వైభవంగా దేవదేవుని జల విహారం
ఆత్రేయపురం/సఖినేటిపల్లి: క్షీరాబ్ధి ద్వాదశి సందర్భంగా ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వరుని ఆలయం, సఖినేటిపల్లి మండలం అంతర్వేది లక్ష్మీ నృసింహునికి తెప్పోత్సవాలు నిర్వహించారు. వాడపల్లిలో సుప్రభాత సేవ అనంతరం స్వామివారిని తీర్థ బిందెతో తీసుకువచ్చిన గోదావరి జలాలతో అభిషేకించారు. గోత్ర నామాలతో పూజలు, నిత్య హోమాలు చేయించి మంగళ వాయిద్యాలు, బాణసంచా కాల్పుల నడుమ గౌతమీ గోదావరికి తీసుకువెళ్లి తెప్పోత్సవం నిర్వహించారు. దేవదాయ ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, ఆలయ ఈవో నల్లం సూర్య చక్రధరరావు ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. అలాగే అంతర్వేది లక్ష్మీ నృసింహుని తెప్పోత్సవం బుధవారం కన్నుల పండగా నిర్వహించారు. పల్లిపాలెం అగ్నికుల క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో వశిష్ట గోదావరి నదిలో గరుడ పుష్పక వాహనంపై అమ్మవార్లను అయ్యవారిని ప్రతిష్టించి తెప్పోత్సవం నిర్వహించారు. అంతకు ముందు ఆలయం నుంచి పల్లిపాలెం పుష్కరరేవు వరకు ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్, స్థానాచార్య వింజమూరి రామ రంగాచార్యులు, వేద పండితుడు చింతా వేంకటశాస్త్రి వేదమంత్రాలు, బాణసంచా కాల్పులతో నడుమ గోదావరిలో విహరింపజేశారు. అనంతరం ఉత్సవ మూర్తులను ఆలయానికి చేర్చారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ, రాజోలు సీఐ టీవీ నరేష్ కుమార్, నాయకులు పాల్గొన్నారు.
అలాగే ర్యాలి జగన్మోహినీ కేశవ స్వామి ఆలయం, ఆత్రేయపురం లక్ష్మి వేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment