![రామయ్](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09kgm292-192044_mr-1739131870-0.jpg.webp?itok=9rHNfGC7)
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. నిత్యకల్యాణంలో దంపతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పంటలను
పరిశీలించిన తుమ్మల
దమ్మపేట: సొంత వ్యవసాయ క్షేత్రంలో సాగు చేస్తున్న పలు రకాల కూరగాయల పంటలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు పరిశీలించారు. ఆదివారం మండల పరిధిలోని మల్లారం గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ క్షేత్రాన్ని వేకువజామున మంత్రి తుమ్మల సందర్శించారు. సాగు చేస్తున్న క్యాబేజీ, క్యాప్సికం, కాలీఫ్లవర్, వంకాయ, బీన్స్ వంటి కూరగాయల పంటలను పరిశీలించారు. సాగుకు అవసరమైన మెళకువలు, జాగ్రత్తలను కాపలాదారులకు తెలియజేశారు. మంత్రి వెంట కాంగ్రెస్ నాయకులు కాసాని నాగప్రసాద్, ఎర్రా వసంతరావు, కేవీ, కొయ్యల అచ్యుతరావు తదితరులు ఉన్నారు.
నేడు ప్రజావాణి
సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్‌లో ఉదయం 10.30 గంటలకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను లిఖిత పూర్వకంగా అందజేయాలని సూచించారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సకాలంలో హాజరుకావాలని అదేశించారు.
నేడు గిరిజన దర్బార్
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో ఆదేశించారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో గిరిజనులు తమ సమస్యలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందజేయాలని సూచించారు.
ముగిసిన క్రీడా పోటీలు
కొత్తగూడెంటౌన్: పట్టణంలోని హనుమాన్‌బస్తీ ఇండోర్‌లో స్టేడియంలో జరుగుతున్న బాడ్మింటన్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ కోచ్ గుజ్జుల సుధాకర్ రెడ్డి మెమోరియల్ క్రీడా పోటీలను జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి దాదాపు 400 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ యుగంధర్‌రెడ్డి, సెక్రటరీ ఆర్.రాజేందర్, జిల్లా యువజన క్రీడలశాఖ అధికారి పి.పరంధామరెడ్డి, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇంటూరి రవికుమార్, సెక్రటరీ కె.సావిత్రి, ట్రెజరర్ కె.రమేష్, రాజ్‌కుమార్, వెంకటేశ్వర్లు, గిరి పాల్గొన్నారు.
![రామయ్యకు సువర్ణ పుష్పార్చన1](https://www.sakshi.com/gallery_images/2025/02/10/09asp43-192050_mr-1739131870-1.jpg)
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
![రామయ్యకు సువర్ణ పుష్పార్చన2](https://www.sakshi.com/gallery_images/2025/02/10/09bcm16-192052_mr-1739131870-2.jpg)
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
Comments
Please login to add a commentAdd a comment