టెన్త్ పరీక్షలకు కార్యాచరణ
ముమ్మిడివరం: పదవ తరగతి పరీక్షలు సమర్థంగా నిర్వహించేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీం బాషా సూచించారు. ముమ్మిడివరం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సోమవారం సమగ్ర శిక్ష సెక్టోరియల్, జిల్లా డిజిగ్నేటెడ్ , జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డు అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. తొలుత అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సూచించిన స్టాప్ బదిలీలపై సమీక్ష నిర్వహించారు. సైన్స్ ఫెయిర్ నిర్వహణకు మార్గదర్శకాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. క్రీడల ప్రాధాన్యం, స్కూల్ కాంప్లెక్స్, ప్రగతి నివేదికల రూపకల్పనపై ఆయాశాఖల అధికారులతో సమీక్షించారు. జిల్లాలో విద్య, పర్యావరణం, క్రీడలు, సైన్స్ వంటి రంగాలలో సమగ్ర అభివృద్ధికి మార్గదర్శకాలు రూపొందించాలని సూచించారు. ఏడీ1 నాగేశ్వరరావు, ఏడీ2 సురేష్, జిల్లా ఉపవిద్యాశాఖాధికారి సూర్యప్రకాశం, హస్టల్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్ హనుమంతరావు, సమగ్ర శిక్ష కమ్మూనిటీ మొబలైజేషన్ ఆఫీసర్ బీబీవీ సుబ్రహ్మణ్యం, జిల్లా సైన్స్ అధికారి జీవీఎస్ సుబ్రహ్మణ్యం, నేషనల్ గ్రీన్‌కోర్ కోఆర్డినేటర్ ప్రభావతి, జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ సాయి పాల్గొన్నారు.
18న ఏకసభ్య కమిషన్ రాక
కాకినాడ సిటీ: షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ ఈ నెల 18న కాకినాడ రానున్నది. విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా సభ్యుడిగా ఉన్న ఈ కమిషన్ ఈ నెల 18, 19 తేదీల్లో కాకినాడలో పర్యటిస్తుందని కలెక్టర్ షణ్మోహన్ సగిలి సోమవారం విలేకర్లకు తెలిపారు. జిల్లా యంత్రాంగంతో సమావేశం కావడంతో పాటు వివిధ ఉప కులాల సభ్యులు, సంఘాలతో కమిషన్ సమావేశమై, వినతులు స్వీకరిస్తుందని వివరించారు. వీటిని పరిశీలించి, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తుందన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో, విద్యా సంస్థల్లో షెడ్యూల్డ్ కులాల ఉప వర్గాల ప్రాతినిధ్యాన్ని, సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యాపరంగా వారి వెనుకబాటును పరిశీలిస్తుందని వివరించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా కమిషన్‌కు సూచనలు, వినతులు ఇవ్వదలచిన వారు వాస్తవాల ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 19వ తేదీ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల్లోగా కలెక్టరేట్‌లోని విధాన గౌతమి సమావేశ మందిరానికి రావాలని కలెక్టర్ షణ్మోహన్ సూచించారు.
రేపు డీఆర్‌సీ సమావేశం
కాకినాడ సిటీ: కలెక్టరేట్‌లో బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు జిల్లా సమీక్ష కమిటీ (డీఆర్‌సీ) సమావేశం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ షణ్మోహన్ సగిలి సోమవారం తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరి నారాయణ, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొంటారని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment