మద్యం షాపు వద్దని ఆందోళన
రామచంద్రపురం రూరల్: రామచంద్రపురం మండలంలోని వెల్ల గ్రామం శివారు వెల్లసావరం గ్రామానికి వెళ్లే రహదారి సమీపంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న మద్యం షాపును దూరంగా తరలించాలని శుక్రవారం టీడీపీ, జనసేన కార్యకర్తల ఆధ్వర్యంలో మహిళలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్ధినులు, గ్రామస్తులు ధర్నా చేశారు. వెల్ల, వెల్లసావరం, గొల్లలచెరువు, అరుంధతి పేట, కందులపాలెం, ఆదివారపుపేట తదితర గ్రామాల నుంచి విద్యార్ధినులు ఇదే రహదారిలో వెల్ల జెడ్పీ హైస్కూల్, రామచంద్రపురంలోని వివిధ కళాశాలలకు వెళుతుంటారు. ఈ నేపథ్యంలో టీడీపీ మండల యూనిట్ ఇన్‌చార్జి చింతలపూడి కిరిణ్ కిశోర్, బూత్ ఇన్‌చార్జి వాసా బసవకుమార్, నూకెళ్ల భవాని శంకర్, జనసేన కార్యకర్తలు గాడా దుర్గాప్రసాద్, బంటు కాళీభగవాన్, కురసాల సుబ్బారావు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న ద్రాక్షారామ ఎస్సై ఎం.లక్ష్మణ్ కానిస్టేబుల్‌ను పంపించి విచారణ చేయించారు.
ఇరువర్గాల మధ్య ఘర్షణ
జగ్గంపేట: దీపావళి బాణసంచా విషయంలో ఇరు వర్గాల మధ్య నెలకొన్న వివాదం ఘర్షణకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో దాడి చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. జగ్గంపేట సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజపూడి గ్రామంలో ఒక వర్గం వారు దీపావళి బాణసంచా కాల్చుతున్నారు. అయితే ఇంటిలో చంటి పిల్లలు ఉన్నారు, కాల్చవద్దంటూ మరో వర్గం వారు అభ్యంతరం చెప్పారు. దీంతో వారి మధ్య ఘర్షణ జరిగింది. రాళ్లు, కర్రలతో దాడి చేసుకోవడంతో ఆరుగురికి గాయాలయ్యాయి. వారిని జగ్గంపేట సీహెచ్‌సీకి చికిత్స కోసం తరలించారు. ఇరువర్గాలపై కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
యువకుడి అదృశ్యం
కడియం: జేగురుపాడు శివాలయం వీధికి చెందిన 30 ఏళ్ల వి.శివ అదృశ్యమయ్యాడు. అతడు గత నెల 29వ తేదీన పుట్టినరోజు ఫంక్షన్‌కు వెళుతున్నానని కుటుంబ సభ్యులకు చెప్పారు. అప్పటి నుంచి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు శుక్రవారం కడియం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆచూకీ తెలిసిన వారు కడియం పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment