అత్యవసర వైద్యంపై అక్కసు!
● 108, 104 ఉద్యోగులపై
● కనికరం చూపని కూటమి ప్రభుత్వం
● మూడు నెలలుగా వేతనాల
నిలిపివేత
● ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి
● మారుమూల గ్రామాల్లో వైద్యం
● అందించే సేవకులపై చిన్నచూపు
సాక్షి, రాజమహేంద్రవరం: అత్యవసర వైద్యం అందించే ఉద్యోగులపై కూటమి ప్రభుత్వం కక్ష గట్టింది. ఆపద్బాంధవులను ఆదుకునే వ్యవస్థపై అక్కసు ప్రదర్శిస్తోంది. గ్రామానికి వెళ్లి వైద్యం అందించే వాహనాలపై నిర్లక్ష్యపు ధోరణి అవలంబిస్తోంది. మూడు నెలలుగా వేతన నిధులు మంజూరు చేయకుండా అలక్ష్యం ప్రదర్శిస్తోంది. ఫలితంగా సిబ్బందికి ఆకలికేకలు తప్పడం లేదు. దీపావళి పండగ సైతం ఆనందంగా గడుపుకోలేని పరిస్థితి తలెత్తిందని వారు ఆవేదన చెందుతున్నారు.
ఇదీ పరిస్థితి..
జిల్లా వ్యాప్తంగా 108 వాహనాలు 21 ఉన్నాయి. 99 మంది డ్రైవర్లు, ఎమర్జెన్సీ టెక్నీషియన్లు విధులు నిర్వహిస్తున్నారు. 104 వాహనాలు 33 ఉండగా డ్రైవర్లు, డీఈఓలు ఇతర సిబ్బంది కలిపి 66 మంది వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రతి నెలా 60 వేలకు పైగా రోగులు వివిధ రకాల వైద్య సేవలు పొందుతున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలన్న తేడా లేకుండా వైద్య సేవలు అందిస్తున్న వ్యవస్థపై కూటమి ప్రభుత్వం కనీస కనికరం లేకుండా వ్యవహరిస్తోంది.
మూడు నెలలుగా ముప్పుతిప్పలు
104 వాహనాలు అరబిందో సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. వాహనాలకు అవసరమైన డీజిల్, పెట్రోల్, మందులను ఆ సంస్థ అందజేస్తోంది. వేతనాలు మాత్రం ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉందని ఆ సంస్థ వెల్లడిస్తోంది. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాకపోవడంతో వేతనాలు ఇవ్వలేకపోతున్నామని వారు చెప్తున్నారు. వాహనాల్లో పనిచేసే డ్రైవర్లకు సీనియారిటీ ప్రకారం రూ.14 వేల నుంచి రూ.25 వేల మధ్యలో వేతనం ఉంటుంది. డేలా ఎంట్రీ ఆపరేటర్లకు రూ.15 వేలు, మేనేజర్లకు రూ.50 వేల వరకు వేతనాలు ఇస్తున్నారు. 108లో పనిచేసే ఈఎంటీ, పైలెట్లకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు వేతనం అందుతోంది. సూపర్‌వైజర్లకు రూ.30 వేలు, మేనేజర్లకు రూ.50 వేలు చెల్లిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల వేతనాలు అందకపోవడంతో వారికి ఆకలి కేకలు తప్పడం లేదు. కుటుంబ పోషణ భారంగా మారిందని, అప్పులు చేసి పప్పుకూడు తినాల్సి వస్తోందని, ప్రభుత్వం వేతనాలు ఎప్పుడు మంజూరు చేస్తుందో..? తమకు ఎప్పుడు అందుతాయోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగని సేవలు స్తంభింపచేస్తే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారన్న ఉద్దేశంతో అత్యవస వైద్య సేవలకు ఆటంకం లేకుండా చూస్తున్నారు. దీపావళి పండుగ రోజైనా వేతనాలు అందుతాయని ఆశగా ఎదురుచూసినా నిరాశే ఎదురైందని వాపోతున్నారు. తమపై కూటమి ప్రభుత్వం ఎందుకంత కక్షపూరితంగా వ్యవహరిస్తోందో అర్థం కావడం లేదని అంటున్నారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా లాభం లేకుండా పోయిందని అంటున్నారు.
వేతనాలు అందక ఇబ్బందులు
అత్యవసర సమయాల్లో రాత్రి, పగలు తేడా లేకుండా విధులు నిర్వర్తిస్తున్నాం. అయినా మూడు నెలలుగా వేతనాలు అందలేదు. కనీసం దీపావళి పండుగకై నా మంజూరు చేస్తారని అనుకున్నాం. పండుగ పూట నిరాశే ఎదురైంది. కుటుంబ పోషణ కూడా భారంగా మారింది. అప్పులు చేసి బతుకుబండి లాగుతున్నాం. ప్రభుత్వం ఇప్పటికై నా వేతన నిధులు మంజూరు చేయాలి. లేదంటే పస్తులే గతి.
– రమణ,
జిల్లా అధ్యక్షులు,
108 ఉద్యోగుల సంఘం
గోల్డెన్ అవర్‌కు ఆటంకం
అత్యవసర సమయంలో గోల్డెన్ అవర్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ప్రమాదం జరిగిన వ్యక్తికి గంటలోపు ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం అందిస్తే ప్రణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశంతో దివంగత ముఖ్యంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 108 ద్వారా వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆయన ఆశయం సత్ఫాలనిచ్చింది. తదనంతర కాలంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొనసాగించిన మంచిని మరపించేందుకు కూటమి ప్రభుత్వం కుట్రతో చేస్తున్న చర్యలను మానుకోవాలని హితవు పలుకుతున్నారు.
గ్రామీణులకు వరం 104
గ్రామీణ ప్రాంత ప్రజలకు 104 వాహనం వరంగా మారింది. ఆయా గ్రామాలకు వెళ్లి వాళ్ల ఇంటి వద్దే వైద్యం పొందే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. 104లో అన్ని రకాల వైద్య పరీక్షలు చేపట్టేందుకు అవసరమైన సదుపాయాలు కల్పించారు. ఈసీజీతో సహా 9 రకాల పరీక్షలు నిర్వహిస్తారు. మధుమేహం, రక్తపోటు, గుండె, కడుపు, కంటికి సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించి బాధితులకు అక్కడికక్కడే 74 రకాల మందులు ఉచితంగా అందిస్తారు. అన్ని సేవలు అందిస్తున్నా.. కడుపు నిండని పరిస్థితి తలెత్తిందని ఆ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అత్యవసర విధుల్లో 108
108 సిబ్బంది అత్యవసర విధుల్లో ఆదర్శంగా నిలుస్తున్నారు. రోజుకు 12 గంటల పాటు పనిచేయాల్సి వస్తోంది. అదనంగా చేసే పనికి ఎటువంటి అదనపు చెల్లింపులు ఇవ్వడం లేదు. ఒక్కో వాహనానికి కనీసం ఆరుగురు ఉద్యోగులు రెండు షిప్టుల్లో పనిచేయాల్సి ఉంటుంది. సిబ్బంది కొరత ఉన్నా అలాగే నెట్టుకొస్తున్నారు. ఏ ఉద్యోగీ వారాంతపు సెలవు తీసుకోవడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతోంది. పండుగలు అసలు ఉండడం లేదు. డ్యూటీ వేసిన మరుక్షణం వెళ్లిపోవాల్సిందే. అంత యాతన అనుభవించి పనిచేస్తున్నా.. సకాలంలో జీతాలు అందకపోవడంతో ఆవేదన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment