రెండు తాటాకిళ్లు దగ్ధం
గోకవరం: మండలంలోని పెంటపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో గురువారం జరిగిన అగ్నిప్రమాదాల్లో రెండు తాటాకిళ్లు కాలిపోయాయి. మూడు కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డాయి. పెంటపల్లి భగీరథ కాలనీలో కొండ చిన్నకృష్ణ, వెంకట రమణ దంపతుల తాటాకిల్లుకి అర్ధరాత్రి సమయంలో నిప్పంటుకుంది. ఈ ప్రమాదంలో ఇంట్లోని సామగ్రితో పాటు బీరువాలో ఉంచిన రూ.80 వేలు కాలిపోయాయని బాధితులు వాపోయారు. అలాగే కొత్తపల్లి గ్రామంలో తాటాకిల్లుకి నిప్పంటుకుని గండేపల్లి మంగయ్యమ్మ, బొజ్జపు లక్ష్మి కుటుంబాలకు నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.2 లక్షలు ఆస్తినష్టం సంభవించిందని బాధితులు తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో
బాలుడి మృతి
ఆలమూరు: మోదుకూరు గ్రామానికి చెందిన తాతపూడి రోహిత్ (13) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఎస్సై ఎం.అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక ప్రైవేట్ హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న రోహిత్ ఈ నెల 29న తన ఇంట్లో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అపస్మారక స్థితికి చేరుకున్న బాలుడిని కుటుంబ సభ్యులు కాకినాడ సామాన్య ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. స్కూల్ యాజమాన్యం వేధింపుల వల్లే తమ బిడ్డ ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రత్యేక రైళ్ల రాకపోకలు
రాజమహేంద్రవరం సిటీ: రైల్వే ప్రయాణికుల రద్దీని అనుసరించి 16 జనసాధారణ్ అన్ రిజర్వడ్ రైళ్లను విజయవాడ – విశాఖపట్నం మధ్య నడుపుతున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. ఇవి ఈ నెల 1, 3, 4, 6, 8, 10, 11, 13 తేదీలలో రాకపోకలు సాగిస్తాయన్నారు. ప్రయాణికులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment