వరాహావతారంలో భద్రాద్రి రామయ్య
దేవస్థానంలో కొనసాగుతున్న
అధ్యయనోత్సవాలు
భద్రాచలం: లోకకంటకుడైన హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని తన కోరలతో పైకెత్తి లోకసంరక్షణ చేపట్టిన వరాహావతారంలో రామయ్య స్వామి భక్తులకు దర్శనమిచ్చాడు. భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. పగటి పూట జరిగే పగల్ పత్తు ఉత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారిని వరాహావతారంలో ప్రత్యేకంగా అలంకరించారు. తెల్లవారుజామునే ఆలయంలో స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించి ఆరాధన, ఆరగింపు ఇచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలోని బేడా మండపం వద్దకు తీసుకొచ్చి పూజలు జరిపారు. ఆ తర్వాత వేద పండితులు దివ్య ప్రబంధాలు చదివారు. అనంతరం స్వామివారిని గర్భగుడిలో వరాహావతారంలో అలంకరింపజేశారు. గర్భగుడి నుంచి బేడా మండపానికి తీసుకొచ్చి ఆళ్వార్లతో కొలువుదీర్చారు. ప్రత్యేక పూజలు అనంతరం పల్లకీపై ఊరేగింపుగా మంగళవాయిద్యాలు, బాజా భజంత్రీలు, భక్తుల కోలాహలం నడుమ మిథిలా స్టేడియ ప్రాంగణంలోని ఏర్పాటు చేసిన వేదికపై కొలువుదీర్చారు. ఆలయ అర్చకులు స్వామి వారికి హారతిని ఇవ్వగా, భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం కోలాటాల నడుమ భక్తుల రామనామస్మరణలతో తిరువీధి సేవ సాగింది. తాతగుడి సెంటర్‌లోని గోవిందరాజస్వామి ఆలయం వరకు స్వామివారిని తీసుకెళ్లి, అక్కడ నుంచి ఊరేగింపుగా తిరిగి ఆలయానికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేదపండితులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నేడు నరసింహావతారంలో దర్శనం
తన ప్రియభక్తుడైన ప్రహ్లాదుని అనేక బాధలకు గురిచేస్తున్న హిరణ్యకశిపుడు అనే రాక్షసుడిని సంహరించేందుకు నారాయణుడు నరసింహావతారాన్ని ధరించాడు. ఈ అవతార నిడివి స్వల్పకాల్పమైనా భగవానుని సర్వవ్యాపకతను తెలియజేస్తుంది. భూత గ్రహ, కుజ గ్రహ బాధలు ఉన్నవారు ఈ అవతారాన్ని పూజించటం వల్ల విముక్తి పొందుతారని శాస్త్రం చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment