అంకెల గారడీ బడ్జెట్
మాజీ ఎంపీ చింతా అనురాధ
అల్లవరం: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024–25 బడ్జెట్ అంకెల గారడీ, మోసాల మాయగా ఉందని అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు చింతా అనురాధ విమర్శించారు. బుధవారం ఆమె మాట్లాడుతూ పేరుకే ఇది పూర్తి స్థాయి బడ్జెట్ అని, చివరి నాలుగు నెలల కాలానికి మాత్రమే వర్తిస్తుంది కాబట్టి ప్రభుత్వం గొప్పగా కేటాయింపులను చెప్పుకున్నా ఆచరణలో అమలు సాధ్యం కానివని, బాబు ఉట్టి మాటలకు ఇది మరో నిదర్శనం అని ఆమె పేర్కొన్నారు. సూపర్ సిక్స్ అంటూ ఎన్నికల హామీలతో ఊదరకొట్టిన కూటమి ప్రభుత్వం ఏ ఒక్క పథకానికి న్యాయం చేయలేదని, ప్రజలను మరో సారి మోసం చేసిందని అనురాధ విమర్శించారు. రైతుల పెట్టుబడి సాయం హామీపై కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో కలిపి ఇస్తామని బాబు మాట మార్చారని, మహాశక్తి పేరుతో 19–59 ఏళ్ల మహిళలకు ప్రతి నెల రూ.1,500 ఇస్తామన్న హామీని తుంగలో తొక్కారని, తల్లికి వందనం’లో కోతలు పెట్టడమే కాకుండా, బడ్జెట్‌లో నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఊసెత్త లేదని, ఉచిత బస్సు ప్రస్తావనే లేదని, 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడ నుంచి ఇస్తారని ప్రజలు మండిపడుతున్నట్లు అనురాధ దుయ్యబట్టారు.
రాష్ట్ర స్థాయి పద్య గాన
పోటీలకు ఆహ్వానం
అమలాపురం టౌన్: ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో 6 నుంచి 20 ఏళ్ల వయసు ఉన్న వారికి రాష్ట్రస్థాయి పద్య గాన పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ సమన్వయకర్త డాక్టర్ ఎస్‌ఆర్‌ఎస్ కొల్లూరి తెలిపారు. ఈ పోటీలు ప్రహ్లాద విభాగంలో ఆరు నుంచి పదేళ్ల వయసు గల వారు, మార్కండేయ విభాగంలో 11–15 ఏళ్ల వయసు వారు, వివేకానంద విభాగంగా 16–20 ఏళ్ల వయసు వారు మూడు విభాగాలుగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పోటీల్లో పాల్గొనే వారు ఒక పద్యాన్ని రాగ యుక్తంగా పాడిన వీడియోతో పాటు పేరు, వయసు, తరగతి, ఊరు, ఫోన్ నెంబర్ చెప్పి డాక్టర్ ఎస్‌ఆర్‌ఎస్ కొల్లూరికి 92472 72066 నెంబరుకు వాట్సప్ చేయాలన్నారు. ప్రాథమిక పరిశీలనలో ఒక్కొక్క విభాగంలో ఎంపికై న 30 మంది చొప్పున 90 మంది పేర్లను ఈ నెల 30వ తేదీన వెల్లడిస్తామన్నారు. వారు డిసెంబర్ 9న గుంటూరులో నిర్వహించే కార్యక్రమంలో ఒక్కొక్కరు మూడు పద్యాలను విధిగా గానం చేయాల్సి ఉంటుందన్నారు. అనంతరం నగదు బహుమతులు ఇస్తామని కొల్లూరి వివరించారు.
జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు హసన్
రామచంద్రపురం: ఈ నెల 19 నుంచి పంజాబ్ రాష్ట్రంలో జరిగే జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు పట్టణం నుంచి షేక్ హసన్ ఎంపికయ్యాడు. ఇటీవల శ్రీకాకుళంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలలో ప్రతిభ కనబరచి తూర్పుగోదావరి జిల్లా జట్టుకు ఎంపికయ్యాడు. ఈ మేరకు అతడు చదువుతున్న మోడరన్ జూనియర్ కళాశాల అధినేత జీవీ రావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment