రౌడీషీటర్లు, పాత ముద్దాయిలపై నిఘా
రాజమహేంద్రవరం రూరల్: రౌడీషీటర్లు, పాత ముద్దాయిలపై ప్రత్యేక నిఘా ఉంచాలని జిల్లా ఎస్పీ డి.నరసింహకిషోర్ పోలీసు అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో ఆయన నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ నరసింహకిషోర్ మాట్లాడుతూ బహిరంగ మద్యపానం, డ్రంక్ అండ్ డ్రైవ్ పై ముమ్మరంగా తనిఖీలు చేపట్టి కేసులు నమోదు చేయాలన్నారు. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా రిఫ్ రాఫ్ డ్రైవింగ్, రాష్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్ వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పోలీస్ శాఖ పట్ల ప్రజల్లో విశ్వసనీయత పెంపొందేలా ప్రతి ఒక్కరూ విధులు నిర్వర్తించాలన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రజలతో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని ఎస్పీ ఆదేశించారు. డయల్ 112 కు వచ్చే కాల్స్‌కు తక్షణమే స్పందించి, వెను వెంటనే నేర స్థలానికి చేరుకొని సమస్యను పరిష్కరించాలన్నారు. సారా, గంజాయి రవాణా, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించి దాడులు చేయాలని ఆదేశించారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించి ఆయా ప్రాంతాలలోని ప్రజల నుంచి సమాచారం తీసుకుని దాడులు నిర్వహించాలన్నారు. మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి అత్యధిక ప్రాధాన్యంతో ఆచూకీ కనుగొని వారి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. సైబర్ భద్రత, రోడ్డు భద్రత, మహిళా భద్రత, ఇంటి భద్రతపై ప్రతిరోజు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్పీ నరసింహకిషోర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ (లా అండ్ ఆర్డర్) అల్లూరి వెంకట సుబ్బరాజు, అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) ఎన్.బి.ఎం మురళీకృష్ణ , ఇన్‌స్పెక్టర్ (ఎస్‌బీ) ఏ. శ్రీనివాసరావు , ఇన్‌స్పెక్టర్ (డీసీఆర్‌బీ) పవన్ కుమార్‌రెడ్డి, జోనల్ డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ నరసింహకిషోర్
Comments
Please login to add a commentAdd a comment