దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:32 సమయానికి నిఫ్టీ 183 పాయింట్లు తగ్గి 24,830కు చేరింది. సెన్సెక్స్ 574 పాయింట్లు నష్టపోయి 81,281 వద్ద ట్రేడవుతోంది. ఇటీవల భారీగా మార్కెట్లు గరిష్ఠాలను చేరుకున్నాయి. దాంతో మదుపర్లు లాభాలను స్వీకరిస్తున్నట్లు తెలుస్తుంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 104.4 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 79.8 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.94 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.4 శాతం, నాస్‌డాక్ 2.3 శాతం నష్టపోయాయి.
నిన్నటి మార్కెట్లో నిఫ్టీ 25,000 మార్కు చేరింది. 1000 పాయింట్ల నుంచి 25000 పాయింట్ల వరకు ప్రయాణం ఇలా..
1996, ఏప్రిల్ 22న 13 కంపెనీల లిస్టింగ్‌తో నిఫ్టీ సూచీ 1000 పాయింట్ల వద్ద ప్రయాణం ప్రారంభించింది. తొలినాళ్లలో దేశంలో తీవ్ర రాజకీయ అస్థిరత (1996–98), తర్వాత ఆసియా ఆర్థిక సంక్షోభం, డాట్‌కామ్ బబుల్, ప్రపంచ ఆర్థిక సంక్షోభం(2007) ప్రతికూల ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ తొలిసారి 5,000 పాయింట్లను చేరేందుకు 11 ఏళ్లు పట్టింది.
సత్యం కుంభకోణం, యూరోపియన్ రుణ సంక్షోభం, ట్యాపర్ తంత్రం, జీఎస్‌టీ అమలు సవాళ్ల ఆటుపోట్లను ఎదుర్కొని 25 జూలై 2017న 10,000 మైలురాయిని చేరింది.
ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభం, కార్పొరేట్ పన్ను, కొవిడ్ మహమ్మారి సూచీని పట్టి కుదిపాయి. కరోనా తొలి వేవ్ సమయంలో 7,600కు పడిపోయిన నిఫ్టీ కేవలం 220 రోజుల్లోనే రెండింతలకు కోలుకోవడం విశేషం. ఈ క్రమంలో 5 ఫిబ్రవరి 2021న 15,000 స్థాయిని అందుకుంది.
కరోనా వేళ పెంచిన వడ్డీరేట్లను తగ్గించేందుకు, పెరిగిన ద్రవ్యోల్బణ కట్టడికి ఆర్‌బీఐ, ఫెడ్ రిజర్వ్‌తో పలు దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్ల పెంపు ప్రారంభం ప్రక్రియ ప్రారంభించాయి. ఇదే సమయంలో ఇజ్రాయిల్ – పాలస్తీనా యుద్ధ భయాలు తెరపైకి వచ్చాయి. ఈ సవాళ్లను ధీటుగా ఎదుర్కొని గతేడాది (2023) సెప్టెంబర్ 11న 20,000 స్థాయికి చేరింది.
ఇక 20,000 స్థాయి నుండి 25000 పాయింట్లు చేరేందుకు 220 ట్రేడింగ్ సెషన్ల సమయం తీసుకుంది. సూచీకి ఇదే అత్యంత వేగవంతమైన 5,000 పాయింట్ల లాభం.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment