నిత్యావసరాల ధరల నియంత్రణకు చర్యలు
జాయింట్ కలెక్టర్ నిషాంతి
అమలాపురం రూరల్: నిత్యావసరాలు, కూరగాయల ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు. గురువారం అమలాపురం కలెక్టరేట్‌లో ధరల స్థిరీకరణ, నియంత్రణపై తీసుకోవాల్సిన చర్యలపై కిరాణా డీలర్లు, వర్తకులు, గణాంక అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో కూరగాయల ధరల నియంత్రణకు వర్తకులు సహకరించాలని అన్నారు. రిటైల్ దుకాణాల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే నాణ్యమైన సరకులను వినియోగదారులకు అందించాలని తెలిపారు. బహిరంగ మార్కెట్లలో నిత్యావసర సరకుల ధరల నియంత్రణలో భాగంగా అన్ని రైతు బజార్లలో వంట నూనెలు, కందిపప్పు, ఉల్లి, టమోటాలను అందుబాటులో ఉంచి విక్రయించాలన్నారు. ప్రజలకు బియ్యం, కందిపప్పు, వంటనూనె చౌక ధరలకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. రైతు బజార్లు సక్రమంగా పనిచేయక పోవడానికి గల కారణాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 38 నిత్యావసర సరకుల ధరల నియంత్రణపై నిత్యం సమీక్షిస్తోందని, ఆ మేరకు క్షేత్ర స్థాయిలో ధరలు ఉండాలని సూచించారు. అధిక ధరకు అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హోల్‌సేల్, రిటైల్ ధరలపై రోజూ కేంద్రానికి నివేదిక ఆన్‌లైన్ యాప్‌లో సమర్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి ఉదయభాస్కర్, మార్కెటింగ్ అధికారి కె.విశాలాక్షి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment