డీపీఓకు సైతం..
జిల్లా పంచాయతీ అధికారి(డీపీఓ)గా పని చేస్తున్న బొబ్బరాడ శ్రీనివాసరావు అనారోగ్యంతో కొద్ది రోజుల కిందట నగరంలోని ఓ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరారు. కొద్ది రోజుల చికిత్స అనంతరం మరణించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లనే ఆయన మృతి చెందారని, బిల్లులపై ఉన్న శ్రద్ధ వైద్యంపై లేదని ఆరోపిస్తూ స్వయంగా పంచాయతీరాజ్ శాఖ అధికారులే ఆ ఆసుపత్రిపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి విచారణ నిర్వహించారు.
డబ్బులిస్తేనే మాట్లాడతా..
వెంకట్రావు అనే వ్యక్తికి తీవ్ర అనారోగ్యం చేసింది. పరిస్థితి చాలా విషమంగా మారిందని వైద్యులు తెలిపారు. అయితే ఆ రోగి కుటుంబీకులు మెరుగైన చికిత్స అందించే ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రి కోసం వెతకసాగారు. ఈ క్రమంలో దానవాయిపేటలోని ఒక స్కానింగ్ సెంటర్ ఎదురుగా ఉన్న ఆసుపత్రికి వెళ్లారు. రిపోర్టులు చూసి, వైద్య సేవలను నిర్ధారిస్తే పేషెంటును అక్కడికే తీసుకువస్తామని, అత్యవసర చికిత్స అందించాలని రిసెప్షన్‌లో కోరారు. అయితే, రూ.1,000 చెల్లిస్తేనే డాక్టర్ మాట్లాడతారని వారు చెప్పారు. రోగి బంధువులు కాళ్లావేళ్లా పడినా వైద్యుడు, సిబ్బంది కనికరించలేదు. చేసేది లేక వారు నిస్సహాయంగా వెనుతిరిగారు. ఈ సంఘటన రెండు వారాల క్రితం చోటు చేసుకుంది.
రూ.లక్షలు చెల్లిస్తేనే మృతదేహం
రెండు నెలల కిందట రాజమహేంద్రవరం రూరల్ రాజవోలుకు చెందిన ఓ గర్భిణికి నెలలు నిండకుండా నొప్పులు వచ్చాయి. ప్రకాశ్ నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి బంధువులు తీసుకుని వెళ్లారు. నెలలు నిండకుండా పుట్టిన బిడ్డను ఇంక్యుబేషన్ బాక్సులో, వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని ఆసుపత్రి సిబ్బంది చెప్పడంతో కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. ఆ బిడ్డకు వివిధ ఇన్‌ఫెక్షన్లు ఉన్నాయని, వైద్యం అందిస్తున్నామని చెబుతూ రూ.22 లక్షల వరకూ వసూలు చేశారని వారు అంటున్నారు. మరో ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి ఆ ఆసుపత్రి వర్గాలు అంగీకరించలేదు. ఇంత ఖర్చు చేసినా.. చివరకు ఆ బిడ్డ దక్కలేదు. ఈ నెల 2న మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఇంత జరిగినా రూ.2.50 లక్షలు చెల్లించాకే మృతదేహాన్ని తీసుకు వెళ్లాలని నిష్కర్షగా చెప్పారు. ఇటు బిడ్డను, అటు డబ్బును నష్టపోయిన బాధితుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆసుపత్రి యాజమాన్యం తీరుపై ఆందోళనకు దిగారు. చివరకు మధ్యవర్తులు జోక్యం చేసుకుని నష్టపరిహారం ఇప్పించడంతో వివాదం సద్దుమణిగింది.
కోమాలో ఉన్నాడంటూ..
నిడదవోలులో ఇటీవల క్రిమిసంహారక మందు తాగి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ బాలుడిని సమీప ఆసుపత్రికి తరలించారు. అత్యవసర వైద్యం పేరుతో ఆ ఆసుపత్రి యాజమాన్యం రూ.40 వేలు కట్టించుకుంది. పరిస్థితి విషమించి ఆ బాలుడు కోమాలోకి వెళ్లడంతో రాజమహేంద్రవరంలోని ఎమర్జెన్సీ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ రెండు రోజులు వైద్యం అందించిన వైద్యులు రూ.1.50 లక్షల వరకూ వసూలు చేశారు. అయినప్పటికీ బాలుడి పరిస్థితి మెరుగుపడలేదు. అతడి పరిస్థితి ఏమిటో వైద్యులు స్పష్టంగా చెప్పలేదు. ఆగ్రహించిన కుటుంబ సభ్యులు ఆ బాలుడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మరణించాడు. ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, తమ నుంచి భారీగా డబ్బులు గుంజారని ఆరోపిస్తూ బంధువులు ఆందోళనకు దిగారు.
Comments
Please login to add a commentAdd a comment