ఒడ్డున వడిదొడుకులు
రూ.3 కోట్ల అంచనా వ్యయం
బీచ్ వద్ద నుంచి సాగరసంగమం వరకూ తీరం అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా కాంక్రీట్ వాల్ కమ్ రోడ్ నిర్మాణానికి రూ.కోటి 50 లక్షలతో ప్రతిపాదనలు సిద్థం చేసినట్టు పర్యాటక శాఖ గతంలో పేర్కొంది. అయితే లైట్‌హౌస్ వద్ద నుంచి పల్లిపాలెం వరకూ కాంక్రీట్ వాల్ పొడిగింపు నిర్మాణంతో ఈ మొత్తం రూ.3 కోట్లకు చేరింది. దీనిపై పరిశీలిస్తామని కూడా ఆ శాఖ అప్పట్లో వెల్లడించింది.
● అంతుచిక్కని భౌగోళిక మార్పులతో
అంతర్వేది సాగరం
● తరచూ తీరం వైపునకు పోటెత్తుతున్న కెరటాలు
● 500 ఎకరాల్లో సరుగుడు తోటల కనుమరుగు
● ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానికులు
సఖినేటిపల్లి: అంతుచిక్కని భౌగోళిక మార్పులతో తరుచూ అంతర్వేది వద్ద సముద్రం.. తీరం వైపునకు పోటెత్తుతున్న తీరుకు ఆ ప్రాంతవాసులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా అమావాస్య, పౌర్ణమి, ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో పోటెత్తే సముద్రం, సాధారణ రోజుల్లో కూడా తీరం వైపునకు ఉరకలు వేస్తుండడంతో కంటిమీద కునుకు లేకుండా చేస్తోందని వారు చెబుతున్నారు.
రాజోలు దీవిలో...
రాజోలు దీవిలోని కరవాక, కేశనపల్లి, చింతలమోరి, కేశవదాసుపాలెం తదితర ప్రాంతాల్లోని సముద్ర తీరాలకు భిన్నంగా అంతర్వేది వద్ద తీరం వైవిధ్యంగా ఉంటుందని ఇక్కడి ప్రజలు అంటున్నారు. ఇతర ప్రాంతాల్లోని తీరాల్లో ఒక్క ప్రకృతి వైపరీత్యాల్లో మాత్రమే అలజడిగా ఉండే సముద్రం, సాధారణ రోజుల్లో ఎంతో ప్రశాంతంగా ఉంటుందన్నారు. అయితే కేవలం అంతర్వేది వద్ద మాత్రం ప్రకృతి వైపరీత్యాలతో పాటు, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో తీరం వైపునకు కెరటాల ఉధృతి ఉంటోందని వారు చెబుతున్నారు.
వైవిధ్యానికి కారణాలు ఇవే!
రాజోలు దీవిలో ఇతర ప్రాంతాల్లో తీరంలోని పరిస్థితులకు భిన్నంగా అంతర్వేది వద్ద గోచరిస్తుండడానికి స్థానికులు చెబుతున్న కారణాలు..
● అంతర్వేది.. గోదావరి, సాగరం సంగమ ప్రదేశం కావడంతో అమావాస్య, పౌర్ణమిలకు పోటెత్తే ఉప్పునీరు సాధారణ రోజుల్లో కూడా ఎగదన్నుతోంది.
● రోజూ పోటు సమయంలో సముద్రం నీరు గోదావరి వైపునకు పోటెత్తడం, ఎగువ ప్రాంతాల నుంచి జిల్లాకు చిట్ట చివరనున్న అంతర్వేదికి చేరే గోదావరి నీటి ప్రవాహం తోడవ్వడంతో నీటి మట్టం రెట్టింపు అవుతోంది.
● సముద్ర గర్భంలో అప్పటికప్పుడు వచ్చే మార్పులకు సముద్రం నీరు బిగపెట్టడంతో (సంగమం వద్ద గోదావరి నీరు సముద్రంలోకి రానీయకుండా), ఆ సమయంలో గోదావరి ప్రవాహం దిశ మళ్లీ సమీప సరుగుడు తోటలను ముంచెత్తుతోంది.
● విపత్తుల సమయాల్లో సంగమంకు పశ్చిమ వైపు బియ్యపుతిప్ప గ్రామం వద్ద ఇసుక మేటలు ఏర్పడతాయి. దీంతో కెరటాల ఉధృతి ప్రభావం సంగమంకు రెండో వైపు అంతర్వేది తీరంపై పడడంతో భూములకు, సరుగుడు తోటలకు సముద్రపు కోత పెద్ద సమస్యగా మారింది.
● అంతర్వేది లైట్‌హౌస్ వద్ద తీరం మలుపు తిరిగి ఉండడంతో సంగమంకు పశ్చిమ వైపుకంటే తూర్పువైపునున్న అంతర్వేది వద్ద నీటి ప్రవాహ వేగం తీవ్రంగా ఉండడంతో ఆ ప్రాంతానికి ఉప్పునీరు చొచ్చుకు వస్తోంది.
● 2001, 2008 సంవత్సరాల్లో లైట్‌హౌస్‌కు సమీపంలోని పల్లిపాలెం గ్రామ రక్షణకు నిర్మించిన గ్రోయన్లు, వాటి మధ్య రివిట్‌మెంట్ పూర్తిగా కోత కారణంగా చతికిలబడి పోటునీరు అడ్డుఅదుపూ లేకుండా పల్లపు ప్రాంతాలను ముంచెత్తుతోంది.
● గతానికి ఇప్పటికీ సముద్రం సుమారు 500 మీటర్లు ముందుకు చొచ్చుకు రావడంతో తరచూ పోటు సమయంలో సమీప ప్రాంతాల్లో ఉగ్రరూపం చూపిస్తోంది.
● గతంలో కొత్తలైట్‌హౌస్ వద్ద నుంచి సరుగుడు తోటలు విస్తారంగా ఉండేవి. సంద్రం కోత కారణంగా కొద్ది సంవత్సరాలుగా సుమారు 500 ఎకరాల్లో సరుగుడు తోటలు సముద్ర గర్భంలో కలిసిపోయాయి.
పశ్చిమం వైపున దిబ్బలు
సాగర సంగమంకు పశ్చిమంవైపున బియ్యపుతిప్ప వద్ద సముద్రం ఇసుక దిబ్బలు వేస్తుండడం, ఆ కారణంగా తూర్పువైపున నీటి ప్రవాహ వేగం పెరగడం వల్ల లైట్‌హౌస్ వద్ద తరచూ నీరు పోటెత్తుతోంది. సముద్రం పోటు నీరుకు గోదావరి నీటి ప్రవాహం తోడవ్వడంతో ఇక్కడ నీటిమట్టం పెరిగిపోతోంది.
– కొల్లాటి నరసింహస్వామి, మాజీ సర్పంచ్, పల్లిపాలెం
పెరిగిన కెరటాల ఉధృతి
లైట్‌హౌస్ వద్ద తీరం ఒంపు తిరిగి ఉండడంతో సముద్రం కెరటాల వడి మరింత పెరిగింది. దీంతో అమావాస్య, పౌర్ణమిలతో పాటు సాధారణ రోజుల్లోనూ సముద్రం పోటెత్తి తీరం వరకూ చేరుతోంది.
– చొప్పల చిట్టిబాబు, మాజీ సర్పంచ్, పల్లిపాలెం
Comments
Please login to add a commentAdd a comment