టిడ్కో లబ్ధిదారుల సమస్యల ఏకరువు
అల్లవరం: అమలాపురం పట్టణ ప్రజలకు బోడసకుర్రులో నిర్మించిన టిడ్కో భవనాల్లో డ్రైనేజీ, లో ఓల్టేజీ, తాగునీటి సమస్యలతో తాము సతమతం అవుతున్నామని ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయకుమార్‌కు లబ్ధిదారులు వివరించారు. బోడసకుర్రులోని టిడ్కో భవనాలను చైర్మన్ సోమవారం సందర్శించి లబ్ధిదారులతో మాట్లాడారు. పలువురు లబ్ధిదారులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. టిడ్కో లబ్ధిదారులకు సరైన సౌకర్యాలు లేక 1632 ప్లాట్లకు గాను కేవలం 500 కుటుంబాల వారు మాత్రమే నివాసం ఉంటున్నారని తెలిపారు. సౌకర్యాలు లేక చాలామంది ప్లాట్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారని చెప్పారు. రుణాలు చెల్లించాలని బ్యాంకు అధికారులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని, గత ప్రభుత్వంలో టిడ్కో భవనాలు ఉచితమని చెప్పారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రుణాలు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. టిడ్కో భవనాల్లో ఎవరైనా చనిపోతే మృతదేహాన్ని అంతిమ సంస్కారాలు చేయడానికి స్థలం లేదని చెప్పారు. నాలుగు రోజులకొకసారి తాగునీరు సరఫరా చేస్తున్నారని, డ్రైనేజీ వ్యవస్థ దుర్భరంగా ఉందన్నారు. టిడ్కో భవనాల ఆనుకుని పల్లపు వీధి నుంచి మెయిన్‌రోడ్డుకి దారి కల్పించాలని కోరారు. దీనిపై చైర్మన్ స్పందిస్తూ టిడ్కో భవనాల్లో లోఓల్టేజీ సమస్య నివారణకు రూ.11 లక్షలతో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేస్తామన్నారు. డ్రెయిన్ల నిర్మాణానికి అవసరమైన టెక్నికల్ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. టిడ్కో భవనాల ఆనుకుని ఉన్న పల్లపు వీధిని సర్వే చేసి రూ.10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. రుణాల అంశం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఆయన వెంట మున్సిపల్ చైర్‌పర్సన్ రెడ్డి నాగేంద్రమణి, మాజీ చైర్మన్ యాళ్ల నాగసతీష్, జనసేన నాయకులు ఆశెట్టి ఆదిబాబు, కల్వకొలను తాతాజీ, కమిషనర్ రాజు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment