ఊరూరా విజ్వరంభణ | - | Sakshi
Sakshi News home page

ఊరూరా విజ్వరంభణ

Published Wed, Dec 18 2024 4:45 AM | Last Updated on Wed, Dec 18 2024 4:45 AM

ఊరూరా

ఊరూరా విజ్వరంభణ

జిల్లావ్యాప్తంగా వైరల్‌ ఫీవర్‌లు

తగ్గని కీళ్ల నొప్పులు,

పడిపోతున్న ప్లేట్‌లెట్స్‌

ప్రభుత్వాస్పత్రులో వేధిస్తున్న

ఔషధాల కొరత

సీజనల్‌ వ్యాధుల నిర్మూలనకు

చర్యలు శూన్యం

ఆలమూరు: వాతావరణ పరిస్థితుల్లో సంభవించిన మార్పులకు తోడు పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా నెలకొన్న అపరిశుభ్రత వల్ల విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలో అనేక మంది ప్రజలు ఒక్కసారిగా విపరీతమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు, ప్లేట్‌లెట్స్‌ సంఖ్య దారుణంగా పడిపోవడం వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. టైఫాయి డ్‌, డెంగీ, చికున్‌ గున్యా కేసులు అధికంగా ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా వారం రోజుల నుంచి పెరిగిపోతున్న వైరల్‌ జ్వరాలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

ప్రభుత్వాసుపత్రుల్లో సిబ్బంది కొరత..

మందుల లేమి

జిల్లాలోని పలు ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత వేధించడంతో పాటు ఔషధాలు అందుబాటులో లేకపోవడం రోగుల పాలిట శాపంగా మారింది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాల కల్పన లేక, వైద్య సేవలు సక్రమమైన రీతిలో అందక రోజు రోజుకు జ్వరాల తీవ్రత పెరిగిపోతోంది. దీంతో జిల్లాలోనున్న 63 ప్రభుత్వ ఆస్పత్రులు జ్వర పీడితులతో కిక్కిరిసిపోతున్నాయి. ఆస్పత్రుల్లో ఉన్న పడకలన్నీ రోగులతో నిండిపోతున్నాయి. పీహెచ్‌సీల్లో అయితే రోజుకు సరాసరి సుమారు 150, సీహెచ్‌సీల్లో 350 మందితో ఓపీ నమోదవుతోంది. ఆస్పత్రుల్లో ఉన్న అరకొర పడకలు కూడా ఖాళీగా లేక రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొన్నిచోట్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరియైన వైద్య సేవలు అందక, పడకలు లభించక అనేక మంది రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్యశాఖలో పూర్తి స్థాయిలో సిబ్బందిని, వైద్యులను నియమించి ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలను అందించాలని జనం కోరుతున్నారు.

పల్లెలపై వ్యాధుల దాడి

ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం పడకేసింది. సకాలంలో వైద్య సేవలు అందక పల్లె ప్రజానీకం సతమతమవుతోంది. పంచాయతీల్లో నిధుల లేమితో పారిశుధ్యం నానాటికీ దిగజారి పోతుండటం దుర్గంధంతోపాటు అంటు రోగాలకు కారణమవుతోంది. దీంతో సీజనల్‌ వ్యాధులైన టైఫాయిడ్‌, మలేరియా, డెంగీ, చికెన్‌ గున్యా వంటి జ్వరాలు విజృంభిస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఆస్పత్రుల్లో ఔషధాలను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచి మెరుగైన వైద్యసేవలను అందించేందుకు కృషి చేసేదని, ప్రస్తుతం రోగులకు మెరుగైన వైద్యసేవలు అందడం లేదనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పీహెచ్‌సీల్లో 173 రకాల ఔషధాలు ఉండవలసి ఉండగా కేవలం 87 ఉన్నాయి. సీహెచ్‌సీల్లో 224 రకాలు ఉండాల్సి ఉండగా కేవలం 145 రకాల ఔషధాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని తెలుస్తోంది. దీనివల్ల రోగులు ప్రైవేట్‌ మందుల షాపుల దోపిడీకి గురవుతున్నారు.

పారిశుధ్యంపై కొరవడిన శ్రద్ధ

ఈ ఏడాది తుపానులు సంభవించి అధిక వర్షాలు కురవడంతో ఆ ప్రభావం పారిశుధ్యంపై పడింది. ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ప్రధాన రహదారుల్లో సైతం చెత్త దర్శనమిస్తోంది. డ్రైనేజీల్లో మురుగునీరు నిలిచి దోమల ఉధృతి పెరిగిపోతోంది. ఓవర్‌ హెడ్‌ వాటర్‌ ట్యాంకులను సకాలంలో శుభ్రం చేయకపోవడం అంటువ్యాధులకు కారణమవుతోంది. ఇంట్లోని వ్యర్థాలను కొన్నిచోట్ల పంట కాలువల్లో పడవేయడంతో పశువుల ద్వారా సంభవించే జునోసిస్‌ సంబంధిత వ్యాధులు వ్యాప్తి చెందుతున్నా యి. జిల్లాలోని అనేక గ్రామ పంచాయతీలు బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లడానికి మాత్రమే పరిమితమవుతున్నాయ ని, దోమల ఉధృతిని తగ్గించేందుకు చర్య లు తీసుకోవడం లేదని జనం ఆవేదన చెందుతున్నారు.

నిస్సహాయ స్థితిలో ఆరోగ్య సిబ్బంది

సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తూ జ్వరాల తీవ్రత పెరుగుతున్నా వైద్య ఆరోగ్యశాఖ సహకారం లేక గ్రామీణ ప్రాంతాల్లోని ఆరోగ్య సిబ్బంది నిస్సహాయ స్థితిలో విధులను నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 515 గ్రామ సచివాలయాల పరిధిలో ఎంఎల్‌హెచ్‌పీ, ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తలకు యాప్‌లతోనే సరిపోతోంది. క్షేత్రస్థాయిలో చేసిన సర్వే వివరాలు పీహెచ్‌సీలకు అందించడంతోనే కాలం గడచిపోతోంది. ఆరోగ్యపరమైన సూచనలు, సలహాలను ఇవ్వడానికే తప్ప వ్యాధుల నివారణకు కృషి చేసే పరిస్థితి లేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత వల్ల గ్రామాల్లో నెలకు రెండుసార్లు నిర్వహించే ఫ్యామిలీ డాక్టర్‌ ప్రోగ్రాంలో వెద్యసేవలను అందించడం లేదని గ్రామీణ ప్రజలు చెబుతుండటం పరిస్థితికి అద్దం పడుతోంది.

గతంలో ఆదుకున్న జగనన్న ఆరోగ్య రక్ష

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం హయాంలో మాదిరిగా సీజనల్‌ వ్యాధుల నివారణకు గ్రామస్థాయిలో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం లేదు. అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైద్య ఆరోగ్యశాఖలో తీసుకువచ్చిన పెనుమార్పుల వల్ల క్షేత్రస్థాయి వరకూ ప్రజలకు వైద్య సేవలు అందాయి. పేద ప్రజల ఆరోగ్య రక్షణ ధ్యేయంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్యులను గ్రామాలకు, వార్డులకు తీసుకువచ్చి ఏటా జగనన్న ఆరోగ్య రక్ష ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసేవారు. నాణ్యమైన వైద్య సేవలను అందించి అన్ని జబ్బులకు ఉచితంగా మందులను అందించేవారు. అలాగే అనుభవం కలిగిన లాబ్‌ టెక్నీషియన్లును తీసుకువచ్చి ఆరోగ్య రక్ష శిబిరాల్లోనే పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ చేసేవారు. అవసరమైన రోగులకు శస్త్ర చికిత్సలను అందించేవారు. కూటమి ప్రభుత్వం అఽధికారం చేపట్టి ఆరు నెలలు పూర్తి చేసుకున్నా ఇప్పటి వరకూ సీజనల్‌ వ్యాధుల నివారణకు ప్రత్యేకమైన చర్యలు తీసుకొనకపోవడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

చర్యలు తీసుకుంటున్నాం

సీజనల్‌ దృష్ట్యా సంభవించే జ్వరాలు, వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో సర్వే నిర్వహించి వ్యాధిగ్రస్తులను గుర్తించి ఆ మేరకు చికిత్సను అందించేందుకు కృషి చేస్తున్నాం. జ్వరాల తీవ్రత ఉన్న గ్రామాల్లో అవసరాన్ని బట్టి ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తాం. – కె.దుర్గారావు దొర,

జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి

No comments yet. Be the first to comment!
Add a comment
ఊరూరా విజ్వరంభణ1
1/2

ఊరూరా విజ్వరంభణ

ఊరూరా విజ్వరంభణ2
2/2

ఊరూరా విజ్వరంభణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement