రమణీయం.. రామావతారం
● నిజరూపంలో స్వామివారి అలంకరణ ● నేడు బలరామావతారంలో దర్శనం
భద్రాచలం: చక్కని సీతమ్మ ఒడిలో, పక్కన సోదరుడు లక్ష్మణుడు, రెండు చేతుల్లో శంఖుచక్రాలు, మరో రెండు చేతుల్లో ధనుర్బాణాలను ధరించి లోక రక్షణకు నేనున్నానంటూ భక్తులకు అభయమిస్తూ దర్శనమిచ్చారు భద్రాద్రి రామయ్య. ఆదర్శ పురుషుడు, ఏకపత్నీవ్రతుడైన రామవతారాన్ని చూసి తరించిన భక్తులు రమణీయమని కొనియాడారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న ముక్కోటి ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాల్లో భాగంగా సోమవారం నిజరూపంలో స్వామివారిని అలంకరించారు. ఈ సందర్భంగా ఉదయం ఆరాధన గావించి, బేడా మండపంలో స్వామి వారి ఉత్సవమూర్తులతో పాటు 12 మంది ఆళ్వార్లను కొలువుదీర్చారు. వేదపండితులు 200 పాశురాలను పఠించారు. అనంతరం స్వామివారిని భక్తుల శ్రీరామనామస్మరణల నడుమ ప్రత్యేక పల్లకీలో ఉంచి వేదపండితుల మంత్రోచ్ఛరణలు, మేళతాళాలు, మహిళల కోలాటాల నడుమ మిథిలా స్టేడియంలో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపైకి తీసుకొచ్చి కొలువుదీర్చారు. ఈ సందర్భంగా భక్తులు నిజరూపంలో ఉన్న రామయ్యను దర్శించుకుని పులకించిపోయారు. వ్యక్తిగత సౌఖ్యాలకన్నా ధర్మాచరణయే ఉత్తమ మైనదని, అదే శాశ్వతమైనదని శ్రీరాముడు లోకానికి చాటి చెప్పాడని, పరిపూర్ణమైన మానవుడు ఎలా ఉండాలో ఆచరించి చూపించిన అధర్శ పురుషుడు, మర్యాద పురుషోత్తముడు, ధర్మ స్వరూపుడు రాముడేనని ఆలయ అర్చకులు, పండితులు రామావతార విశిష్టతను వివరించారు.
భక్తులకు 2 లక్షల లడ్డూలు..
తెప్పోత్సవం, ముక్కోటికి వచ్చే భక్తులకు దేవస్థానంఽ ఆధ్వర్యంలో ప్రసాదాలను ముందస్తుగా తయారు చేస్తున్నారు. సీఆర్‌ఓ కార్యాలయం పై భాగంలో ప్రత్యేకంగా నియమించిన కార్మికులతో లడ్డూలు తయారవుతున్నాయి. భక్తుల రద్దీని బట్టి సుమారు 2 లక్షల లడ్డూల వరకు సిద్ధం చేయనున్నారు. అలాగే ఉత్తర ద్వారం వద్ద స్టేడియం ఎదురుగా వీవీఐపీలు, వీఐపీలు, భక్తులు కూర్చునేందుకు సెక్టార్‌ల విభజన జరిగింది. తెప్పోత్సవం జరిగే హంస వాహనం ట్రయల్ రన్‌ను సైతం అధికారులు పూర్తి చేశారు. మరో సారి ట్రయల్ రన్ అనంతరం విద్యుత్ దీపాలను అలంకరిస్తారు.
నేడు బలరామావతారంలో దర్శనం..
శ్రీహరికి శయనమైన ఆదిశేషుని అంశతో జన్మించి.. ‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అన్న నానుడికి ప్రతీకగా నాగలిని ఆయుధంగా ధరించి శ్రీకృష్ణుడికి అన్నగా నిలిచి, ఆయనకు ధర్మ స్థాపనలో సహకరించిన అవతారం శ్రీ బలరామావతారం. సంకర్షణునిగా పిలవబడే బలరాముడు ప్రలంబాసురడనే రాక్షసుని సంహరించాడు. ఈ అవతారాన్ని దర్శించిన వారకి మాందిగూళికా గ్రహాల బాధలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. అధ్యయనోత్సవాలలో భాగంగా స్వామి వారు మంగళవారం బలరామావతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment