నేడు విధుశేఖర భారతీ స్వామి రాక
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ధర్మ విజయ యాత్రలో భాగంగా శ్రీ శృంగేరి శారదా పీఠం ఉత్తరాధికారి జగద్గురు విధుశేఖర భారతీ మహాస్వామి మంగళవారం రాజమహేంద్రవరం రానున్నారు. నగరంలోని గోదావరి గట్టున ఉన్న శ్రీ శృంగేరి శంకర మఠం, శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ప్రాంగణాల్లో నాలుగు రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. త్యాగరాజ నారాయణదాస సేవా సమితిలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కార్యక్రమాల కన్వీనర్లు విశ్వనాథం భాస్కరరామ్, మద్దూరి శివసుబ్బారావు, శంకరమఠం ధర్మాధికారి వేలూరి బాలాజీ, వేదుల శేషగిరి వరప్రసాద్, గౌతమీ నేత్రాలయం సీఈఓ వి.విజయకుమార్ ఈ వివరాలు వెల్లడించారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు శృంగేరి మఠానికి చేరుకునే జగద్గురువులకు పూర్ణకుంభ స్వాగతం పలుకుతామని భాస్కరరామ్ చెప్పారు. 6.30 గంటలకు వేదస్వస్తి, నాదస్వరం, నామ సంకీర్తనలతో శంకరమఠం నుంచి త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి ప్రాంగణం వరకూ శోభాయాత్ర జరుగుతుందని వివరించారు. రాత్రి 7.30 గంటలకు జరిగే స్వాగత సభలో ప్రాచార్య శలాక రఘునాథశర్మ స్వాగత పత్రం సమర్పిస్తారని, అనంతరం జగద్గురువుల అనుగ్రహ భాషణం, మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణశాస్త్రిచే శృంగేరి పీఠ వైభవ ప్రవచనం ఉంటాయని తెలిపారు. బుధవారం ఉదయం 9 గంటలకు శ్రీ శృంగేరి శంకర మఠంలో శ్రీ శారదాంబ, శ్రీ శంకరాచార్య, శ్రీ దత్తాత్రేయ స్వామి విగ్రహాల ప్రతిష్ఠలు, కుంభాభిషేకం, శిఖరాభిషేకం, 1910లో వాసుదేవానంద సరస్వతి స్వామి ప్రతిష్ఠించిన దత్త పాదుకల పునఃప్రతిష్ఠ జరుగుతాయని వివరించారు. అనంతరం జగద్గురువుల సమక్షంలో సేవా సమితి ప్రాంగణంలో ఉదయం 10.30 గంటలకు వేదసభ, సాయంత్రం 5 గంటలకు శతావధాని గన్నవరం లలితాదిత్య అష్టావధానం, పండిత సత్కారం ఉంటాయని తెలిపారు. విధుశేఖర భారతీ స్వామి గురువారం నాయకంపల్లి, తుని ప్రాంతాల్లో పర్యటిస్తారన్నారు. తిరిగి సాయంత్రం 7 గంటలకు సేవా సమితి ప్రాంగణానికి చేరుకుంటారన్నారు. జగద్గురువులు శుక్రవారం ఉదయం 9 గంటలకు విరించి వానప్రస్థాశ్రమాన్ని సందర్శిస్తారని తెలిపారు. అక్కడ గురువందన సభ, మహాస్వామి అనుగ్రహ భాషణం ఉంటాయన్నారు. గౌతమీ నేత్రాలయం ఆధ్యర్యాన స్వామి వారి ఆశీస్సులతో పిల్లల్లో అంధత్వ నివారణ, ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ మహాపాశుపత రుద్రహోమం, పిల్లలకు కంటి వైద్య శిబిరం జరుగుతాయని తెలిపారు. స్వామీజీ ఉదయం 10.30 గంటలకు కొంతమూరులోని శ్రీ దత్తాత్రేయ వేద గురుకులాన్ని సందర్శిస్తారన్నారు. సాయంత్రం 5 గంటలకు ఆర్ట్స్ కశాశాలలో జరిగే శివపార్వతుల కల్యాణంలో జగద్గురువులు అనుగ్రహ భాషణం చేస్తారని, రాత్రి 8 గంటలకు సేవా సమితి ప్రాంగణంలో దీపోత్సవం, గురువందన సభ, చందమౌళీశ్వర ఆరాధన జరుగుతాయని వివరించారు. భక్తులందరూ స్వామివారిని దర్శించుకోవాలని భాస్కరరామ్ కోరారు. సమావేశంలో వక్కలంక శ్రీరామచంద్రమూర్తి, మద్దూరి శివరామ శశిభూషణ్, గౌతమీ నేత్రాలయం వైద్యుడు శ్రీనివాసరెడ్డి, డాక్టర్ పోలాప్రగడ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment