పోస్టులే లేవు.. భర్తీ చేసేశారు | - | Sakshi
Sakshi News home page

పోస్టులే లేవు.. భర్తీ చేసేశారు

Published Sat, Nov 23 2024 4:01 AM | Last Updated on Sat, Nov 23 2024 4:01 AM

-

జీజీహెచ్‌లో అవినీతి బాగోతం

పోస్టుకు రూ.5 లక్షల వసూలు!

నేడు విచారణ నివేదిక

కాకినాడ క్రైం: నోటిఫికేషన్‌ పడితే ఉద్యోగాల పేరుతో సొమ్ములు దండుకునే సంఘటనలు చూస్తుంటాం. కానీ, లేని ఉద్యోగాలు ఉన్నట్టుగా నమ్మించి, అమ్మేసి సొమ్ము చేసుకున్న ఘనులు కాకినాడ జీజీహెచ్‌లో తిష్ట వేశారు. కలెక్టర్‌ దృష్టికి వెళ్లిన ఈ అవినీతి బాగోతంపై శనివారానికి విచారణ పూర్తి చేసి, నివేదిక రూపొందించే పనిలో అధికారులున్నారు. ఇప్పటికే నర్సింగ్‌ పోస్టుల విక్రయాల అవినీతి ఆరోపణల్లో పీకల్లోతు కూరుకుపోయిన జీజీహెచ్‌లోని ఒక అధికారితో పాటు ఒక ఏడీ స్థాయి అధికారి ఈ బాగోతానికి బాధ్యులని ప్రాథమికంగా గుర్తించారు. వైద్య సేవల పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలు, కేడర్ల వారీగా నియామకాలపై వైద్య విద్య సంచాలకుడు (డీఎంఈ) డీఎస్‌వీఎల్‌ నరసింహం ఇటీవల జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ను నివేదిక కోరిన సందర్భంలో ఈ అవినీతి బాగోతాలు వెలుగు చూశాయి.

2008లో ఆర్థిక శాఖ విడుదల చేసిన జీఓ–487 ప్రకారం వివిధ కేడర్లలో 620 పోస్టులు ఖాళీగా ఉండగా, 2016లో మరో 160 స్టాఫ్‌ నర్సు పోస్టులు మంజూరయ్యాయి. 2018లో మంజూరైన 2 ఓబీజీ (ఆబ్‌స్ట్రిక్స్‌ ఇన్‌ గైనకాలజీ) యూనిట్లలో 11 మంది ఎంఎన్‌ఓలు (ఔట్‌సోర్సింగ్‌), 12 మంది ఎఫ్‌ఎన్‌ఓలు (ఔట్‌సోర్సింగ్‌), 9 మంది హెడ్‌ నర్సులు, ఆరుగురు మెడికల్‌ ఆఫీసర్లు, 21 మంది స్టాఫ్‌ నర్సుల నియామకాలకు ఏర్పాట్లు చేశారు. ఈ నియామకాల అనంతరం మిగులు పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు జీఓలు 62, 63, 140 విడుదల చేసి, మిగులు పోస్టులను అప్పటికే ఖాళీగా ఉన్న పోస్టుల స్థానంలో భర్తీ చేయాలని ఆదేశాలిచ్చారు.

కొత్త పోస్టులు సృష్టించి..

ఆ సమయంలో జీజీహెచ్‌లో చక్రం తిప్పుతున్న ఓ అధికారి మిగులు పోస్టుల భర్తీ చేపట్టకుండా సమాంతరంగా కొత్త పోస్టులు సృష్టించి నియామకాలు చేపట్టారు. ఒక్కో పోస్టుకు రూ.5 లక్షలు వసూలు చేసి 40 పోస్టింగ్‌లు ఇచ్చినట్టు జీజీహెచ్‌ కోడై కూస్తోంది. ఎంఎన్‌ఓ, ఎఫ్‌ఎన్‌ఓ, డార్క్‌ రూమ్‌ అసిస్టెంట్లు, ఎలక్ట్రీషియన్‌ గ్రేడ్‌–2, రేడియోగ్రాఫర్లు, ఫార్మసిస్టు పోస్టులను నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టేశారు. ఉదాహరణకు ఫార్మసిస్టు విభాగంలో 17 రెగ్యులర్‌ పోస్టులున్నాయి. పడకల సంఖ్య ఆధారంగా మరో 10 పోస్టులు మంజూరు చేశారు. అలా 27 పోస్టులుంటే 31 మందికి అక్కడ పోస్టింగ్‌లు ఇచ్చారని ప్రాథమికంగా తేల్చారు.

రోస్టర్‌ ఊసే లేదు

ఈ నియామకాల్లో రోస్టర్‌ ఊసే లేదు. వాచ్‌ రిజిస్టర్‌ లేదు. కేడర్‌ స్ట్రెంగ్త్‌ వివరాల నమోదూ లేదు. ఇవేవీ లేకుండా భర్తీ చేయడంలో కీలకంగా వ్యవహరించిన అధికారిని ఉన్నతాధికారులు విచారించినట్టు తెలిసింది. నియామక ప్రక్రియలో బాధ్యులైన వారి సంతకాలను ఈ అంశంపై పరిశీలన జరుపుతున్న బృందం గుర్తించింది. ఈ వ్యవహారంపై ఈ నెల 17నే కలెక్టర్‌, డీఎంఈలకు నివేదిక పంపాల్సి ఉన్నా కారణాంతరాలతో జాప్యం జరిగింది.

జీతాల నిలుపుదల

ఇదిలా ఉండగా అక్రమంగా ఉద్యోగాలు పొందిన వారి భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది. బాధ్యులపై చర్యలు తీసుకునే వరకూ అక్రమంగా నియమితులైన వారి జీతాలు నిలుపు చేస్తామని ఆసుపత్రి అధికారులు చెబుతున్నారు. దీనిపై కలెక్టర్‌, డీఎంఈలకు సిఫారసు చేస్తామంటున్నారు. నర్సింగ్‌ ఉద్యోగాల భర్తీలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారే ఈ ఉద్యోగాల భర్తీలో అవినీతిపై కూడా విచారణను ఎదుర్కోవాల్సి రావడం చర్చనీయాంశంగా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement