మురళి, వంగా వెంకట్, కాంగ్రెస్ నాయకులు కంచర్ల చంద్రశేఖర్‌రావు, నాగ సీతారాములు, ఆళ్ల మురళి, యర్రంశెట్టి ముత్తయ్య, దేవీప్రసన్న పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment