ప్రగతి దిశగా పయనం
అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు
● ఆయిల్‌పామ్, కోకో సాగులో రాష్ట్రంలోనే ప్రథమస్థానం ● గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ జితేష్ వి పాటిల్ వెల్లడి ● ఎస్పీ రోహిత్‌రాజ్‌తో కలిసి గౌరవ వందనం స్వీకరణ
● జిల్లా కోర్టులో..
కొత్తగూడెంటౌన్ : జిల్లా కోర్టు ఆవరణలో జడ్జి పాటిల్ వసంత్ జాతీయ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ జి.భానుమతి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి బత్తుల రామారావు, న్యాయమూర్తులు, న్యాయవాదులు ఎ.సుచరిత, పి.వి.డి. లక్ష్మి, లక్కినేని సత్యనారాయణ, తోట మల్లేశ్వరావు, ఎం.ఎస్ ఆర్. రవిచంద్రన్, సాధిక్‌పాషా పాల్గొన్నారు.
ఎస్పీ కార్యాలయంలో..
పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయంలో ఎస్పీ రోహిత్‌రాజు జాతీయ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ పరితోష్ పంకజ్, డీఎస్పీలు అబ్దుల్ రెహమాన్, మల్లయ్యస్వామి, సత్యనారాయణ, ఎస్బీ ఇన్‌స్పెక్టర్లు నాగరాజు, శ్రీనివాస్, కార్యాలయ ఏఓ మంజ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లా అన్ని రంగాల్లో ప్రగతి దిశగా పయనిస్తోందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రగతి మైదానంలో ఆదివారం 76వ గణతంత్ర వేడులు ఘనంగా జరిగాయి. మొదట కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఎస్పీ రోహిత్‌రాజ్‌తో కలిసి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలందరికీ అందేలా అధికారులు కృషి చేయాలన్నారు. దేశభక్తుల ఆశయాలు, త్యాగాల స్ఫూర్తితో పాటు సంస్కృతి, సంప్రదాయాలతో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నామని అన్నారు. పేదలందరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందేలా రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 16 నుంచి 20 వరకు రైతు భరోసా, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలపై క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించినట్లు చెప్పారు. 21 నుంచి 24 వరకు అన్ని గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో గ్రామ సభలు నిర్వహించామని, అర్హత ఉండీ జాబితాలో పేర్లు లేని వారి నుంచి దరఖాస్తులు స్వీకరించామని వివరించారు.
1.83 కోట్ల మంది ఉచిత ప్రయాణం..
జిల్లాలో మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటివరకు 1.83 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని కలెక్టర్ తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా జిల్లాలో 5,997 మంది వైద్యసేవలు పొందగా రూ.13.70కోట్లు ఖర్చయ్యాయని, తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ ద్వారా 1,16,256 మందికి పరీక్షలు నిర్వహించామని అన్నారు. జిల్లాలో 3,896 హెల్త్ క్యాంపులు నిర్వహించి 1,53,824 మందికి వైద్యసేవలు అందించామని చెప్పారు. ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా 26,016 మందిని పరీక్షించినట్లు తెలిపారు. 61,790 మంది రైతులకు రూ. 437.94 కోట్ల రుణమాఫీ చేశామని, 1,08,223 మందికి రైతు బీమా ప్రీమియం చెల్లించామని చెప్పారు. 23 రైతు వేదికల్లో ప్రతీ మంగళవారం రైతునేస్తం కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆధునిక పంటల సాగుపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోనే ఆయిల్‌పామ్, కోకో సాగు విస్తీర్ణంలో జిల్లా మొదటిస్థానంలో ఉందన్నారు.
సాగుకు నిరంతర విద్యుత్
జిల్లాలో వ్యవసాయంతో పాటు మిగితా రంగాలకు 24 గంటలూ నిరంతర ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. గృహాల్లో 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే 1,70,635 మందికి ఉచితంగా సరఫరా చేస్తున్నామని, 250 లోపు యూనిట్లు ఉపయోగించిన 751 మంది నాయీబ్రాహ్మణులకు, లాండరీ, ధోబీ ఘాట్‌లకు చెందిన 2,218 మందికి ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. మహాలక్ష్మి పథకం ద్వారా అర్హులైన 1,47,161 మంది లబ్ధిదారులకు రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామన్నారు. జిల్లాలో సన్నరకం ధాన్యం 91,670 టన్నులకు రూ.14.18 కోట్ల బోనస్ చెల్లించినట్లు వివరించారు. 2,060 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహార పథకం కింద 31,268 మంది పిల్లలకు బాలామృతం, ప్రీ స్కూల్ విద్య అందిస్తున్నామని తెలిపారు. 6,092 మంది గర్భిణులకు, 6,989 మంది బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని 860 పాఠశాలల్లో రూ 25.38 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించామని, 165 ప్రాథమిక పాఠశాలల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేసి పిల్లల్లో పుస్తకపఠనం పట్ల ఆసక్తి కల్పిస్తున్నామని తెలిపారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేస్తున్నామన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలతో పాటు పరిశ్రమలు, డీఆర్డీఏ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. అనంతరం కలెక్టరేట్, క్యాంపు కార్యాలయాల్లో కలెక్టర్ జితేష్ వి పాటిల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు డీఎఫ్‌ఓ కృష్ణగౌడ్, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
● ఐటీడీఏలో..
భద్రాచలం : స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. పీఓ బి.రాహుల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విద్యార్ధుల సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భద్రాచలం ఏజెన్సీలో ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలతో జీవిస్తున్న గిరిజనులు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా ప్రభుత్వ లక్ష్యం నెరవేరిందని తెలిపారు. విద్యా, వైద్య రంగాల్లో గిరిజనులకు ఉత్తమ సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది ఉట్నూర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో భద్రాచలం ఐటీడీఏ జోన్ ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించిందన్నారు. అటవీ హక్కుల చట్టం కింద హక్కు పత్రాలు, స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ, ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం పలువురు ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఏపీవో జనరల్ డేవిడ్‌రాజ్, డీడీ మణెమ్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment