కొబ్బరికి దన్నేది..
సాక్షి, అమలాపురం: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొబ్బరి ధర ప్రస్తుతం ఆశాజనకంగా ఉంది. కానీ ఎప్పుడూ ఇదే ధర ఉంటుందన్న నమ్మకం రైతులకు కలగడం లేదు. పైగా ఇప్పుడు దిగుబడి తక్కువగా ఉన్నందున ఈ ధర వారికి పెద్దగా సంతోషాన్నివ్వడం లేదు. అయితే మార్కెట్‌లో లాభసాటి ధరను రైతులు కోరుకుంటున్నారు. తయారీ కొబ్బరి (ఎండు కొబ్బరి), కొబ్బరి నూనె మార్కెట్‌లు నిలకడగా ఉంటేనే అది సాధ్యమవుతుంది. కానీ ఆ పరిస్థితి మార్కెట్‌లో కనిపించడం లేదు. ఈ సమయంలో కొబ్బరికి కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం కొబ్బరి తయారీ దారులు, రైతులకు పెద్దగా ఊరటనివ్వలేదు. పెరిగిన కొబ్బరి ఉత్పత్తి వ్యయం నేపథ్యంలో కేంద్రం పెంచిన ధర గిట్టుబాటు కాదని చెబుతున్నారు.
ఎండు కొబ్బరి తయారీకి బ్రేక్
గోదావరి జిల్లాలో ఎండు కొబ్బరి తయారీ దాదాపు నిలిచిపోయింది. ప్రస్తుత మార్కెట్‌లో పచ్చి కొబ్బరి వెయ్యి కాయల ధర రూ.14 వేల వరకు ఉంది. ఇదే సమయంలో ఎండు కొబ్బరి క్వింటాల్ రూ.12,500 పలుకుతుంది. ఈ కారణంగా రైతులు నేరుగా కొబ్బరి కాయను ఎగుమతి చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల పీచు, చిప్పకు ముడి సరుకు దొరకడం లేదు. కొబ్బరి నూనె ఉత్పత్తి సైతం నిలిచిపోతోంది. స్థానికంగా కార్మికులకు ఉపాధి లేకుండా పోతోంది. మొత్తం కొబ్బరి పరిశ్రమ ఉనికే లేకుండా పోతోంది.
ఉపాధికి విఘాతం
ఎండు కొబ్బరి తయారీ లాభసాటిగా ఉంటే స్థానికంగా కొబ్బరి కాయ ఒలవడం, కొబ్బరి తయారీ వంటి పనుల వల్ల పీచుకు అవసరమైన డొక్క, చిప్ప పెద్ద ఎత్తున లభ్యమవుతుంది. దాని వల్ల సుమారు 5 వేల మంది కార్మికులకు ప్రత్యక్షంగా ఉపాధి దక్కుతుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కేవలం దేవాలయాల నుంచి వస్తున్న చిప్పల నుంచి మాత్రమే ఎండు కొబ్బరి తయారు చేస్తున్నారు. కోనసీమ జిల్లాలో సుమారు మూడు వేల మంది వరకు కొబ్బరి తయారీ నిలుపుదల చేసినట్టు అంచనా.
రైతుల పెదవి విరుపు
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని 1.85 లక్షల ఎకరాలలో కొబ్బరి సాగు జరుగుతుండగా, ఒక్క కోనసీమ జిల్లాలోనే రాష్ట్రంలోనే అత్యధికంగా 1,10,317 ఎకరాల్లో సాగవుతోంది. పచ్చి కొబ్బరి ధరను పరిశీలిస్తే ఎండు కొబ్బరి తయారు చేస్తే క్వింటాల్‌కు ఉత్పత్తికి ఏకంగా రూ.16,950 వరకు అవుతుంది. ఈ ఏడాది కొబ్బరి సగటు ధర వెయ్యింటికీ రూ.తొమ్మిది వేలు. దీనిని పరిగణనలోకి తీసుకుంటే 1,150 కాయలకు గాను రూ.10,350, తయారీ ఖర్చు రూ.రెండు వేలు కలిపి మొత్తం రూ.12,350 వరకు అవుతోంది. కేంద్రం ప్రకటించిన రూ.11,582ను పరిగణనలోకి తీసుకుంటే ఉత్పత్తి వ్యయం కన్నా రూ.768 తక్కువ.
కొబ్బరి తయారీ నిలిపివేశాం
గతంలో మేము ఎండు కొబ్బరి తయారు చేసేవాళ్లం. కానీ ఇప్పుడు ఇస్తున్న ధర గిట్టుబాటు కానందున తయారీని నిలుపుదల చేశాం. తాజాగా కేంద్రం పెంచిన ధర వల్ల రైతులకు ప్రయోజనం లేదు. కొబ్బరి కాయ రూ.6 అయితే, అప్పుడు కేంద్రం ప్రకటించిన ధర గిట్టుబాటు అవుతుంది.
– అరిగెల సూరిబాబు,
సమనస, అమలాపురం మండలం
తగ్గని పచ్చి కొబ్బరి ధర
ఈ ధరతో ఎండు కొబ్బరి
తయారు చేస్తే నష్టమే
ఈ ప్రక్రియతోనే ఉపాధి
ఆ పరిస్థితి లేకపోవడంతో
రైతుల ఆవేదన
Comments
Please login to add a commentAdd a comment