త్వరలో విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలు
అమలాపురం రూరల్: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, పరిశోధనాసక్తిని వెలికి తీసేందుకు త్వరలో విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీం బాషా తెలిపారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. సమాజంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులు తమ ఆలోచనలకు పదును పెట్టాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరూ ప్రాజెక్టులను తయారు చేయాలన్నారు. సాంకేతికత, ఆహారం, ఆరోగ్యం, పరిశుభ్రత, రవాణా, సమాచారం, సేంద్రియ వ్యవసాయం, విపత్తుల నిర్వహణ, నమూనాలు, వ్యర్థాలు, వనరుల నిర్వహణ వంటి వాటిపై ప్రాజెక్టులను రూపొందించాలని సూచించారు. మండల స్థాయి ప్రదర్శన తేదీలను ఈ నెల 29వ తేదీకి ముందుగానే ఎంఈవోలు తెలియజేయాలన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే జిల్లా సైన్స్ అధికారి సుబ్రహ్మణ్యాన్ని 96401 88525 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
వాజ్‌పేయి ఆదర్శప్రాయుడు
మామిడికుదురు: మాజీ ప్రధాని, భారత రత్న స్వర్గీయ అటల్ బిహారీ వాజ్‌పేయి అందరికీ ఆదర్శప్రాయుడని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మానేపల్లి అయ్యాజీ వేమా అన్నారు. వాజ్‌పేయి జయంతి సందర్భంగా మామిడికుదురు బస్టాండ్ కూడలిలో ఆయన చిత్రపటానికి వేమాతో పాటు ఆ పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాజ్‌పేయి పాలనలో దేశం సాధించిన అభివృద్ధిని వివరించారు. మగటపల్లిలో వాజ్‌పేయి సేవా సమితి అధ్యక్షుడు నక్కా త్రిలోచనరావు ఆధ్వర్యంలో జెడ్పీ మాజీ చైర్మన్ నామన రాంబాబు చేతుల మీదుగా సంచార జాతులకు, విద్యార్థులకు పెన్నులు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మెండా ఆదినారాయణ, నాయకులు పాల్గొన్నారు.
రామచంద్రస్వామి రథోత్సవం
అమలాపురం టౌన్: ధనుర్మాసం సందర్భంగా భూపయ్య అగ్రహారంలోని శ్రీరామచంద్రస్వామి ఆలయం వద్ద బుధవారం రథోత్సవం వైభవంగా నిర్వహించారు. అమలాపురం పుర వీధుల్లో భక్తులు స్వామివారి రథాన్ని ఊరేగించారు. మంగళవాయిద్యాల నడుమ అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమం జరిగింది. కొత్తూరి శ్రీనివాస్, జిల్లెళ్ల గోపాల్, పవన్, భాను తదితరులు పాల్గొన్నారు.
ఏవోఐ తొలి సమావేశం
అమలాపురం టౌన్: ఎల్‌ఐసీ ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (ఏవోఐ) యూనియన్ అమలాపురం శాఖ తొలి సమావేశం స్థానిక ఎల్‌ఐసీ బ్రాంచి వద్ద బుధవారం రాత్రి జరిగింది. యూనియన్ అమలాపురం శాఖ అధ్యక్షుడు సానబోయిన వీరభద్రరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాజమహేంద్రవరం డివిజన్ యూనియన్ అధ్యక్షుడు వై.విశ్వేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ యూనియన్ స్థాపించినప్పుటి నుంచి ఇప్పటి దాకా ఏజెంట్లకు సంబంధించిన 58 డిమాండ్లను నెరవేర్చామని వివరించారు. డివిజన్ సెక్రటరీ వి.నాగిరెడ్డి మాట్లాడుతూ ఢిల్లీలో మరిన్ని డిమాండ్ల పరిష్కారం కోసం 2025 ఫిబ్రవరి 11న నిర్వహించే ధర్నాలో జిల్లా నుంచి ఎల్‌ఐసీ ఏజెంట్లు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అమలాపురం బ్రాంచి యూనియన్ సెక్రటరీ గుమ్మలూరి వినాయకరావు, కోశాధికారి దొమ్మేటి శివస్వామి, ఉపాధ్యక్షులు శీలం లంకేశ్వరుడు, కోరుమిల్లి మధు, ఆర్గనైజింగ్ సెక్రటరీ అయినవిల్లి నాగేంద్ర కుమార్, జాయింట్ సెక్రటరీ మేడిశెట్టి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment