వరి కోతలను వాయిదా వేసుకోవాలి
అమలాపురం రూరల్: ఈ నెల 23 నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు వరి కోతలను వాయిదా వేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి వి.బోసుబాబు సూచించారు. సమనస రైతు సేవా కేంద్రంలో రాష్ట్రీయ కిసాన్ వికాస్ యోజనలో భాగంగా ఉద్యాన పంటల్లో యాజమాన్య పద్ధతులపై అమలాపురం సబ్ డివిజన్ పరిధిలో నాలుగు మండలాల గ్రామ వ్యవసాయ, ఉద్యాన సహాయకులకు గురువారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన బోసుబాబు మాట్లాడుతూ రబీ పంటకు సంబంధించి డిసెంబర్ 31 వరకూ బీమా చేయించుకునేందుకు గడువు ఉందని తెలిపారు. దగ్గరలోని సీఎస్‌సీ కేంద్రాల్లో వరి ఎకరాకు రూ. 680 ప్రీమియం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా వనరుల కేంద్రం ప్రాజెక్టు డైరెక్టర్ జ్యోతిర్మయి మాట్లాడుతూ గ్రామ వ్యవసాయ, ఉద్యాన సహాయకులు అన్ని పంటలపై అవగాహన పెంచుకోవాలన్నారు. మట్టి స్వభావాన్ని బట్టి పోషకాల లభ్యతను అనుసరించి ఎరువులను వాడాలని, నానో యూరియా, నానో డీఏపీ ఉపయోగాలు తెలిపి రైతులకు అవగాహన పెంచాలన్నారు. ఉద్యాన అధికారి ఎం.శైలజ మాట్లాడుతూ ఉద్యాన పంటల సాగులో యాజమాన్య పద్ధతులు, చీడపీడల నివారణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. కార్యక్రమంలో అమలాపురం సబ్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు ఏంఏ షంషి, మండల వ్యవసాయ అధికారులు కడలి ధర్నాప్రసాద్, ఎన్‌వీవీ సత్యనారాయణ, కుమార్‌బాబు, వ్యవసాయ విస్తరణ, గ్రామ వ్యవసాయ, ఉద్యాన సహాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment