ఉన్న వనరులతోనే ఉపాధి..
ఉద్యోగాలు రాలేదని పట్టభద్రులు.. రుణాలు ఇవ్వలేదని నిరుద్యోగులు నిత్యం ఆవేదన చెందుతుంటారు. పనిలో పనిగా పాలకులను తూలనాడుతుంటారు. కానీ75 ఏళ్ల గణతంత్ర భారతావనిలో ప్రభుత్వ సాయానికి తోడు.. ఉన్న వనరులనే సద్వినియోగం చేసుకుంటూ.. జీవనోపాధి పొందుతున్నారు. మరికొందరికి పని కల్పిస్తున్నారు. వారిలో పట్టభద్రులూ, పట్టాలు లేనివారూ ఉన్నారు. ఏజెన్సీ ఆదివాసీ మహిళలు, గిరిజన రైతులు స్వశక్తితో ఆదాయం పొందుతున్నారు. సర్కారు నుంచి అందే సాయమే ఆలంబనగా ప్రగతి పథంలో పయనిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. గణతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా వారిలో కొందరి గురించి తెలుసుకుందాం.
● ఆదివాసీ సంప్రదాయ వంటలతో ఆదాయం..
● బీడు భూముల్లో ‘సౌర’భాలు..
● సోలార్ విద్యుత్ మోటార్లతో పంటల సాగు ● ఏటా రెండు పంటలు పండిస్తున్న 90 మంది రైతులు ● ఇందిరా జలప్రభ పథకంతో గిరిజనుల ఆర్థిక పరిపుష్టి
● ఆర్థికంగా ఎదుగుతున్న ఆదివాసీ మహిళలు ● బీడు భూముల్లో రెండు పంటలు పండిస్తున్న రైతులు ● ఆదాయం పెంచుకుంటూ కుటుంబాల బలోపేతం
భద్రాచలం: ఏజెన్సీలోని ఆదివాసీ గిరిజన మహిళలు సమష్టిగా స్వయం ఉపాఽధి మార్గాల వైపు పయనిస్తున్నారు. అందుబాటులో ఉన్న వనరులనే సద్వినియోగం చేసుకుంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెరిగిన నేపథ్యంలో గిరిజన మహిళలు మిల్లెట్స్‌తో వంటకాలు తయారు చేసి విక్రయిస్తున్నారు. జజ్జర్ల సమ్మక్క, ఊకా వెంకట కృష్ణ, వెంకటలక్ష్మి, తాటి లలిత, సోయం మంగవేణిలు గ్రూపుగా ఏర్పడి ఐటీడీఏ నుంచి రుణం పొంది చిన్నతరహా పరిశ్రమ ఏర్పాటు చేశారు. అది ఆశాజనంగా లేకపోవడంతో సామలు, రాగి, జొన్న వంటి ఆదివాసీ సంప్రదాయ పంటలతో భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్ పేరుతో బిస్కెట్ల తయారీ మొదలుపెట్టారు. ఐటీడీఏ అధికారులు కార్యాలయ ఆవరణలోనే బిస్కెట్ల తయారీకి ఓ భవనంలో అవకాశం కల్పించారు. అమ్మకాలకు తహసీల్దార్ కార్యాలయానికి సమీపంలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో షట్టర్ కేటాయించారు. దేవస్థానం వద్ద కూడా విక్రయాలు జరుపుతున్నారు. ఆన్‌లైన్ మార్కెటింగ్‌కు ఐటీడీఏ అధికారులు సహకరించాలని గ్రూప్ సభ్యురాలు జజ్జర్ల సమ్మక్క కోరుతోంది.
మిల్లెట్స్ టిఫిన్
గిరిజన యువతీ యువకులు ఆరోగ్య పరిరక్షణకు మిల్లెట్స్‌తో తయారు చేసిన అల్పాహారాన్ని అందించేందుకు ‘న్యూట్రి మిల్లెట్ హబ్’, అరకు కాఫీ పౌడర్‌తో కాపీ ‘కాఫీ హౌస్’ను భద్రాచలంలో ఏర్పాటు చేశారు. రాగి కుడుములు, జొన్న కుడుములు, కువిముల లడ్డూ, రాగి పకోడి, రాగి ఇడ్లీ, సజ్జల దోశ, జొన్న దోశ, జొన్న రోటీ, సామల దోశలను ఉదయం, సాయంత్రం వేళ విక్రయిస్తున్నారు. పీజీ పట్టభద్రుడైన పాయం రాజేంద్రప్రసాద్ ఆదివాసీ వంటలపై ఫెలోషిప్ సైతం తీసుకున్నాడు. 2017 నుంచి కోయ క్యూజన్ పేరుతో గిరిజన మహిళలు మడకం భారతి, మరో పది మంది సభ్యులతో కలిసి భద్రాచలంలో అల్పాహారం విక్రయిస్తున్నాడు. అస్సాం టీ, అరకు, బెంగళూరు కాఫీ, ఇప్ప పువ్వు టీ, కరకాయ టీలను ప్రజలకు, భక్తులకు అందుబాటులోకి తీసుకొని వచ్చారు. ప్రభుత్వ సాయం ఆశించకుండా స్వశక్తితో స్వయం ఉపాధి పొందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment