తప్పుడు కేసులు ఉపసంహరించుకోండి
రామచంద్రపురం: వెంకటాయపాలెం సర్పంచ్‌పై పోలీసులు పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో శుక్రవారం నుంచి ద్రాక్షారామ పోలీస్ స్టేషన్ వద్ద సర్పంచ్‌తో కలిసి ఆమరణ దీక్ష చేపడతామని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాశ్ హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో వెంకటాయపాలెం సర్పంచ్ యల్లమిల్లి సతీష్ కుమారి, రామచంద్రపురం ఎంపీపీ అంబటి భవానీతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సతీష్ కుమారి మాట్లాడుతూ వెంకటాయపాలెంలో గత ప్రభుత్వంలో కమ్యూనిటీ హాలును నిర్మించారన్నారు. కానీ సంబంధిత శాఖ అధికారులు దాన్ని పంచాయితీకి అప్పగించలేదన్నారు. అయితే దాన్ని బలవంతంగా ఆక్రమించుకున్నామని అధికారులతో కలిసి మంత్రి వాసంశెట్టి సుభాష్ పోలీసు కేసులు పెట్టించారన్నారు. రెండు నెలలుగా టీడీపీలోకి రావాలని తనపై ఒత్తిడి చేస్తున్నారని, దాన్ని తిరస్కరించినందుకే తప్పుడు కేసు బనాయించారని తెలిపారు.
వేధింపులు సహించబోం
సూర్యప్రకాశ్ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై వేధింపులకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మంత్రి సుభాష్ కొత్త సంప్రదాయానికి తెరతీశారన్నారు. లేనిపోని తప్పుడు కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. సర్పంచ్ సతీష్ కుమారిపై పెట్టిన తప్పుడు కేసులపై జిల్లా ఎస్పీని కలుస్తామని చెప్పారు.
వెంకటాయపాలెం సర్పంచ్‌పై కేసు
రామచంద్రపురం రూరల్: మండలంలోని వెంకటాయపాలెం సర్పంచ్ సతీష్ కుమారిపై ద్రాక్షారామ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి కేసు నమోదు చేశారు. ఎస్సై ఎం.లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటాయపాలెంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన పిల్లి అప్పారావు బీసీ కమ్యూనిటీ హాలు భవనం పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ నెల 24న ఆ భవనం వద్దకు పంచాయతీరాజ్ ఏఈ దాసరి ఏసురత్నం వెళ్లగా, పెళ్లికి సంబంధించిన డెకరేషన్ ఉండడాన్ని గుర్తించారు. దీనిపై కాంట్రాక్టర్ పట్టాభి రమణను వివరణ కోరగా.. రెండు నెలల క్రితం గ్రామ సర్పంచ్ యల్లమిల్లి సతీష్ కుమారి, ఆమె భర్త రవికుమార్ తన వద్దకు వచ్చి బలవంతంగా భవనం తాళాలు తీసుకున్నారని, అప్పటి నుంచి తమ సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. దీనిపై ఏఈ ఏసురత్నం ఇచ్చిన ఫిర్యాదు మేరకు సర్పంచ్ సతీష్ కుమారి, భర్త రవికుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
సర్పంచ్,
ఎంపీపీలతో
కలిసి
సమావేశంలో పాల్గొన్న
సూర్యప్రకాశ్
లేకపోతే ఆమరణ దీక్షకు దిగుతాం
వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్
సూర్యప్రకాశ్
Comments
Please login to add a commentAdd a comment