గొంతు దిగని భోజనం
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు : 1,585
విద్యార్థులు : 98,511
మధ్యాహ్న భోజన పథకం కార్మికులు : 2,764
ప్రాథమిక పాఠశాల ఒక్కొక్క విద్యార్థికి : రూ.5.58
ఉన్నత పాఠశాల ఒక్కొక్క విద్యార్థికి : రూ.8.57
ఏజెన్సీ నిర్వాహకుల బకాయిలు : రూ.85 కోట్లు
కార్మికుల వేతన బకాయిలు : రూ.54 కోట్లు
ఆలమూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకం (మిడ్ డే మీల్స్)లో రుచి, శుచి తగ్గుతోంది. గత ప్రభుత్వ హయాంలో అమలైన జగనన్న గోరుముద్ద పథకానికి ప్రస్తుతం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంగా మార్పు చేశారు. విద్యార్థులకు అందించే మెనూలో మరిన్ని ఆహార పదార్థాలను కలిపి ఆకర్షణీయంగా మార్చుతామని కూటమి పాలకులు వాగ్దానం చేశారు. కానీ వారి మాటలు ఎక్కడా అమలు కావడం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రభావం మధ్యాహ్న భోజనం పథకంపై కూడా పడింది.
ధరలు రెట్టింపు
కూటమి ప్రభుత్వంలో నిత్యావసరాల ధరలు రెట్టింపయ్యాయి. గ్యాస్ బండ మోయలేనంత భారంగా మారింది. వంట నూనెలు సలసలా కాగుతున్నా యి, పప్పులు ఉడకడం లేదు. కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఆకుకూరల ధరలు అందడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మధ్యాహ్న కార్మికులకు భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. పెరిగిన నిత్యవసరాలకు అనుగుణంగా ధరలు పెంచకపోవడంతో మధ్యాహ్న భోజన పథకం ఉనికిని కోల్పోతోంది.
మూడు నెలలుగా బిల్లుల బంద్
రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల నుంచి మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి బిల్లులు చెల్లించడం లేదు. జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.84 కోట్లు కార్మికులకు చెల్లించాల్సి ఉంది. మధ్యాహ్న పథకం సిబ్బంది సరకులను అరువు తెచ్చి పిల్లలకు వండి పెడుతున్నారు. అయితే నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో వ్యాపారులు కూడా సరుకులను అరువు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు.
జిల్లాలో 1,585 పాఠశాలలు
జిల్లాలో 1,585 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 237 జెడ్పీ ఉన్నత పాఠశాలలు, 78 ప్రాథమికోన్నత పాఠశాలలు, 1,270 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వాటిలో సుమారు 98,511 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రాథమిక పాఠశాలలో చదివే విద్యార్థులకు రూ.5.58, ప్రాథమికోన్నత, హైస్కూళ్ల విద్యార్థులకు రూ.8.57 చెల్లిస్తున్నారు. 2022 సెప్టెంబర్ 1న అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నాటిఽ ధరలకు అనుగుణంగా సవరించింది. అప్పటి నుంచి ఈ ధరలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం నిత్యావసరాల ధరలు పెరిగిపోవడంతో ఈ ప్యాకేజీ ఏమాత్రం సరిపోవడం లేదని మధ్యాహ్న భోజన పథకం కార్మికులు వాపోతున్నారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కనీసం రూ.10, హైస్కూల్ విద్యార్థులకు రూ.12 వరకూ పెంచాలని కోరుతున్నారు.
గౌరవ వేతనం ఎక్కడ!
మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులకు ప్రతి నెలా గౌరవ వేతనం కింద రూ.మూడు వేలు అందజేస్తారు. అయితే గడచిన నాలుగు నెలల నుంచి రావడం లేదు. దీంతో కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో 2,764 మంది కార్మికులు మధ్యాహ్న భోజనాన్ని వండి వడ్డిస్తున్నారు. వారందరికీ సుమారు రూ.54 కోట్ల వరకూ గౌరవ వేతనాలు రావాలి.
నాణ్యత లేమి!
పెరిగిన నిత్యవసరాల ధరలకు అనుగుణంగా విద్యార్థులకు చెల్లింపులు సవరించకపోవడంతో కొన్నిచోట్ల మధ్యాహ్న భోజనం పథకంలో నాణ్యత లోపించింది. ఈ ఏడాది ప్రథమార్థంలో కేజీ రూ.110 ఉన్న కందిపప్పు ధర ప్రస్తుతం రూ.190కి చేరింది. వంట నూనెలు రూ.102 నుంచి రూ.150కి, కూరగాయలు కేజీ రూ.50కి పైనే ఉన్నాయి. ఈ పరిస్థితిలో మధ్యాహ్న భోజనం నాణ్యతగా కొనసాగించడం నిర్వాహకులకు కష్టంగా మారింది. జిల్లాలో గత ఏడాది ఈ పథకాన్ని సుమారు 86 శాతం మంది వినియోగించుకోగా ప్రస్తుతం 69 శాతానికి పడిపోయింది.
పెరిగిన నిత్యావసరాల రేట్లు
కూటమి ప్రభుత్వం ఇచ్చే
ధర సరిపోని వైనం
బిల్లుల చెల్లింపులకు బ్రేక్
అప్పులు తెచ్చి
వండి పెడుతున్న నిర్వాహకులు
నిధులు మంజూరు కాగానే..
మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు నిధులు మంజూరు కాగానే ఒకేసారి చెల్లింపులు జరుపుతాం. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే గ్రాంట్ ద్వారానే బిల్లులు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం రూపొందించిన మెనూ ప్రకారమే వంటకాలను సిద్ధం చేసి విద్యార్థులకు వండించాలి. దీనిపై మండల విద్యాశాఖతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు నిత్య పర్యవేక్షణ చేస్తున్నారు.
– ఎస్‌కే సలీం బాషా, జిల్లా విద్యాశాఖాధికారి
సత్వరమే బిల్లులు చెల్లించాలి
విద్యార్థులకు సౌకర్యవంతంగా, సమర్థవంతంగా మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్న ఏజెన్సీ నిర్వాహకులకు సత్వరమే పెండింగ్ బిల్లులు చెల్లించాలి. అలాగే కార్మికులకు గౌరవ వేతనం మంజూరు చేయాలి. వారికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి. విద్యార్థులకు, కార్మికులకు ఎప్పుడూ అండగా ఉంటాం.
– జి.రవికుమార్,
ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment