● 104 వైద్యసేవల నిర్వీర్యానికి కుట్ర ● వేధిస్తున్న మందు
పల్లెల్లో 104 సంచార వైద్య సేవలకు జ్వరం పట్టుకుంది. దీంతో పల్లెసేవలు పడకేశాయి. జ్వరం వస్తే కనీసం పారాసెటమాల్ మాత్రలు అందుబాటులో లేవు. జలుబు చేసినా.. జ్వరం వచ్చినా పల్లె జనం ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు పెట్టాల్సిన దుస్థితికి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ సేవలను గత ప్రభుత్వం కంటే మెరుగ్గా అందించాల్సిన కూటమి ప్రభుత్వం నేడు 104 సేవల నిర్వీర్యానికే మొగ్గు చూపుతున్న నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుండడంతో పల్లె జనాన్ని కలవరానికి గురిచేస్తోంది.
104 వాహన సేవలు (ఫైల్)
గతంలో బాగుండేది..
జగన్ ప్రభుత్వంలో ఎప్పుడు చూసినా ఆశా కార్యకర్తలు , ఏఎన్‌ఎంలు, వలంటీర్లు ఇంటి వద్దకు పరుగెత్తుకుని వచ్చేవారు. ఆ పరీక్షలు, ఈ పరీక్షలు చేసేవారు, కాస్త దగ్గిన, తుమ్మిన టక్కుమని ఈ మాత్ర వేసుకోమని చెప్పేవారు. 104 వస్తే బండి వస్తా ఉండాదని పదే పదే చెప్పేవారు. ఇప్పుడు ఆ రకంగా లేదు. పల్లెల్లో ఈ సేవలు బాగా అవసరం. 104పై నిర్లక్ష్యం చేస్తే పల్లె జనానికి జబ్బు చేస్తే నేడు పట్టణానికి పరుగెత్తాల్సిన దుస్థితి వచ్చింది.
– జార్జ్‌కుమార్, గంగాధరనెల్లూరు
మాత్రలు అడిగితే లేవంటున్నారు
దగ్గు, జలుబు అని వెళితే చూసి రెండు బిల్లలు ఇస్తున్నారు. ఇదేమి..ఇంకా రెండు బిల్లులు ఇవ్వచ్చు కదా అని అడిగితే లేదు..తక్కువగా ఉన్నాయి. ఇంకొన్ని మాత్రలు బయట తీసుకోమని చెబుతున్నారు. లేకుంటే పీహెచ్‌సీకి వెళ్లి తీసుకోమని అంటున్నారు. ఇలాగైతే ఎలా. ముందు అన్ని రకాల మాత్రలు ఇచ్చే వాళ్లు. ఇప్పుడు ఆ రకంగా ఇవ్వాలి.
– డిల్లీబాబు, గుడిపాల
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : పల్లెలో 104 సంచార వైద్యం కదలనంటోంది. కూటమి రాకతో సేవలు మొక్కుబడిగా మారాయి. 104పై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతోంది. ఈ కారణంగా ఆ వాహనాలు గ్రామాలకు చుట్టపు చూపుగా వెళుతున్నాయి. ప్రధానంగా మందులు, మాత్రల కొరత వేధిస్తోంది. దీంతో పల్లెలో 104 వైద్య సేవలు నామమాత్రం అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 50 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో 104 వాహనాలు 44 తిరుగుతున్నాయి. ఈ వాహనం ద్వారా ప్రతినెలా 464 శిబిరాలు నిర్వహిస్తున్నారు. ప్రతి క్యాంపునకు ఓ డాక్టర్, డీఈఓ, ఏఎన్‌ఎం, ఎంఎల్‌హెచ్‌పీలు, ఆశా వర్కర్, సూపర్ వైజర్ హాజరువుతున్నారు. చాలా చోట్ల సర్వే సమస్యలతో ఎంఎల్‌హెచ్‌పీలు హాజరు కావడం లేదు. వారికి సర్వేలు, ఇతర సేవలకు సమయం సరిపోతోందని వైద్యాధికారులు చెబుతున్నారు. కాగా వీరి వద్దకు ప్రతినెలా 83 వేలకుపైగా ఓపీలు వస్తున్నాయి. ఇందులో అధికంగా బీపీ, మధుమేహ సమస్యలతో బాధపడుతున్న వారు నిత్యం వచ్చి పరీక్షించుకుంటున్నారు. ప్రతినెలా బీపీ బాధితుల ఓపీ సంఖ్య 20 వేలు, మధుమేహుల సంఖ్య 17 వేలు దాటుతోంది. దీంతో పాటు వృద్ధులు, గర్భిణులు అధికంగా వస్తున్నారు. సీజనల్ వ్యాధుల సమయంలో జనరల్ ఓపీల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే ఇందుకు తగ్గట్లు 104లో వైద్య సేవలు కరువుతున్నాయి.
మందు బిల్లలూ కష్టమే..
104 సంచార వైద్యం తిరుపతి సెంట్రల్ నుంచి మందులు, మాత్రలు సరఫరా అవుతున్నాయి. 104 సేవల్లో 74 రకాల మాత్రలు అందుబాటులో ఉండాలి. ప్రస్తుతం 40 రకాల మాత్రలు కూడా ఉండడం లేదు. ఉన్న ఆ మాత్రలు అరకొరగా ఉన్నాయి. జ్వరం, జలుబు, దగ్గుకు మాత్రలు కనిపించడంలేదు. బీపీ, మధుమేహ మాత్రలు కొరత ఉంది. కొన్ని రకాల సిరఫ్‌లు లేవు. దీంతో 104 వైద్యంలో నిర్లక్ష్యపు జాడ్యం అలుముకుంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 74 రకాల మాత్రలను మూడు నెలలకు ఒకసారి అందించేవారు. కావాల్సినన్ని మందులు, మాత్రలు ఇస్తూ పల్లె జనానికి డోకా లేకుండా చూసుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితికి భిన్నంగా ఉందని వైద్యులు, సిబ్బంది వాపోతున్నారు.
అందుబాటులో లేని మందులు
డైక్లోఫెనాక్, ఫారా సెటమల్, బీ కాంప్లెక్స్, పాంటెక్, రేంటాక్, ఐరన్, పోలిక్ యాసిడ్, మల్టీ విటమిన్, టెనిలిగ్లిఫ్టిన్, టెనిఫిట్ మాత్రలు పూర్తి స్థాయిలో లేవని వైద్యులు చెబుతున్నారు. సిరఫ్‌లో ఆమ్రోక్స్, అమాిక్సిలిన్, సాల్బుటమాల్‌లు లేవని అంటున్నారు. క్రోటోమోజోల్, ముట్రోసిన్ అయిల్‌మెంట్ లేక జనానికి ఇవ్వలేకపోతున్నామని చెబుతున్నారు. దీంతో పాటు విలువైన మాత్రలు కావాలంటే గతంలో పోస్టల్ ద్వారా ఇంటికే పంపేవారు. ఆ రకం మాత్రలకు కూడా ఇప్పుడు చెక్ పడిందని, ఇక గర్భిణులకు ఈసీజీ తీయాలంటే ఈసీజీ మిషన్లు చాలా చోట్ల పనిచేయడం లేదని వాపోతున్నారు. అలాగే హెచ్‌పీ మిషన్లు మొరాయిస్తున్నారని వైద్యులు చెబుతున్నారు.
104 మొబైల్ వైద్యసేవల ఓపీ వివరాలు
నెల ఓపీ జనరల్ ఏఎన్‌సీ పీఎన్‌సీ బీపీ మధుమేహం
నవంబర్ 7374 8587 2935 20803 17380 24651
డిసెంబర్ 6196 8620 2991 20395 16965 24852
జనవరి 4423 5331 2025 14812 11749 16663
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇలా..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వైద్య సేవలను మరింత విస్తృతం చేసింది. ముఖ్యంగా పల్లె వైద్యానికి పెద్దపీట వేసింది. విలేజ్ హెల్త్ క్లినిక్‌లను తీసుకొచ్చింది. ఫ్యామిలీ డాక్టర్ విధానంతో ఇంటికే డాక్టర్లను రప్పించింది. ఆరోగ్యశ్రీలో పలు రకాల జబ్బులను చేర్చి రూ.25 లక్షల వరకు వైద్య సేవలు అందేలా చేసింది. జగనన్న ఆరోగ్య సురక్ష పేరుతో క్యాంపులను ఏర్పాటు చేసింది. వైద్య సిబ్బంది ఇంటికొచ్చి పరీక్షలు చేసి వైద్య సేవలను అందించేలా చేసింది. 104 ద్వారా సేవలు పక్కాగా అందేలా చేసింది. కావాల్సిన మందులు, మాత్రలు అందించడంతో పాటు పేదల ఆరోగ్యానికి భరోసా కల్పించేది. ఇప్పుడు ఆ రకంగా లేకపోవడంలో పల్లెలోని పేద ప్రజలు వైద్య సేవల కోసం పట్టణాల్లోని ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది.
మందులు లేవా..? తెలుసుకుంటా..
104 వాహనాల ద్వారా అందించే సేవలకు మందులు లేవంటే కనుక్కుంటాను. నా దృష్టికి అయితే మాత్రలు, మందులు లేవనే విషయం రాలేదు. ఆ మందులు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసుకుంటా. ఇబ్బంది లేకుండా చూస్తాను. పూర్తి స్థాయిలో తెప్పించే ప్రయత్నం చేస్తా.
– సుధారాణి, డీఎంఅండ్‌హెచ్‌ఓ, చిత్తూరు
కూటమి కుట్ర..
పల్లె వైద్యాన్ని మట్టుపెట్టేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. వైద్య వ్యవస్థను భ్రష్టు పట్టిస్తోంది. ఇందులో భాగంగానే మెడికల్ కాలేజీలను ప్రైవేటు చేతిలో పెట్టేందుకు ప్రయత్నాలు చేసింది. ఇక ఆరోగ్య శ్రీలో వ్యాధుల సంఖ్యను కుదిస్తోంది. ఆరోగ్య శ్రీ ద్వారా పేద ప్రజలకు సేవలు అందకుండా చేస్తోంది. ప్రాథమిక ఆరోగ్యాన్ని కుంటుపడేలా చేస్తోంది. వైద్య సేవలను పట్టించుకోకపోవడంతో జిల్లా, ఏరియా, సీహెచ్‌సీల్లో కూడా వైద్య సేవల్లో నిర్లక్ష్యం అలుముకుంది. సిబ్బంది కొరత వేధిస్తోంది. ఇదే క్రమంలో 104ను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం మందులు, మాత్రలు ఇవ్వకుండా పల్లె వైద్యాన్ని గాలికి వదిలేసింది.
Comments
Please login to add a commentAdd a comment