చికెన్.. వద్దులే ఈ‘సారీ’
● కోళ్లకు వైరస్ వ్యాప్తి ప్రచారంతో జనాల్లో భయం ● అమ్మకాలు పడిపోవడంతో పరిశ్రమ కుదేలు ● రూ.80కు దిగిన కిలో కోడి ధర ● ఇంకోపక్క ఏపీ నుంచి దిగుమతి జరగకుండా చెక్‌పోస్టులు
ఖమ్మంవ్యవసాయం: కోళ్ల పరిశ్రమ(పౌల్ట్రీఫామ్) లకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. పొరుగు రాష్ట్రాల్లో వైరస్ ప్రభావం.. ఇక్కడ సైతం వేలాదిగా కోళ్ల మృత్యువాతతో జనాల్లో భయం నెలకొంది. ఈమేరకు చికెన్ వినియోగం తగ్గడం కోళ్లు, చికెన్ ధర తగ్గడానికి కారణమవుతోంది. దీంతో కోళ్ల పరిశ్రమల నిర్వాహకులు, రైతులు నష్టపోతున్నారు.
మహారాష్ట్ర, ఏపీలో నిర్ధారణ
మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కోళ్లకు వైరస్(హైలీ పాతోజెనిక్ అవెన్ ప్లూయాంజా) సోకినట్లు ఇప్పటికే నిర్ధారించారు. ఇదే సమయాన ఏపీకి సరిహద్దుగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, అశ్వారావుపేట తదితర మండలాల్లోని పౌల్ట్రీఫామ్‌ల్లోనూ కోళ్లు మృతి చెందాయి. దీనికి వైరసే కారణమని నిర్ధారణ కాకున్నా ఏపీ నుంచి కోడిపిల్లలు, కోళ్లు, దాణా దిగుమతి అవుతుండడంతో జనాల్లో భయం నెలకొంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం సైతం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూనే, ఏపీ నుంచి కోళ్లు, దాణా రాకుండా ఎక్కడికక్కడ చెక్‌పోస్టుల ద్వారా కట్టడి చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో 20 వేలకు పైగానే..
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 20వేలకు పైగానే కోళ్ల పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో 15లక్షల నుంచి 17 లక్షల మేర కోళ్లను పెంచే సామర్థ్యం ఉంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని ఫామ్స్‌లో 12లక్షల మేర కోళ్లు ఉన్నట్లు అంచనా. ఇందులోబ్రాయిలర్, లేయర్ కోళ్లను పెంచుతుండగా రెండు రకాలకూ వైరస్ సోకే అవకాశముందని సమాచారం.
వినియోగం తగ్గడంతో ధరపై ప్రభావం
వైరస్ ప్రభావం చికెన్ విక్రయాలపై పడింది. ఉమ్మడి జిల్లాలో ఆదివారాల్లో సగటున 40 టన్నుల వరకు, ఇతర రోజుల్లో నిత్యం 25 టన్నుల వరకు వినియోగం ఉంటుంది. ప్రస్తుతం శుభకార్యాల సమయం కావడంతో వినియోగం పెరగాల్సి ఉన్నా 40 శాతం మేర తగ్గిందని కోళ్ల పరిశ్రమల నిర్వాహకులు చెబుతున్నారు. ఇక కిలో కోడిని రూ.110 చొప్పున రైతులు విక్రయిస్తే కనీసం పెట్టుబడి వస్తుంది. కానీ ఇప్పుడు రూ.80 వరకే ఇస్తున్నా ఆశించిన మేర విక్రయాలు జరగడం లేదు. ఇక స్కిన్‌లెస్ చికెన్ కేజీ ధర రూ.250 నుంచి రూ.300 వరకు పలకగా ఇప్పుడు రూ.180 – రూ.200కే విక్రయిస్తున్నారు. అలాగే, స్కిన్‌తోనైతే రూ.150 నుంచి 170కు అమ్ముతున్నా లాభం ఉండడం లేదని పౌల్ట్రీ ఫాంల నిర్వాహకులు, షాపుల బాధ్యులు చెబుతున్నారు.
నిర్వాహకులను అప్రమత్తం చేశాం
వైరస్ నేపథ్యాన కోళ్ల ఫామ్‌ల నిర్వాహకులను అప్రమత్తం చేశాం. సరైన రసాయనాలతో ఫామ్‌లు శుభ్రం చేయాలని చెప్పాం. ఏపీ సరిహద్దు ప్రాంతాల్లోని పరిశ్రమల నిర్వాహకులు, వివిధ శాఖల అధికారులతో బుధవారం సమావేశం నిర్వహిస్తున్నాం.
– డాక్టర్ వి.వెంకటనారాయణ,
ఖమ్మం జిల్లా పశుసంవర్థ్ధక శాఖ అధికారి
Comments
Please login to add a commentAdd a comment