పనికి వెళ్లి.. శవమై తేలింది..
● మహిళా కూలీపై యువకుల ఘాతుకం
● అత్యాచారం, ఆపై హత్య చేసిన దుర్మార్గులు
● నిందితుల అరెస్టు
కడియం: కడియపులంక పంచాయతీ పరిధిలోని బుర్రిలంక గ్రామానికి చెందిన రౌతు కస్తూరి (43)ని నలుగురు యువకులు సామూహిక అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. దీనికి సంబంధించి దక్షిణ మండలం డీఎస్పీ భవ్య కిశోర్ స్థానిక విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం.. కస్తూరి అక్టోబర్ 16వ తేదీన నర్సరీలో కూలి పనికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో 17వ తేదీన కడియం పోలీస్ స్టేషన్‌లో ఆమె భర్త పాపారావు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉండగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా చొప్పెల్ల లాకుల వద్ద శరీరంపై అరకొర దుస్తులతో ఉన్న మహిళ మృతదేహం లభించింది. అదృశ్యమైన కస్తూరిదే ఆ మృతదేహం అని కుటుంబ సభ్యులు గుర్తించారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సీసీ కెమెరాల పరిశీలన
కస్తూరి పనికి వెళ్లిన నర్సరీకి సమీపంలోని సీసీ కెమెరాలను గమనించగా, ఆమె పనికి వెళుతున్నట్లుగా అందులో నమోదైంది. కానీ తిరిగి రాలేదు. దీంతో సమీపంలోని నర్సరీల్లో రైతులు, కూలీలను పోలీసులు విచారించారు. కస్తూరి పనిచేసే నర్సరీ పక్కనే గల మరో నర్సరీలో పనిచేసే దేవర ఏసు.. ఆమె అదృశ్యమైనప్పటి నుంచి కన్పించడం లేదని గుర్తించారు. దీంతో అతడి కదిలికలపై నిఘా పెట్టి పట్టుకున్నారు.
మద్యం మత్తులో..
బుర్రిలంక గ్రామానికి చెందిన దేవర ఏసు, వెలుబుడి ప్రవీణ్, లోకిన జయప్రసాద్, పొట్టిలంక గ్రామానికి చెందిన దాసరి సురేష్ 16వ తేదీ సాయంత్రం 5.30 సమయంలో మద్యం తాగుతున్నారు. అదే సమయంలో పని ముగించుకుని ఇంటికి బయలుదేరిన కస్తూరిని కాళ్లూచేతులూ పట్టుకుని మొక్కల మధ్యకు లాక్కుని వెళ్లి సామూహికంగా అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను హత్య చేసి కోటిపల్లి కాలువలోకి మృతదేహాన్ని విసిరేశారు. కాగా.. కేసులో నిందితులైన నలుగురినీ జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించామని డీఎస్పీ భవ్య కిశోర్ తెలిపారు. వారిపై రౌడీషీట్ ఓపెన్ చేసి, తగు చర్యలు చేపడతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment