రత్నగిరిపై ఘనంగా పడిపూజ
● ఆలయ ప్రాంగణంలో
ప్రతిధ్వనించిన సత్యదేవుని నామం
● వేలాదిగా తరలివచ్చిన స్వాములు
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో సత్య స్వాముల పడిపూజ (సత్యదేవ అనుగ్రహ పూజ) శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. రత్నగిరిపై సత్యదేవుని వార్షిక కల్యాణ మండపం వద్ద రాత్రి ఏడు గంటలకు దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, అడ్డతీగలకు చెందిన పవనగిరి స్వామీజీ జ్యోతి వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గణపతి పూజతో పండితులు పడి పూజకు శ్రీకారం చుట్టారు. వేదస్వస్తి పలికారు. సత్యదేవునికి, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి, శంకరులకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సత్య స్వాములతో పూజ చేయించారు. స్వామి, అమ్మవార్లకు వేదాశీస్సులు, మంగళహారతితో రాత్రి ఏడు గంటలకు ఈ పూజ వైభవంగా ముగిసింది. సత్యదీక్ష పడిపూజ, దీక్ష విరమణ ఏర్పాట్లు చాలా బాగున్నాయని పవనగిరి స్వామీజీ అన్నారు. వేద పండితులు గొల్లపల్లి గణపతి ఘనపాఠి, యనమండ్ర శర్మ, ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం, అర్చకులు సుధీర్, దత్తుశర్మ, వైదిక కార్యక్రమాల పర్యవేక్షకుడు కామేశ్వరశర్మ, కల్యాణబ్రహ్మ చామర్తి కన్నబాబు, పురోహితులు నాగాభట్ల రవిశర్మ, అంగర సతీష్, పాలంకి పట్టాభి తదితరులు ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేలాదిగా తరలివచ్చి న సత్య స్వాములు ‘జై సత్యదేవ’ అంటూ భక్తితో చేసి న నామస్మరణ రత్నగిరి అంతటా ప్రతిధ్వనించింది.
నేడు సత్య దీక్షల విరమణ
సత్య దీక్షలు 27, 18, 9 రోజుల పాటు చేసిన స్వాములు సత్యదేవుని జన్మనక్షత్రం మఖ సందర్భంగా శనివారం దీక్ష విరమించనున్నారు. ఈ సందర్భంగా వేలాదిగా స్వాములు రత్నగిరికి రానుండడంతో అధికారులు వార్షిక కల్యాణ మండపం వద్ద దీక్ష విరమణకు ఏర్పాట్లు చేశారు. అక్కడే హోమ గుండం కూడా ఏర్పాటు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల నుంచి వచ్చిన సుమారు వెయ్యి మంది గిరిజన సత్య స్వాములు శుక్రవారం సాయంత్రం సత్యదేవుని వ్రతాలాచరించారు. వారికి దేవస్థానం ప్రసాదాలు బహూకరించింది.
నేడు జన్మనక్షత్ర పూజలు
సత్యదేవుని జన్మ నక్షత్రం మఖ సందర్భంగా శనివారం తెల్లవారుజామున స్వామి, అమ్మవారు, శంకరుల మూలవిరాట్టులకు పంచామృతాభిషేకం నిర్వహించనున్నారు. వేకువన ఒంటిగంటకే స్వామివారి ఆలయం తెరచి పూజలు చేస్తారు. స్వామి, అమ్మవార్ల అభిషేకాల అనంతరం ఉదయం 5 గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. దీక్ష విరమించిన స్వాములకు మాత్రం తెల్లవారుజామున 3 గంటల నుంచి ప్రత్యేక దర్శనాలు కల్పించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment