స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి
● కష్టపడే కార్యకర్తలకే ప్రాధాన్యం ● ఎన్నికల్లో క్రమశిక్షణ తప్పితే ఉపేక్షించం ● మంత్రి తుమ్మల నాగేశ ్వరరావు
ఖమ్మంవన్‌టౌన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి సత్తా చాటాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం ఖమ్మం నియోజకవర్గ స్థాయి ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలంగా చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అత్యధిక స్థానాలు సాధించేలా కృషి చేయాలని సూచించారు. ప్రజామోదం ఉన్న నేతలను ఎన్నుకుని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. తల్లి లాంటి పార్టీ కోసం ప్రతి ఒక్కరూ కష్టించి పనిచేయాలన్నారు. సొంత పార్టీలో ఉండి ఎదుటి వారికి సహకరిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఖమ్మం నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఆరాచక శక్తులు లేని ప్రగతిశీల పాలనను ఖమ్మం ప్రజలు స్వాగతించారని, అదే స్ఫూర్తితో ముందుకు సాగుతూ అభివృద్ధి కాముకులను ఎన్నుకోవాలని కోరారు. తాము అధికారంలోకి రాగానే అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల్లా ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడిన కార్యకర్తలకు గౌరవం కల్పించే అవకాశం ఈ ఎన్నికలతో వచ్చిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో దేశంలో ఎక్కడా లేని కార్యక్రమాలు చేపడుతూ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలను ధైర్యంగా అమలు చేస్తున్నామని తెలిపారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణను అభివృద్ధి, సంక్షేమం వైపు మళ్లించిన ఘనత రేవంత్‌రెడ్డికి దక్కుతుందన్నారు. సమావేశంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ యరగర్ల హనుమంతరావు, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, డిఫ్యూటీ మేయర్ ఫాతిమా జోహర, కార్పొరేటర్ కమర్తపు మురళి, నాయకులు సాధు రమేష్‌రెడ్డి, నల్లమల వెంకటేశ్వరరావు, దీప్లా నాయక్, తాతా రఘురాం, హరిసింగ్, గుత్తా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment