అవినీతి మార్గం!
తిమ్మాపురంలో ఏడీబీ రోడ్డు శ్మశాన వాటిక వద్ద నుంచి
రాజీవ్‌గాంధీ కళాశాలకు వెళ్లే మార్గంలో నిర్మించిన సిమెంటు రోడ్డు
కాకినాడ రూరల్: అధికారం చేతిలో ఉంటే ఏం చేసినా చెల్లుతుందని అనుకుంటే పొరపాటే. ఇది ప్రజాస్వామ్యం.. ఎవరో ఒకరు పాలకుల తప్పులను బట్టబయలు చేయడానికి.. వాటికి అడ్డుకట్ట వేయడానికి ముందుకు వస్తూనే ఉంటారు. అటువంటి సంఘటనే ఇది. అధికారం అండతో ఓ నేత నిబంధనలకు విరుద్ధంగా.. ఏకంగా అధికారుల పైనే ఒత్తిడి తెచ్చి.. ఏకంగా ఓ ప్రైవేటు కళాశాలకు ఉపాధి హామీ పథకం నిధులతో సిమెంటు రోడ్డు నిర్మాణం చేయించారని, దీనిపై విచారణ చేయాలని అధికార కూటమిలోని ఓ పార్టీ నేత సాక్షాత్తూ కలెక్టర్‌కే ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన వివరాలివీ.. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామ పంచాయతీ పరిధిలో రూ.77.5 లక్షల ఉపాధి హామీ పథకం నిధులతో ఇటీవల 1,244 మీటర్ల పొడవైన సిమెంటు రోడ్డు నిర్మించారు. మూడు పనులుగా ఈ రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఏడీబీ రోడ్డు శ్మశాన వాటిక నుంచి రాజీవ్ గాంధీ కళాశాల వరకూ రూ.21.5 లక్షలు, ఆ కళాశాల ఎంట్రన్స్ నుంచి ఊర చెరువు వరకూ రూ.22.5 లక్షలు, తిమ్మాపురం నుంచి ఊర చెరువు దుర్గమ్మ గుడి వరకూ రూ.33.5 లక్షలతో ఈ రోడ్డు నిర్మించారు. ఈ పనులు జరిగిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. జనావాసాలు లేని ఈ మార్గంలో కేవలం ప్రైవేటు కళాశాల యాజమాన్యానికి లబ్ధి చేకూర్చేలా రోడ్డు నిర్మాణం చేపట్టారని, తద్వారా ఉపాధి నిధులు పక్కదారి పట్టాయని అధికార కూటమిలోని బీజేపీ నేత ఒకరు విమర్శిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఈ రోడ్డు నిర్మించాలంటే మొదట గ్రామ పంచాయతీ తీర్మానం చేయాలి. కానీ, అటువంటిదేమీ జరగలేదు. అయినప్పటికీ ఓ నియోజకవర్గ స్థాయి నేత పంతం పట్టి మరీ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఈ రోడ్డు వేయించారనే ఆరోపణలు వస్తున్నాయి. అది కూడా రెడీమేడ్ కాంక్రీటుతో కాంట్రాక్టర్ రహదారి నిర్మించడం విమర్శలకు తావిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పనులను ఆగమేఘాల మీద చేపట్టి, పూర్తి చేశారు. ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ సొంత పార్టీ జనసేనకు చెందిన పంతం నానాజీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన నియోజవర్గంలోనే ఉపాధి నిధులు దుర్వినియోగమవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ రోడ్డు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని, దీనిపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తిమ్మాపురానికి చెందిన అధికార కూటమిలోని బీజేపీకి చెందిన నాయకుడు కాళ్ళ ధనరాజు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్ ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
కాకినాడ రూరల్‌లో ప్రైవేటు
కళాశాలకు సిమెంటు రోడ్డు
పంచాయతీ తీర్మానం
లేకపోయినా నిర్మాణం
నియోజకవర్గ నేత ఒత్తిడి
తెచ్చారని విమర్శలు
ఉపాధి నిధులు పక్కదారి
పట్టాయని ఆరోపణలు
అవకతవకలపై కలెక్టర్‌కు
బీజేపీ నేత ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment