
ముంబై: పర్యాటక నౌకలో డ్రగ్స్ పార్టీని భగ్నం చేసి, బడా బాబుల బరితెగించిన పిల్లలను అదుపులోకి తీసుకున్న ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడే పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. అతడి గురించి ఇంటర్నెట్‌లో జనం ఆరా తీస్తున్నారు. 40 ఏళ్ల సమీర్ వాంఖెడే ముంబైలో జన్మించారు. ఆయన తండ్రి పోలీసు ఆఫీసర్. సమీర్ 2017లో మరాఠి నటి క్రాంతీ రెద్‌కర్‌ను పెళ్లి చేసుకున్నారు. 2004లో ఇండియన్ రెవెన్యూ సర్వీసు(ఐఆర్‌ఎస్)కు ఎంపికయ్యారు. మొదట ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఏఐయూ) డిప్యూటీ కమిషనర్‌గా పనిచేశారు.
చదవండి: (Shah Rukh Khan: షారుక్ కొడుకు ఫోన్ సీజ్.. డ్రగ్స్ కేసులో ప్రమేయంపై విచారణ?)
జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అదనపు ఎస్పీగా, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్‌ఐ)లో జాయింట్ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. పన్నులు ఎగవేస్తున్న ధనవంతుల బండారాన్ని బయటపెట్టారు. పన్నుల ఎగవేతపై ఉక్కుపాదం మోపారు. ఎగవేతదారుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేశారు. సమీర్‌కు భయం అంటే ఏమిటో తెలియదని, క్రమశిక్షణ కలిగిన నిజాయతీపరుడైన అధికారి అని ఆయనతో కలిసి పనిచేసినవారు చెబుతుంటారు. బాలీవుడ్ సినిమాలంటే సమీర్‌కు చాలా ఇష్టం. అయినప్పటికీ విధి నిర్వహణలో తన వ్యక్తిగత ఇష్టాయిష్టాలను చోటివ్వరు. 2020 నవంబర్ 22న డ్రగ్స్ ముఠా సమీర్‌తోపాటు మరో ఐదుగురు ఎన్‌సీబీ అధికారులపై దాడి చేసింది. ఈ ఘటనలో ఆయన గాయపడ్డారు.
చదవండి: (నా కొడుకు అమ్మాయిలతో తిరగొచ్చు..డ్రగ్స్ తీసుకోవచ్చు!)