అధికారం అడ్డు పెట్టుకుని ఆక్రమణ
● మేత భూమిలో పట్టాలా..? ● తమదే భూమి అంటూ కూటమి నేతల పోటాపోటీ ● ఓ వర్గం చదును చేస్తే..మరో వర్గం మొక్కలు నాటుతున్న వైనం ● గ్రామస్తుల ఆగ్రహం
సాక్షి టాస్క్‌ఫోర్స్: కూటమి నేతలు అధికారం అడ్డుపెట్టుకుని భూములను ఆక్రమించేస్తున్నారు. భూమి తమదేనంటూ ఆ పార్టీలోని ఇరువర్గాలు గట్టిగా పోటీపడుతున్నాయి. ఓ వర్గం భూమి చదును చేస్తే మరోవర్గం వెళ్లి మొక్కలు నాటింది. దీంతో వివాదం ముదిరి ఘర్షణకు దారితీస్తోంది. దీంతో చదును చేసిన వర్గం పోలీసుల ఆశ్రయించింది. చెట్లు నాటే కార్యక్రమాన్ని ఆపి రెవెన్యూ అధికారుల దగ్గరకు వెళ్లాలని ఇరువర్గాలకు పోలీసులు హుకుం జారీ చేశారు.
చిత్తూరు నగరం బండపల్లి రెవన్యూ 194. వెంకటాపురం గ్రామ సమీపంలో 24 ఎకరాల మేత భూమి ఉంది. పశువుల మేత కోసం ఈ భూమిని కొన్నేళ్ల కిత్రం ప్రభుత్వం కేటాయించింది. పశువులు నీళ్లు తాగేందుకు అనువుగా ఇక్కడ 2002లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కుంటను ఏర్పాటు చేశారు. దీని చుట్టూ చదునుగా 20 ఎకరాల వరకు మేత భూమి ఉంది. దీనిపై కొంత మంది కన్ను పడింది. ఎలాగైనా పట్టా చేసుకోవాలని ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో కొంత మంది వ్యక్తులు పట్టా తీసుకున్నారని, దీనిపై రైతులు న్యాయస్థానం ఆశ్రయించడంతో మేతభూమిగా గుర్తించి ఆ పట్టాను రద్దు చేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. దీనిపై పలుమార్లు మీడియాలో కథనాలు రావడంతో అధికారులు కూడా పరిశీలించి ఆక్రమణలను అడ్డుకున్నారు.
వివాదం ఇలా..
పట్టా ఉందని చెప్పి మూడు రోజులుగా ఓ వర్గం ఆ మేత భూమిని చదును చేసింది. ఇది తెలిసిన గ్రామస్తులు అధికారులు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేశారు. ఇంతలో మరోవర్గం వచ్చి తమకు పట్టా ఉందని, చదును చేసే వారిని అడ్డుకుంది. ఇదే అదునుగా భావించి అడ్డుకున్న వర్గం ఆదివారం చెట్లు నాటేసింది. ఇది తెలిసిన మరోవర్గం పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని పట్టాలు ఉంటే తీసుకుని రెవెన్యూ అధికారుల దగ్గరకు వెళ్లాలని చెప్పారు. దీంతో చెట్లు నాటే కార్యక్రమం అర్ధంతరంగా ఆగిపోయింది. సోమవారం తహసీల్దార్ ఎదుట పంచాయతీ పెట్టనున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఇంతకీ పట్టాలు ఉన్నాయా..లేవా అనే విషయాలు ఈ పంచాయతీలో తేలనుంది.
మేతభూమికి పట్టాలు ఎలా?
ఇరువర్గాలకు 5 ఎకరాల చొప్పున పట్టాలు ఉన్నట్లు చెబుతున్నారని, అయితే మేత భూమికి ఎలా పట్టాలు ఇస్తారని గ్రామస్తులు మండిపడుతున్నారు. 20 ఏళ్ల క్రితం ఇచ్చిన పట్టాను కూడా న్యాయస్థానం కొట్టివేసిందని చెబుతున్నారు. ఇన్నాళ్లు లేని ఈ పట్టాల గోల ఏమిటన్న అయోమయంలో ఉన్నారు. ఒక వేల ఇది నిజమైతే మళ్లీ కోర్టు మెట్లు ఎక్కాలిసందేనని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. దీనిపై తహసీల్దార్ లోకేశ్వరిని వివరణ కోరగా, విచారిస్తాం. ఆక్రమణలు ఉంటే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment