లక్ష్యాలు సాధించాలి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలో రెండో వంద రోజుల కార్యాచరణ అమలుకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని అధికారులను కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. వివిధ శాఖల ప్రగతి లక్ష్యాల పురోగతిపై తన చాంబర్‌లో గురువారం ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వరితో పాటు ఇతర అంతర పంటలను, భూసార పరీక్షలను ప్రోత్సహించాలని సూచించారు. కౌలు రైతులకు, రైతులకు రుణ లక్ష్యాలను పూర్తి చేయాలని చెప్పారు. మామిడి, అరటి, కోకో పండ్ల తోటల ప్రగతిపై కూడా కలెక్టర్ సమీక్షించారు. పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన అంతర్గత, అనుసంధాన రహదారులతో పాటు నిడదవోలు – పట్టెంపాలెం రోడ్డు అభివృద్ధికి అంచనాలు రూపొందించాలని ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ చేపట్టిన పనుల పురోగతిపై సమీక్షిస్తూ జిల్లాలో రోడ్ల అభివృద్ధికి సంబంధించి రూ.10 కోట్లతో 120 పనులు మంజూరయ్యాయని, 46 పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యిందని తెలిపారు. 19 గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయని, 6 పనులు పూర్తయ్యాయని చెప్పారు. మత్స్య, పశు సంవర్ధక శాఖల ప్రగతిపై కూడా కలెక్టర్ సమీక్షించారు.
షార్ట్ సర్క్యూట్‌తో
తాటాకిల్లు దగ్ధం
రాజమహేంద్రవరం రూరల్: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో తాటాకిల్లు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో సుమారు రూ.3 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. వివరాలు.. పిడింగొయ్యి పంచాయతీ పరిధిలో శ్రీలక్ష్మీ నగర్‌లో విజయ సిరమిక్స్ యజమానికి చెందిన రెండు పోర్షన్ల తాటాకిల్లు ఉంది. దానిలో చుచుకొండ సత్యవతి, బిడిగి పద్మ నివసిస్తున్నారు. వీరిద్దరూ సిరామిక్ ఫ్యాక్టరీలో కూలి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా.. శుక్రవారం ఉదయం ఒక్కసారిగా తాటాకిల్లు నుంచి మంటలు వ్యాపించాయి. గమనించిన స్థానికులు వాటిని ఆర్పే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న జిల్లా సహాయ అగ్నిమాపక అధికారి పి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సత్యవతి పోర్షన్‌లో ఆధార్ కార్డులు, బ్యాంకు పుస్తకాలు, ఓటరు గుర్తింపు కార్డు, ఇన్స్యూరెన్స్ బాండ్లు, బంగారం చెవి దుద్దులు, వెండి పట్టీలు, ఆమె కుమారుడు హేమాద్రి నాయుడి ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు, సెల్‌ఫోన్లు కాలిపోయాయి. అలాగే పద్మ, ఆమె కుమారుడు రమేష్‌కు చెందిన దుస్తులు, బ్యాంకు పుస్తకాలు, ఆధార్ కార్డులు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో సుమారు రూ.3 లక్షల వరకూ ఆస్తినష్టం సంభవించిందని అగ్నిమాపక అధికారి పి.శ్రీనివాసరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment