పిచ్‌ను పరిశీలించిన డీఈవో
అమలాపురం టౌన్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ 68వ అంతర్ జిల్లాల (రాష్ట్ర స్థాయి) అండర్–14 క్రికెట్ పోటీల వేదిక అయిన అమలాపురం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో రూపుదిద్దుకుంటున్న పిచ్‌ను డీఈవో ఎస్‌కే సలీమ్ బాషా శుక్రవారం పరిశీలించారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో అమలాపురంలో జరగనున్న ఈ పోటీలకు సంబంధించిన ఏర్పాట్లపై ఫిజికల్ డైరెక్టర్లు, వ్యాయామ ఉపాధ్యాయులతో డీఈవో బాషా ఆ క్రీడా స్థలంలోనే చర్చించారు. అమలాపురం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానం, బాలయోగి స్టేడియం, కిమ్స్ వైద్య కళాశాల క్రీడా మైదానంలో మూడు రోజులపాటు ఏకకాలంలో జరిగే ఈ పోటీలకు రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల నుంచి హాజరయ్యే క్రీడాకారులకు తగిన వసతులపై కూడా వారితో మాట్లాడారు.
ఈ సందర్భంగా జెడ్పీ బాలురు ఉన్నత పాఠశాల ఫిజకల్ డైరెక్టర్లు జి.గోవింద్, తోట రవిలకు క్రికెట్ పిచ్ తయారీపై డీఈవో సూచనలు, సలహాలు ఇచ్చారు. జిల్లా క్రికెట్ కోచ్ రాయుడు సతీష్ ఆధ్వర్యంలో క్రికెట్ పిచ్ తయారవుతోంది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి అడబాల విజయ శ్రీనివాస్, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం కార్యదర్శి బీవీవీఎస్‌ఎన్ మూర్తి డీఈవో బాషాతో కలిసి క్రికెట్ పిచ్‌ను పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment