చేనేత రంగాన్ని ప్రోత్సహించాలి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ప్రతి ఒక్కరూ ఖాదీ, చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి, ఈ రంగాన్ని ప్రోత్సహించాలని కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. జిల్లా చేనేత – జౌళి శాఖ ఆధ్వర్యాన కలెక్టరేట్‌లో సోమవారం ఏర్పాటు చేసిన చేనేత ఉత్పత్తుల ప్రదర్శనను ఆమె పరిశీలించారు. రూ.1,830 విలువైన చేనేత చీరను కొనుగోలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, చేనేత రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా లక్షలాది మంది కార్మికులకు జీవనోపాధి చూపించవచ్చని అన్నారు. ఉద్యోగులు వారంలో ఒక రోజు తప్పనిసరిగా చేనేత వస్త్రాలు ధరించాలన్నారు. చేనేత – జౌళి ఉత్పత్తుల మార్కెట్‌ను మరింత పెంచుకునేందుకు డిజిటల్ లావాదేవీల నిర్వహణా సామర్థ్యం పెంచుకోవాలని సూచించారు. ఎంపిక చేసిన వస్త్రాలపై 30 శాతం రాయితీ ఇస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు, డీఆర్‌ఓ టి.సీతారామమూర్తి, చేనేత – జౌళి శాఖ సహాయ సంచాలకుడు పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.
నిర్దేశిత సమయంలో
అర్జీలు పరిష్కరించాలి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఫిర్యాదీల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వరమే న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసల్ సిస్టం (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో ఆయన జిల్లా నలుమూలల నుంచీ వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 29 ఫిర్యాదులు రాగా, వాటిపై సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేరుగా మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (లా అండ్ ఆర్డర్) అల్లూరి వెంకట సుబ్బరాజు, అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) ఎన్‌బీఎం మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
విద్యా సంస్థలకే
ఫీజుల చెల్లింపు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తం ఆయా విద్యా సంస్థలకే నేరుగా విడుదలవుతుందని కలెక్టర్ పి.ప్రశాంతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలోనే ఈ ఏడాదికి సంబంధించిన మొత్తం మంజూరు చేస్తామని, బకాయిలు సైతం దశల వారీగా విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే కళాశాలల యాజమాన్యాలకు రాత పూర్వకంగా ఈ విషయం తెలియజేశామన్నారు. ప్రభుత్వ ఆదేశాలను ఉలంఘించి, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి బలవంతంగా ఫీజు వసూళ్లకు పాల్పడినా, హాల్ టికెట్లు ఇవ్వకుండా ఆటంకం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొన్ని కళాశాలలు విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపారు.
నూతన జాతీయ విద్యా
విధానాన్ని వ్యతిరేకించాలి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.కిరణ్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఇప్పటి వరకూ విద్యా వ్యవస్థలో నెలకొని ఉన్న సంక్షోభాలకు, సమస్యలకు ఒక పరిష్కారాన్ని సూచించేదిగా విద్యా విధానం ఉండాలన్నారు. ప్రస్తుతం ఉన్న 10+2+3 విధానానికి బదులు 5+3+3+4 పద్ధతిని నూతన విద్యా విధానం ప్రతిపాదించిందని తెలిపారు. 1 నుంచి 12వ తరగతి వరకూ ఉచిత నిర్బంధ విద్య ఉండాలన్న కస్తూరి రంగన్ నివేదికను ఈ విద్యా విధానం పట్టించుకోలేదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment