![ఆటలకు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09kgm252-192026_mr-1739131871-0.jpg.webp?itok=OWWhinsA)
ఆటలకు బేఫికర్
● ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా పరికరాల కొనుగోలుకు నిధులు మంజూరు ● భద్రాద్రి జిల్లాకు రూ.1.7 కోట్లు విడుదల ● ఖమ్మం జిల్లాకు రూ.1.11 కోట్లు కేటాయింపు ● విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఫండ్ అందించిన ప్రభుత్వం
పాల్వంచరూరల్: విద్యార్థులను ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. క్రీడా సామగ్రి కొనుగోలుకు, పాఠశాలల నిర్వహణకు ఇటీవల నిధులు విడుదల చేసింది. 2024–2025 విద్యా సంవత్సరానికి ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, స్థానిక సంస్థలు, ఆదర్శ పాఠశాలలు, కేజీబీవీలు, గిరిజన పాఠశాలలకు నిధులు కేటాయించింది. ఈ నిధులతో రోజువారీ కార్యక్రమాల నిర్వహణతోపాటు ఇంటర్‌నెట్, స్టేషనరీ, క్రీడాసామగ్రి కొనుగోలుకు వెసులుబాటు కల్పించింది.
ఉమ్మడి జిల్లాలో 2,116 పాఠశాలలు
ఉమ్మడి జిల్లాలో 2,116 పాఠశాలలకు క్రీడా సామగ్రి కొనుగోలుకు రూ.2.18 కోట్లు మంజూరు చేసింది. ఇందులో భద్రాద్రి జిల్లాలోని 1,345 పాఠశాలలకు రూ.1.7 కోట్లు కేటాయించింది. ఇందులో1,021 ప్రాథమిక పాఠశాలలకు రూ.51.05 లక్షలు, 167 ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.16.70 లక్షలు, 157 ఉన్నత పాఠశాలలకు రూ.39.25 లక్షలు మంజూరు చేసింది. ఇక ఖమ్మం జిల్లాకు రూ.1.11 కోట్లు కేటాయించింది.
విద్యార్థుల సంఖ్య ఆధారంగా..
పాఠశాలల నిర్వహణకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిధులు విడుదల చేసింది. 1నుంచి 30 మంది విద్యార్థులుంటే సంవత్సరానికి రూ.10 వేలు, 31నుంచి 100 మంది విద్యార్థులుంటే రూ.25 వేలు, 101 నుంచి 250 మంది ఉంటే రూ. 50 వేలు, 251నుంచి 1000 మంది ఉంటే రూ.75 వేలు, వెయ్యి మందికి పైగా విద్యార్థులుంటే రూ.లక్ష వరకు నిధులొస్తాయి. వాటిని ప్రభుత్వం రెండు విడుతల్లో అందించనుంది.
ఏఏ క్రీడాసామగ్రి కొనాలంటే..
మంజూరు చేసిన నిధులతో ఏఏ క్రీడాసామగ్రి కొనుగోలు చేయాలో ప్రభుత్వం నిర్దేశించింది. ఈ మేరకు ప్రధానోపాధ్యాయులకు మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రాథమిక పాఠశాలల్లో రెండు క్రికెట్ బ్యాట్లు, చిన్న సాఫ్ట్‌బాల్, నాలుగు టెన్నిస్ బంతులు, రెండు ఫుట్‌బాల్స్, ఒక బాస్కెట్‌బాల్, ఆరు స్కిప్పింగ్ రోప్స్, ఒక టెన్నీకాయిట్ రింగ్, ఒక ఐరన్ బాక్స్ కొనుగోలు చేయవచ్చు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో షాట్‌పుట్ ఒక్కటి, డిస్కస్‌త్రో ఒక్కటి, రెండు స్కిప్పింగ్ రోప్స్ రెండు, ఒక క్రికెట్ బ్యాట్, నాలుగు టెన్నిస్ బంతులు, వాలీబాల్ నెట్, బాల్, ఒక హ్యాండ్ బాల్, రెండు త్రోబాల్స్, ఒక ఫుట్‌బాల్, ఒక ఐరన్ ట్రంక్ బాక్స్, ఉన్నత పాఠశాల అయితే ఆరు స్కిప్పింగ్ రోప్స్ , నాలుగు షాట్‌పుట్, నాలుగు డిస్కస్ త్రో పరికరాలు, 20 బ్యాడ్మింటన్ బ్యాట్లు, నాలుగు ,క్రికెట్ బ్యాట్లు, 20 టెన్నీస్ బంతులు, రెండు త్రోబాల్స్ , వాలీబాల్ నెట్, రెండు బంతులు, రెండ్ ఫుట్ బాల్స్, రెండు హ్యాండ్ బాల్స్ కొనుగోలు చేయాలని సూచించింది.
అవకతవకలకు పాల్పడితే చర్యలు
ప్రభుత్వ పాఠశాలలకు మంజూరైన క్రీడానిధులతో ఏఏ ఆటవస్తువులు కొనుగోలు చేయాలో మార్గదర్శకాలు విడుదల చేశాం. ఆట వస్తువులను ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు మాత్రమే కొనుగోలు చేయాలి. ఆ వివరాలు స్టాక్ రిజిస్టర్‌లో నమోదు చేయాలి. నిధులు సక్రమంగా వినియోగించుకునేలా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాం. ఉన్నత పాఠశాలల్లో ఎంఈఓలు పర్యవేక్షించనున్నారు. ఆట వస్తువులను వినియోగిస్తూ వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థులను ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దాలి. కొనుగోళ్లలో అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటాం.
–వెంకటేశ్వరాచారి, డీఈఓ
![ఆటలకు బేఫికర్1](https://www.sakshi.com/gallery_images/2025/02/10/09kgm254-192026_mr-1739131871-1.jpg)
ఆటలకు బేఫికర్
Comments
Please login to add a commentAdd a comment