బొగ్గు ఉత్పత్తిలో నాణ్యత పాటించాలి
● త్వరలోనే ఒకటి, రెండు గనులు పూర్తిగా మహిళలకు కేటాయింపు ● సంస్థ మరో వందేళ్లు నడవాలంటే ఉద్యోగులు బాధ్యతగా పని చేయాలి
గణతంత్ర వేడుకల్లో సింగరేణి సీఎండీ బలరామ్
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణిలో ఉత్పత్తి చేసే బొగ్గు నాణ్యంగా ఉండేలా జనరల్ మజ్దూర్ నుంచి జీఎం వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని సీఎండీ ఎన్.బలరామ్ పిలుపునిచ్చారు. కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ఆదివారం జరిగిన గణతంత్ర వేడుకల్లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. సింగరేణిలో ఉత్పత్తయ్యే బొగ్గుతో తెలంగాణతో పాటు మరో ఏడు రాష్ట్రాల్లో విద్యుత్ తయారవుతోందని చెప్పారు. కంపెనీ విస్తరణ దృష్ట్యా ఇప్పటికే మంచిర్యాల జిల్లా జైపూర్‌లో 1,200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, సంస్థకు చెందిన ఖాళీ స్థలాల్లో ఓబీ డంప్‌లపై 245.5 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేశామని వివరించారు. సింగరేణి వ్యాప్తంగా మరో 300 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటుతో పాటు మల్లన్న సాగర్, ఎల్‌ఎండీ తదితర జలాశయాల్లో 800 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లు, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల్లో 1,500 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని వివరించారు. జైపూర్‌లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ఆవరణలో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్, జెన్‌కో ఆధ్వర్యంలో రామగుండం బీ పవర్ హౌస్ ప్రాంతంలో 800 మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
స్వీయరక్షణతోనే ప్రమాదాల నివారణ..
బొగ్గు ఉత్పత్తి చేసే క్రమంలో కార్మికులు, అధికారులు స్వీయ రక్షణ పాటిస్తే ప్రమాదాలు నివారించొచ్చని సీఎండీ పేర్కొన్నారు. ఉద్యోగుల సంక్షేమం, ఆర్థిక భద్రత దృష్ట్యా ప్రతీ ఉద్యోగికి బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా రూ.1.25 కోట్ల ఉచిత ప్రమాద బీమా ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం సింగరేణి యంత్రాల వినియోగం రోజుకు 11 – 14 గంటలు కాగా, ప్రైవేట్ యంత్రాలు 22 గంటల మేర నడుస్తున్నాయని, సంస్థ యంత్రాలను పూర్తి స్థాయిలో వినియోగించడంపై అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. సంస్థ మరో వందేళ్లు మనుగడ సాగించాలంటే ప్రతీ ఒక్కరు రోజుకు 8 గంటలు పనిచేయాలన్నారు. అనంతరం ఉత్తమ ఉద్యోగులు, అధికారులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో డైరెక్టర్లు డి.సత్యనారాయణరావు, జి.వెంకటేశ్వరరెడ్డి, గుర్తింపు సంఘం ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్, ఐఎన్‌టీయూసీ జనరల్ సెక్రటరీ త్యాగరాజన్ తదితరులు పాల్గొన్నారు.
ప్రగతివనంలో ఎకో పార్క్ ప్రారంభం
రుద్రంపూర్‌లోని ప్రగతివనంలో రూ.2కోట్ల వ్యయంతో ఆధునికీకరించిన ఎకో పార్క్, ట్యాంక్‌బండ్‌ను, ఫ్రొఫెసర్ జయశంకర్ గ్రౌండ్‌లో కెఫీటేరియా గృహాన్ని, కల్యాణ వనాన్ని సీఎండీ ఎన్.బలరామ్ ఆదివారం ప్రారంబించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రాంత వాసుల ఆరోగ్య పరిరక్షణకు ప్రగతి వనాన్ని అభివృద్ధి చేయడం అభినందనీయమని అన్నారు. గనుల్లో కష్టపడిన కార్మికులు సేద తీరేందుకు, పార్క్‌లో ఓపెన్ జిమ్, యోగా చేసుకునేందుకు ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. కార్మికుల పిల్లల కోసం జయశంకర్ గ్రౌండ్‌ను అభివృద్ధి చేయడం ఉపయోగకరమని అన్నారు. కార్యక్రమంలో జీఎం శాలేంరాజు, ఎస్‌ఓటు జీఎం కోటిరెడ్డి, ఏజీఎం రామకృష్ణ, డీజీఎంలు కేశకరావు, యోహాన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment