వైకుంఠ రాముడి ‘విశ్వరూపం’
● రామయ్యకు వైభవంగా మహాదర్బార్ సేవ ● సర్వదేవతాలంకరణ దర్శనానికి భక్తుల నీరాజనం
భద్రాచలం : ఽదూప, దీప నైవేద్యాల నడుమ.. చుట్టూ 108 మంది అర్చనా మూర్తులతో భద్రగిరిపై కొలువుదీరిన వైకుంఠ రాముడి విశ్వరూప సేవ కనువిందు చేసింది. జగాలను ఏలే జగధబి రాముడికి జరిగిన మహా దర్బార్ భక్తులను సమ్మోహనులను చేసింది. గరుత్మంత వాహనంపై రాజాధిరాజుగా కనిపించిన రామయ్య దర్శనంతో భద్రగిరి పులకించింది. భద్రాచలంలో మాత్రమే ప్రత్యేకమైన విశ్వరూప సేవను భక్తులు వీక్షించి తరించారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఆదివారం ఈ వేడుకను వేద పండితులు, అర్చకులు వైభవోపేతంగా నిర్వహించారు.
విశ్వరూప సేవ విశిష్టత ఇలా..
ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ముగిసిన తరువాత వచ్చే బహుళ ద్వాదశి రోజున ఈ వేడుకను నిర్వహించడం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఆనవాయితీ. సంవత్సర కాల పూజల్లో దొర్లే దోషాల నుంచి ప్రాయశ్చిత్తం కోసం శ్రీ సీతారామలక్ష్మణులతో పాటు ఆలయం ప్రాంగణంలోని ఉపాలయాల్లో ఉండే 108 మంది అర్చనా మూర్తులను ఒకేచోట వేంచేపు చేసి ఏకకాలంలో సేవ నిర్వహించటం ఈ వేడుక విశిష్టత. ముక్కోటి ఏకాదశి రోజున స్వామి వారిని దర్శించుకోలేని భక్తులు ముక్కోటి దేవతలు కొలువై ఉన్న విశ్వరూప సేవ నాడు దర్శించుకుంటే ఆనాటి పుణ్యఫలం దక్కుతుందని భక్తుల నమ్మకం.
బేడామండపంలో ప్రత్యేక పూజలు..
తొలుత స్వామివారి ఉత్సవమూర్తులను గర్భగుడి నుంచి మంగళవాయిద్యాల నడుమ బేడా మండపానికి తీసుకొచ్చి కొలువుదీర్చారు. సువర్ణ పుష్ప పూజ, వేద విన్నపాలు, దండ దీపాంజలి, హారతి, అష్టోత్తర శతనామార్చన చేశారు. ఆ తర్వాత స్వామి వారికి ప్రత్యేక కదంబ ప్రసాదం నివేదించారు. ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తే సర్వ బాధలు తొలగుతాయని భక్తుల విశ్వాసం.
కీర్తనలు, రామనామస్మరణలతో..
విశ్వరూప సేవను పురస్కరించుకుని బేడా మండపాన్ని విద్యుత్ దీపాలు, రంగు రంగుల షామియానాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్థానాచార్యులు కేఈ స్థలశాయి రామకీర్తనలు ఆలపించారు. విశ్వరూప సేవ అనంతరం ప్రసాదాన్ని స్వీకరించిన భక్తులు గర్భగుడిలో స్వామి వారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎల్.రమాదేవి, ప్రధానార్చకులు విజయరాఘవన్, కోటి రామస్వరూప్, ఈఈ రవీందర్, ఏఈఓలు శ్రవణ్‌కుమార్, భవాని రామకృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment