26న విధుశేఖర భారతీ స్వామి రాక
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ధర్మ విజయ యాత్రలో భాగంగా శ్రీ శృంగేరి పీఠాధిపతి, జగద్గురువులు విధుశేఖర భారతీ మహాస్వామి ఈ నెల 26న రాజమహేంద్రవరం రానున్నారు. ఈ నెల 26, 27, 28, 29 తేదీల్లో శ్రీ శృంగేరి శంకరమఠం, శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ప్రాంగణంలో జరిగే పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.
స్వామీజీ పర్యటన ఇలా..
ఫ విధుశేఖర భారతీ స్వామి 26వ తేదీ సాయంత్రం 6 గంటలకు రాజమహేంద్రవంలోని శ్రీ శృంగేరి శంకరమఠానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా శంకరమఠం నుంచి శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ప్రాంగణం వరకూ సాయంత్రం 6.30 గంటలకు వేదస్వస్తి, నాదస్వరం, నామ సంకీర్తనలతో శోభా యాత్ర జరుగుతుంది. రాత్రి 7 గంటలకు శంకరమఠం ధర్మాధికారి వేలూరి బాలాజీ దంపతులచే ధూళిపాద పూజ నిర్వహిస్తారు. రాత్రి 7.30 గంటలకు చంద్రమౌళీశ్వర పూజ జరుగుతుంది. ఈ సందర్భంగా స్వాగత సభలో జగద్గురువులు అనుగ్రహ భాషణం చేస్తారు. శృంగేరీ పీఠ వైభవంపై మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణశాస్త్రి ప్రవచనం ఉంటుంది. ప్రాచార్య శలాక రఘునాథశర్మ స్వాగత పత్రం సమర్పిస్తారు.
ఫ 27వ తేదీ ఉదయం 8 గంటలకు త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ప్రాంగణంలో స్వామీజీ చంద్రమౌళీశ్వరారాధన చేస్తారు. తొమ్మిది గంటలకు శ్రీ శృంగేరి శంకరమఠంలో శారదాంబ, శంకరాచార్య, దత్తాత్రేయ స్వామివార్ల విగ్రహ ప్రతిష్ఠలు, దత్త పాదుకల పునఃప్రతిష్ఠ, కుంభాభిషేకం, శిఖరాభిషేకాల్లో విధుశేఖర భారతీ స్వామి పాల్గొంటారు. 10.30 గంటలకు త్యాగరాజ సేవా సమితి ప్రాంగణంలో వేద సభ జరుగుతుంది. ఇక్కడే సాయంత్రం 5 గంటలకు శతావధాని గన్నవరం లలితాదిత్యచే అష్టావధానం, పండిత సత్కారం, గురువందన పూజ, చంద్రమౌళీశ్వరార్చన జరుగుతాయి.
ఫ 28వ తేదీ ఉదయం 8 గంటలకు సమితి ప్రాంగణంలో చంద్రమౌళీశ్వరారాధన జరుగుతుంది. 8.30 గంటలకు స్వామీజీ నాయకంపల్లి, తుని పర్యటనకు బయలుదేరుతారు. రాత్రి 7 గంటలకు త్యాగరాజ సేవా సమితికి జగద్గురువులు తిరిగి చేరుకుని చంద్రమౌళీశ్వర పూజ చేస్తారు.
ఫ 29వ తేదీ ఉదయం 8 గంటలకు సమితి ప్రాంగణంలో చంద్రమౌళీశ్వర పూజ జరుగుతుంది. అనంతరం స్వామీజీ విరించి వానప్రస్థాశ్రమాన్ని సందర్శించి, అనుగ్రహ భాషణం చేస్తారు. 10.30 గంటలకు కొంతమూరులోని దత్తాత్రేయ వేదగురుకులాన్ని సందర్శిస్తారు. సాయంత్రం 5 గంటలకు ఆర్ట్స్ కళాశాలలో అనుగ్రహ భాషణం చేస్తారు. రాత్రి 8 గంటలకు శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ప్రాంగణంలో దీపోత్సవం, గురువందన సభ, చంద్రమౌళీశ్వర పూజతో స్వామి వారి పర్యటన పూర్తవుతుందని విజయ యాత్ర కమిటీ ఒక ప్రకటలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment