ఆపేదెవరు? | - | Sakshi
Sakshi News home page

ఆపేదెవరు?

Published Sat, Nov 23 2024 4:01 AM | Last Updated on Sat, Nov 23 2024 4:01 AM

ఆపేదె

ఆపేదెవరు?

కోటిలింగాల–2 ర్యాంపు వద్ద పడవ పక్కనే డ్రెడ్జింగ్‌ బోటు

బరి తెగిస్తున్న ఇసుక మాఫియా

యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు

నిబంధనలకు తిలోదకాలు

కోటిలింగాల రేవు–2 వద్ద ఆగని డ్రెడ్జింగ్‌

పడవలు కనపడకుండా నయా దందా

అధికారులను లెక్క చేయని ఇసుకాసురులు

సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి నేతల అండదండలతో ఇసుక మాఫియా బరి తెగిస్తోంది. నిబంధనలను గోదావరిలో తొక్కి నదిని ఇష్టమొచ్చినట్లు తవ్వేయడం.. అక్రమంగా ఇసుక తరలించి రూ.లక్షలు దండుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది. అడ్డగోలు వ్యవహారానికి తెగబడుతూ.. గుట్టు చప్పుడు కాకుండా రూ.కోట్ల విలువ చేసే ఇసుకను లారీలు, ట్రాక్టర్లలో రాత్రికి రాత్రే జిల్లా సరిహద్దులు దాటించేస్తున్నారు. కూటమి నేతల అధికార బలాన్ని ఎదిరించలేకో.. మామూళ్లకు లొంగిపోయో అధికారులు, పోలీసులు.. తప్పు జరుగుతోందని తెలిసినా మిన్నకుండిపోతున్నారు. ఇటీవల జిల్లాలో పలు ర్యాంపుల్లో జరుగుతున్న అక్రమాలు బహిర్గతమైన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఆపేవారు.. అడ్డుకునే వారు లేకపోవడంతో ఇసుకాసురులు గోదావరి నదిని గుల్ల చేసేస్తున్నారు.

కోటిలింగాల రేవును కొల్లగొట్టేస్తున్నారు!

రాజమహేంద్రవరం నగరంలోని కోటిలింగాల రేవు–2 ర్యాంపులో ఇసుకను అధికార కూటమి నేతలు ఇద్దరు కొల్లగొట్టేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా డ్రెడ్జింగ్‌కు పాల్పడుతున్నారు. ఈ అక్రమ తవ్వకాలను ఇప్పటి వరకూ రాత్రి 11 గంటలకు ప్రారంభించే వారు. అధికారం అండగా ఉండగా తమను అడ్డుకునేదెవరనుకున్నారో ఏమో కానీ.. తాజాగా పట్టపగలే దోపిడీ మొదలు పెట్టేశారు. రాత్రుళ్లు అయితే అనుమానం వస్తుందనే తలంపుతో పగటి సమయంలోనే యథేచ్ఛగా డ్రెడ్జింగ్‌ చేపడుతున్నారు. కోటిలింగాల రేవు–2 నుంచి ప్రతి రోజూ సుమారు 100 లారీలకు పైగా ఇసుక ఇతర జిల్లాలకు తరలిపోతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాత్రి సమయాల్లో ఇసుక వెలికితీత, లోడింగ్‌, అన్‌లోడింగ్‌ పూర్తిగా నిషేధం. అయితే, కోటిలింగాల రేవు–2 ర్యాంపులో ఇటువంటి నిబంధనలు ఏమాత్రం అమలు కావడం లేదు. పత్రికల్లో కథనాలు వచ్చిన రోజు మాత్రం ఇసుక తవ్వకాలు ఆపేస్తున్నారు. తిరిగి మరుసటి రోజు నుంచే మొదలు పెట్టేస్తున్నారు.

ఆకస్మిక తనిఖీలేవీ?

అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తే ఇసుక అక్రమార్కుల భరతం పట్టే అవకాశం దక్కేది. కానీ, అధికారులు మీడియాలో కథనాలు వచ్చిన తర్వాత తాపీగా ర్యాంపుల వద్దకు వెళ్తున్నారే తప్ప.. రహస్యంగా, ఆకస్మికంగా తనిఖీలకు వెళ్లడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అధికారులు వస్తున్న విషయం ముందుగానే తెలుసుకుంటున్న ఇసుకాసురులు వెంటనే అప్రమత్తమవుతున్నారు. తాత్కాలికంగా డ్రెడ్జింగ్‌ నిలిపివేస్తున్నారు. దీంతో ఆ సమయంలో అధికారులు అక్కడకు వెళ్తున్నా ప్రయోజనం ఉండటం లేదు.

డ్రెడ్జింగ్‌ పడవకు ఇరువైపులా నాటు బోట్లు

గోదావరిలో డ్రెడ్జింగ్‌ నిషేధం. కానీ, ఇక్కడ డ్రెడ్జింగ్‌ చేసి మరీ ఇసుక తోడేస్తున్న మాఫియా ఎవ్వరికీ అనుమానం రాకుండా ఏర్పాట్లు చేసుకుంటోంది. డ్రెడ్జింగ్‌ బోటు బయటకు కనిపించకుండా ఇరువైపులా నాటు పడవలను ఉంచుతోంది. ఈవిధంగా దోచేస్తున్న ఇసుకకు 6 యూనిట్లకు రూ.15 వేల నుంచి రూ.20 వేలు వసూలు చేస్తున్నారు. ఒక్క కోటిలింగాల రేవు–2లోనే రోజుకు 100 ట్రిప్పులకు పైగా ఇసుకను విశాఖ, హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాలకు తరలిస్తూ రూ.లక్షలు దండుకుంటున్నారు. ఇదంతా తెలిసినా మైనింగ్‌ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

వేమగిరిలో వివాదం

ఇసుక దందా ఏ స్థాయిలో జరుగుతోందో చెప్పడానికి ఇటీవల కడియం మండలం వేమగిరి–1 ర్యాంపులో జరిగిన ఘటనే సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ ర్యాంపు వివాదం న్యాయస్థానంలో ఉన్నా లెక్క చేయకుండా రాత్రి వేళ యథేచ్ఛగా ఇసుక తవ్వి తరలించేశారు. ఈ వ్యవహారం చర్చనీయాంశం కావడంతో పాటు ఇసుక తవ్వుతున్న వీడియోలు వైరల్‌ అయ్యాయి. దీనిపై స్పందించిన అధికారులు ఇక్కడ తవ్వకాలు తాత్కాలికంగా ఆపేశారు. అంతలోనే వేమగిరి–2 ర్యాంపులో తవ్వకాలు జోరందుకున్నాయి. దీనికి సైతం అగ్రిమెంట్‌ లేదని తెలుస్తోంది. అసలు ఇక్కడ ఏ ర్యాంపునకు అనుమతులు ఉన్నాయి.. ఎవరు తవ్వుతున్నారనే విషయాలు అంతుచిక్కనివిగా ఉన్నాయి. ఎవరిని ప్రశ్నించినా తమకు అనుమతులు ఉన్నాయనే చెబుతున్నారు. అధికారులు మాత్రం దీనిపై స్పందించడం లేదు.

టన్ను టన్నుకూ కుమ్ముడే..

ప్రభుత్వం ఎంతగా గొప్పలు చెబుతున్నా.. ఉచిత ఇసుక ఏ ఒక్కరికీ అందడం లేదు. వేమగిరి – కడియపులంక ర్యాంపు–1లో ఇసుకను అధిక ధరలకు విక్రయిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం టన్ను ఇసుక ధర రూ.61 నిర్ణయించగా 20 టన్నుల లారీకి వినియోగదారు రూ.1,220 మాత్రమే చెల్లించాలి. దూరాన్ని బట్టి లారీ కిరాయి అదనం. కానీ, ఇక్కడ మాత్రం టన్ను ఇసుకకు రూ.350 చొప్పున 20 టన్నులకు రూ.7 వేలు వసూలు చేస్తున్నారు. నిర్ణీత ధరకంటే రూ.5,780 అధికంగా కొల్లగొడుతున్నారు. ర్యాంపులో ఇస్తున్న రశీదులో లారీ యజమాని పేరు, ఫోన్‌ నంబర్‌, డ్రైవర్‌ పేరు, ఫోన్‌ నంబర్‌, లారీ నంబర్‌, ఎక్కడి నుంచి ఎక్కడికి రవాణా అవుతోంది, ఎన్ని టన్నులు, టైమ్‌ తదితర అన్ని వివరాలూ ఉంటున్నాయి. కానీ చెల్లించిన ధర మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఇది దోపిడీకి సంకేతం కాదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

ఉచిత ఇసుకంటే ఇదేనా?

ఇసుక దోపిడీ ఆగడం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధికంగా వసూలు చేస్తున్నారు. జేగురుపాడుకు చెందిన ఓ వినియోగదారుడు వేమగిరి ర్యాంపులో 20 టన్నుల ఇసుక కొనుగోలు చేయగా.. 10 టన్నులకు మాత్రమే బిల్లు ఇచ్చారు. మిగిలిన 10 టన్నుల ఇసుకకు సంబంధించిన బిల్లులు ఏమైనట్లు? ఆ డబ్బులు ఎవరికి చేరాయి? ఇసుకను పారదర్శకంగా అందిస్తున్నామని ప్రభుత్వాధినేతలు, అధికారులు చెబుతున్నారు. ర్యాంపులో ఇస్తున్న రశీదును ఒకసారి పరిశీలిస్తే పారదర్శకత ఎంత ఉందో అర్థమవుతుంది. ప్రభుత్వం దళారీ వ్యవస్థను అరికట్టాలి. వినియోగదారుకు ఇచ్చే రశీదులో చెల్లించిన సొమ్ము కూడా ప్రింట్‌ చేసేలా చర్యలు తీసుకోవాలి.

– యాదల సతీష్‌చంద్ర స్టాలిన్‌, సర్పంచ్‌,

జేగురుపాడు, కడియం మండలం

No comments yet. Be the first to comment!
Add a comment
ఆపేదెవరు? 1
1/1

ఆపేదెవరు?

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement