‘ఆపరేషన్’ అబ్రకదబ్ర!
● ప్రభుత్వ ఆస్పత్రిలో గుండె వైద్య యంత్రాన్ని సొంత క్లినిక్‌కు మళ్లించిన కాంట్రాక్ట్ వైద్యుడు
● పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కొద్ది రోజులకే యథాస్థానంలోకి యంత్రం
● విధుల నుంచి తొలగించిన అధికారులు
● తదుపరి చర్యలకు కలెక్టర్‌కు
నివేదించనున్న వైనం
అమలాపురం టౌన్: అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో గుండె వైద్యానికి వినియోగించే డెఫిబ్రిల్లేటర్ అనే యంత్రం మాయమైంది. ప్రభుత్వం సమకూర్చిన రూ.1.50 లక్షల విలువైన ఈ యంత్రం మాయం కావడంతో ఆస్పత్రి వైద్యుల్లోనే కాకుండా సిబ్బందిలో కలకలం రేగింది. తీరా ఈ యంత్రం ఏమైంది...? ఎక్కడుంది...? ఎవరు తీసుకెళ్లారు...? అని ఆరా తీస్తే అదే ఆస్పత్రిలో కాంట్రాక్ట్ వైద్యుడిగా పనిచేస్తున్న ఓ డాక్టర్ చాటుగా తీసుకుని వెళ్లి పట్టణంలోనే తన సొంత ఆస్పత్రిలో పెట్టుకున్నట్టు ప్రాథమిక విచారణతో తేలింది. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.శంకరరావు ఈ యంత్రం మాయంపై నాలుగు రోజుల కిందటే విచారణ నిర్వహించారు. నివేదికను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల సమన్వయకర్త డాక్టర్ కార్తీక్‌కు అందించారు. అప్పటికే ఆ కాంట్రాక్ వైద్యుడు విధులకు సక్రమంగా హాజరు కావడంలేదన్న ఆరోపణలు ఉన్న క్రమంలో ఇప్పుడు గుండె వైద్య యంత్రాన్ని పట్టికెళ్లిపోయారన్న అభియోగం తోడు కావడంతో ప్రభుత్వ ఆస్పత్రుల సమన్వయకర్త డాక్టర్ కార్తీక్ ఆయనను విధుల నుంచి తప్పించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకరరావు కూడా తమ ఆస్పత్రిలో యంత్రం చోరీ అయినట్లు పట్టణ సీఐ పి.వీరబాబుకు మౌఖికంగా ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆస్పత్రికి వచ్చి విచారించారు. పోలీసుల విచారణ నేపథ్యంలో ఆ కాంట్రాక్ట్ డాక్టర్ తాను తీసుకువెళ్లిన ఆ యంత్రాన్ని మళ్లీ ఆస్పత్రిలో యథాస్థానంలో ఉంచారు. ఆ కాంట్రాక్ట్ డాక్టర్ పరువును దృష్టిలో పెట్టుకుని పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇవ్వలేదని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకరరావు శ్రీసాక్షిశ్రీకి తెలిపారు. ఆ డాక్టర్ ఆస్పత్రిలో సెక్యూరిటీ వ్యక్తితో కుమ్మకై ్క యంత్రాన్ని తీసుకువెళ్లి తన సొంత క్లినిక్‌లో పెట్టుకున్నారని చెప్పారు. ఫలానా కాంట్రాక్ట్ డాక్టర్ ఆ యంత్రాన్ని తీసుకువెళ్లిపోయారని సాక్ష్యం చెప్పిన ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బందిపై రౌడీలు స్థానిక బైపాస్ రోడ్డులో ఆదివారం రాత్రి దాడి చేశారని తెలిపారు. ఆస్పత్రిలో యంత్రం మాయం, దానికి బాధ్యుడైన కాంట్రాక్ట్ డాక్టర్‌పై నివేదిక కలెక్టర్‌కు అందిస్తున్నామని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల సమన్వయకర్త డాక్టర్ కార్తీక్ ‘సాక్షి’కి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment