![కుంకీ ఏనుగులతో సమస్య పరిష్కారం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09plnr10-300060_mr-1739128388-0.jpg.webp?itok=FqoF6xVv)
కుంకీ ఏనుగులతో సమస్య పరిష్కారం
● కుంకీ ఎలిఫెంట్ శిబిరం పరిశీలన
పలమనేరు : జిల్లాలోని పలమనేరు కౌండిన్య అభయారణ్యం నుంచి రైతుల పంట పొలాల్లోకి వస్తున్న ఏనుగులను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఇక్కడ కుంకీ ఎలిఫెంట్ క్యాంపును ఏర్పాటు చేస్తోందని, దీని ద్వారా ఏనుగుల సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ చిరంజీవి చౌదరి పేర్కొన్నారు. మండలంలోని ముసలిమొడుగు వద్ద చేపడుతున్న కుంకీ ఎలిఫెంట్ ప్రాజెక్టును ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పలమనేరు, కుప్పం పరిధిల్లోని కౌండిన్య అభయారణ్యం 250 కి.మీ మేర మన రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని అడవులకు ఆనుకొని ఉందన్నారు. కౌండిన్య అభయారణ్యంలో స్థిరంగా ఉన్న గుంపులు, మైగ్రేటెడ్ గుంపులు కలిపి సంచరించే ఏనుగులు 120 దాకా ఉన్నాయన్నారు. ఇవి అడవిని దాటి వెళ్లకుండా గతంలో సోలార్ ఫెన్సింగ్, ఎలిఫెంట్ ట్రెంచ్‌లను సైతం ఏర్పాటు చేశామన్నారు. కానీ సమస్య తీరనందున ఇప్పుడు కర్ణాటక రాష్ట్ర సహకారంతో కుంకీ ఏనుగుల ద్వారా ఇక్కడి మదపు టేనుగులను అదుపు చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. కర్ణాటక రాష్ట్రంతో ఎంఓయూ చేసుకొని అక్కడ శిక్షణ పొందిన నాలుగు కుంకీ ఏనుగులను ఇక్కడికి త్వరలో తెప్పిస్తామన్నారు. ఇందు కోసం రేంజ్ పరిధిలోని 20 మందికి శిక్షణ ఇప్పించామన్నారు. రూ.12 లక్షల వ్యయంతో కుంకీ ఎలిఫెంట్ క్యాంపును 50 ఎకరాల్లో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఏనుగుల కోసం కర్రల కంచెతో విడిది, మేతను సిద్ధం చేసుకొనే గదులు, చిన్నపాటి చెరువు, శిక్షణస్థలం, క్రాల్స్( మదపు టేనుగులను మచ్చిక చేసుకొనే చెక్క గది) తదితర పనులను ఆయన పరిశీలించారు. మరోవైపు ఇక్కడి అటవీశాఖ భవనాల అభివృద్ధికి త్వరలో నిధులు విడుదల చేస్తామన్నారు. కార్యక్రమాల్లో తిరుపతి కన్జర్వేటర్ సెల్వం, డీఎఫ్‌ఓ భరణి, సబ్ డీఎఫ్‌ఓ వేణుగోపాల్, స్థానిక ఎఫ్‌ఆర్వో నారాయణ, ఎఫ్‌ఎస్వోలు సుకుమార్, సురేంద్ర, రమేష్ పాల్గొన్నారు.
ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి
ఇక్కడికి వచ్చిన పీసీసీఎఫ్‌కు రైతు సంఘం నాయకుడు ఉమాపతి నాయుడు ఓ వినతిపత్రాన్ని అందించారు. జిల్లాలో ఏనుగుల దాడుల కారణంగా పంటలకు నష్టంతో పాటు రైతుల ప్రాణాలు పోతున్నాయని విన్నవించారు. ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment