ఏడీబీ రోడ్డు విస్తరణకు అవరోధాలు తొలగించండి
కలెక్టర్ ప్రశాంతి
రంగంపేట: ఏడీబీ రోడ్డు విస్తరణ పనులు తిరిగి ప్రారంభం కావడంతో ఎక్కడా అవరోధాలు లేకుండా చర్యలు చేపట్టాలని స్థానిక రెవెన్యూ అధికారులకు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి సూచించారు. రంగంపేట మండలం పెదరాయవరం వద్ద ఏడీబీ రోడ్డును శుక్రవారం ఆమె పరిశీలించారు. పెదరాయవరం రామకృష్ణా రైస్ మిల్లు వద్ద రోడ్డుకు రెండు వైపులా సమానంగా కాకుండా ఒక వైపే ఎక్కువగా భూమిని తీసుకుంటున్నారంటూ గతంలో స్థానిక రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ ప్రదేశాన్ని కలెక్టర్ ప్రశాంతి పరిశీలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను స్థానిక రెవెన్యూ అధికారుల నుంచి తెలుసుకుని రైస్ మిల్లుకు సంబంధించి రోడ్డు విస్తరణలో కోల్పోతున్న స్థలానికి ఇప్పటికే యజమానులకు ప్రభుత్వం నగదు జమ చేయడం జరిగిందని, కాబట్టి మార్కింగ్ ప్రకారం కట్టడాలను తొలగించి స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలన్నారు. మరొక వైపు కూడా 14 సెంట్ల స్థలం రోడ్డుకు అవసరమవుతుందని, ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆ స్థల యజమానికి కూడా నగదు జమ చేసి ఏడీబీ రోడ్డు విస్తరణ పనులకు ఎలాంటి అవరోధాలు లేకుండా సత్వర చర్యలు చేపట్టాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ ప్రశాంతి ఆదేశించారు. రోడ్డు అభివృద్ధి జరిగితే చుట్టు పక్కల గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయని, కాబట్టి రోడ్డు విస్తరణకు స్థానికంగా భూములు కోల్పోతున్న రైతులు, భూముల యజమానులు సహకరించాలని ఆమె కోరారు.
పేకాట శిబిరంపై దాడి
9 మంది అరెస్టు
కాకినాడ రూరల్: మండలంలోని తూరంగి గ్రామం శివాలయం సమీపంలోని ఒక ఇంట్లో పేకాట అడుతున్నట్టు సమాచారం అందుకున్న ఇంద్రపాలెం పోలీసులు శుక్రవారం దాడి చేశారు. ఈ దాడిలో 9 మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ.2,15,700 స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై వీరబాబు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment