కార్తిక దామోదరా.. కృపాసాగరా.. | - | Sakshi
Sakshi News home page

కార్తిక దామోదరా.. కృపాసాగరా..

Published Sat, Nov 2 2024 2:10 AM | Last Updated on Sat, Nov 2 2024 2:10 AM

కార్త

కార్తిక దామోదరా.. కృపాసాగరా..

శివకేశవులకు ప్రీతికరమైన మాసం...

మన సంప్రదాయంలో శివకేశవులిద్దరికీ ప్రీతకరమైన మాసం కార్తికం ఒక్కటే. ఇటు శివపరంగా కార్తిక సోమవారాలు, నాగుల చవితి వంటి పర్వదినాలు. అటు విష్ణుపరంగా ఏకాదశి, క్షీరాబ్ధి ద్వాదశి వంటి పర్వదినాలు ఈ మాసంలోనే వస్తాయి. కార్తికంలో వన సమారాధనల్లో ఉసిరి చెట్టు నీడన సాలగ్రామ పూజలు చేయడం, కార్తిక దామోదర ప్రీత్యర్థం పూజలు చేయడం వల్ల శివకేశవులిద్దరినీ ఈ మాసంలో పూజించడం సంప్రదాయం.

– పెద్దింటి నీలకంఠ శర్మ,

ఉమామార్కండేయ స్వామి ఆలయ అర్చకుడు

దీప దర్శనం, నదీస్నాన పుణ్యఫలం

కార్తిక మాసంలో ప్రతి రోజూ పుణ్యదినమే. నిత్యం నదీ స్నానం చేసి దీప దర్శనం చేసుకోవడం వల్ల పాపభీతి తొలిగి ఆ హరిహరుల కృపకు పాత్రులవుతాం. అంతే కాకుండా ఈ మాసంలో పుణ్యదానాలు చేయడం శుభప్రదం. డిసెంబర్‌ 1వ తేదీ వరకు కార్తిక మాసం ఉంటుంది.

– శ్రీమాన్‌ చిన్న వెంకన్న బాబు స్వామిజీ, శ్రీమహాలక్ష్మి సమేత శ్రీవెంకటేశ్వర స్వామి పీఠాధిపతి

ఆలయాలకు కార్తిక శోభ

హరిహరాదులకు ప్రీతిపాత్రం

పుణ్య స్నానాలకు రేవులు సిద్ధం

దీపారాధనలకు ఆలయాల్లో

విస్తృత ఏర్పాట్లు

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): హరిహరులకు ప్రీతికరమైన కార్తిక మాసం ప్రారంభం కానుంది. దీపారాధనకు విశేష ప్రాధాన్యమున్న మాసం కావడంతో అన్ని ఆలయాలు, నదీ తీరాలు, ఇళ్లు దీప కాంతులతో ధగద్ధమాయం కానున్నాయి. ఈ సందర్భంగా జిల్లాలోని శైవ క్షేత్రాలతో పాటు నదీతీరాన ఉన్న ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

స్నాన ఘట్టాలు సిద్ధం

పవిత్ర కార్తిక మాసంలో నదీ స్నానాలకు విశేష ప్రాశస్త్యం ఉంది. అందువల్ల రాజమహేంద్రవరంలోని గోదారమ్మ ఘాట్లు అయిన పుష్కరఘాట్‌, కోటిలింగాల ఘాట్‌, సరస్వతీ ఘాట్‌, వీఐపీ ఘాట్‌, గౌతమి ఘాట్‌ తదితరాలను శుభ్రం చేశారు. మహిళలు దుస్తులు మార్చుకోవడానికి వీలుగా ప్రత్యేక గదులు, జల్లు స్నానఘట్టం ఏర్పాట్లు చేశారు.

రాజమహేంద్రవరంలో..

గోదావరి గట్టున ఉన్న మార్కండేయ స్వామి ఆలయం, అభినవ విరూపాక్ష పీఠమనే పేరున్న భువనేశ్వరీ సహిత ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయాలను కార్తిక మాసోత్సవాలకు సిద్ధం చేశారు.

ద్రాక్షారామలో కార్తిక శోభ..

దక్షిణ కాశిగా, పంచారామ క్షేత్రాల్లో ఒకటిగా, త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా, అష్టాదశ శక్తి పీఠాల్లో 12వదిగా విరాజిల్లుతున్న మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి ఆలయం కార్తిక శోభను సంతరించకుంది.

ముస్తాబైన అన్నవరం....

హరిహర మూర్‌ాత్యత్మకమైన సత్యనారాయణ స్వామి సన్నిధానం రత్నగిరి మరో ప్రముఖమైన ఆలయం. దేశవిదేశాల నుంచి ఈ స్వామి దర్శనానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. లింగాకృతిలో పరమేశ్వరుడు, వీరవెంకట సత్యనారాయణ స్వామి రూపంలో శ్రీమహావిష్ణువు, సిరులొసగే దేవేరి శ్రీమహాలక్ష్మి, అనంతలక్ష్మీ సత్యవతీదేవిగా దర్శనమిచ్చే ఏకై క క్షేత్రం ఇది.

అన్నవరం: హరిహరాదులకు ప్రీతికరమైన కార్తికమాసం ప్రారంభమైంది. శుక్రవారం రాత్రి అర్చకస్వాములు ఈ మేరకు ధ్వజస్తంభం వద్ద శ్రీఆకాశ దీపంశ్రీ ఏర్పాటు చేశారు.

పర్వదినాలలో అర్ధరాత్రి ఒంటిగంట నుంచే..

కార్తికమాసంలో శని, ఆది, సోమ వారాలతో పాటు, దశమి, ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణమి తదితర 16 పర్వదినాల్లో స్వామివారి దర్శనానికి భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున తెల్లవారుజాము ఒంటి గంట నుంచే స్వామివారి వ్రతాలు, రెండు గంటల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. ఈ మేరకు ముందు రోజే వ్రతాలకు టిక్కెట్లు ఇచ్చేలా అదనపు కౌంటర్లు ఏర్పాటు చేశారు. పర్వదినాల్లో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పశ్చిమ రాజగోపురం వద్ద రోప్‌ పార్టీని ఏర్పాటు చేశారు.

కాగా క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా 13వ తేదీన తెప్పోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని 15వ తేదీన గిరి ప్రదక్షిణకు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెలంతా చిన్నకార్లు, ఆటోలు మినహా మరే ఇతర వాహనాలను కొండ మీదకు అనుమతించడం లేదు. పెద్ద వాహనాలను కళాశాల మైదానంలో నిలిపి, బస్‌లు, ఆటోల ద్వారా కొండమీదకు రావల్సి ఉంటుంది. రత్నగిరిపై రెండు వేల మంది సేద తీరేలా రత్నగిరి డార్మెట్రీ, విష్ణుసదన్‌లోని 36 హాళ్లు ఏర్పాటు చేశారు.

రత్నగిరిపై ఏర్పాట్ల పరిశీలన

కాగా, దేవస్థానంలో ఏర్పాట్లను ఈఓ కె.రామచంద్రమోహన్‌ శుక్రవారం పరిశీలించి అసిస్టెంట్‌ కమిషనర్‌ రామ్మొహన్‌రావు, ఈఈ వి.రామకృష్ణ, డీఈలు రాంబాబు, సత్యనారాయణలకు పలు సూచనలిచ్చారు.

దేవదాయశాఖ అధికారులు జారీచేసిన ప్రత్యేక సూచనలివే

1. అన్ని శైవక్షేత్రాల్లో ఆయా దేవాలయ ఆచారాలు, ఆగమాల ప్రకారం అలంకణలు ఉండాలి. ప్రత్యేక పర్వదినాల్లో విశిష్ట అలంకారాలను సాంప్రదాయం ప్రకారం చేయాలి.

2. పంచారామాలు, ముఖ్యమైన శివాలయాల్లో ప్రాతఃకాల దర్శనం, అభిషేకాలు తెల్లవారుజామున 3 గంటల నుంచి ప్రారంభించాలి.

3. కార్తికమాసంలో దీపారాధన ప్రత్యేక ఫలాన్ని అందిస్తుంది. సూర్యాస్తమయం, సూర్యదోయం ఆలయాల్లో దీపాలను ఉంచాలి. ఆకాశదీపాలు వెలిగించాలి.

4. కార్తీక మాసంలో పర్వదినాలు, వాటి విశిష్టతలు భక్తులకు తెలిసేలా ఏర్పాట్లు చేయాలి.

5. పర్వదినాలు, సోమవారాల్లో క్యూలైన్‌ త్వరగా జరిగేలా చర్యలు తీసుకోవాలి.

6. దేవాలయాల్లో విద్యుత్‌ విభాగం పటిష్ట తనిఖీచేసి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలి.

7. ఉచిత దర్శనం, ఉచిత ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు చేసుకోవాలి

8. వీఐపీ దర్శనాలకు ప్రత్యేక సమయాలు కేటాయించాలి.

9. ఆలయాలు పరిశుభ్రంగా ఉండేలా స్వీపర్లను ఏర్పాటు చేసుకోవాలి. చెత్తబుట్టలు ఏర్పాటు చేసుకోవాలి. ఆలయ పరిసరాలను శుభ్రంగా ఉంచి బ్లీచింగ్‌ చల్లి, ఫినాయిల్‌ పిచికారీ చేయాలి.

10. ఆలయాలకు ప్రతీరోజు మామిడి తోరణాలు అలకరించాలి.

11. వృద్ధులు, వికలాంగులు, చిన్న పిల్లలకు ప్రత్యేక క్యూలైన్‌ ఏర్పాటు చేసి స్వామి వారి దర్శనం సులువుగా అయ్యేలా చూడాలి తీసుకోవాలి.

12. అభిషేకం సమయాల్లో అంతరాలయం లోనికి ఒకేసారి ఎక్కువ మంది అర్చకులను అనుమతించడం వల్ల దర్శనం కోసం వచ్చే భక్తులకు ఆటంకం కలుగుతుంది. ఆ సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలి.

13. అభిషేక జలం వృథాపోకుండా అర్చకులు శ్రద్ధ వహించాలి.

14. అవసరం మేరకు అదనపు సిబ్బందిని డిప్యూటేషన్‌పై తీసుకోవాలి.

15. భక్తులతో సిబ్బంది మర్యాద పూర్వకంగా ప్రవర్తించాలి.

16. కార్తీక దీపం ఉంచే సమయంలో ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి

17. సాంస్కృతిక కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి.

18. ఆలయంలో సమాచార కేంద్రం ఏర్పాటు చేసుకోవాలి.

19. దర్శనానికి వచ్చే భక్తులు అనారోగ్యానికి గురైతే వారికి చికిత్స అందించేందుకు వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలి.

గాడాలలో శ్రీమహాలక్ష్మి సమేత

వెంకటేశ్వర పీఠంలో..

గాడాలలో వేంచిసిన శ్రీమహాలక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి పీఠంలో కార్తిక మాసం సందర్భంగా వారాహి అమ్మవారిగా నిత్యం సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరుకు అమ్మవారి దర్శనం ఉంటుందని పీఠాధిపతి శ్రీమాన్‌ చిన్న వెంకన్న బాబు స్వామిజీ తెలిపారు.

కోర్కెలు తీర్చే

కుమారారామ భీమేశ్వరుడు...

పంచారామ క్షేత్రాల్లో సామర్లకోటలోని కుమారారామ భీమేశ్వరస్వామి కోరిన కోర్కెలు తీర్చుతాడని భక్తుల నమ్మకం. ఈ క్షేత్రంలోని పరమేశ్వరుడు యోగలింగాకృతిలో సాక్షాత్కరిస్తారు. ఇక్కడి లింగాన్ని కుమారస్వామి స్వయంగా ప్రతిష్ఠించాడని పురాణ ప్రశస్తి.

No comments yet. Be the first to comment!
Add a comment
కార్తిక దామోదరా.. కృపాసాగరా..1
1/3

కార్తిక దామోదరా.. కృపాసాగరా..

కార్తిక దామోదరా.. కృపాసాగరా..2
2/3

కార్తిక దామోదరా.. కృపాసాగరా..

కార్తిక దామోదరా.. కృపాసాగరా..3
3/3

కార్తిక దామోదరా.. కృపాసాగరా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement